కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2021-05-17T05:44:07+05:30 IST

సత్తుపల్లి, వైరా, ఏన్కూరు, కారేపల్లి మండలాల్లో ఐదో రోజు ఆదివారం కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ అమలు చేశారు. ఉదయం 10గంటల నుంచి ఎవరూ రోడ్లపైకి రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు

కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

 సత్తుపల్లిరూరల్‌/ వైరా/ ఏన్కూరు/ కల్లూరు, మే16 : సత్తుపల్లి, వైరా, ఏన్కూరు, కారేపల్లి మండలాల్లో ఐదో  రోజు ఆదివారం కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ అమలు చేశారు. ఉదయం 10గంటల నుంచి ఎవరూ రోడ్లపైకి రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఉదయం ఆరు గంటల నుంచి సడలింపు దొరకడంతో నిత్యావరసర వస్తువులు, ఇతర సామగ్రి కొనుగోలు చేస్తూ ప్రజలు వీధుల్లోకి వచ్చారు. అన్ని రకాల వ్యాపార కేంద్రాలు తెరుచుకున్నాయి. వైన్‌షాప్స్‌ వద్ద సాధారణ రద్దీ కనిపించింది. ఉదయం 10గంటల తర్వాత యథావిధిగా అన్ని వ్యాపార సంస్థలు మూతబడ్డాయి.  రాష్ట్ర సరిహద్దులోని మేడిశెట్టివారిపాలెం, పాకలగూడెం వద్ద వాహనాలను తనిఖీచేస్తూ అనుమతి పత్రాలు ఉంటేనే అనుమతిస్తున్నారు. వైరా మండలం దాచాపురం వద్ద సరిహద్దు చెక్‌పోస్టులో వాహనాలు తనిఖీలు చేసి రాకపోకలను నిలిపివేశారు. వైరాసీఐ జె.వసంతకుమార్‌, ఎస్‌ఐ వి.సురేష్‌ లాక్‌డౌన్‌ను పర్యవేక్షించారు. సత్తుపల్లి డివిజన్‌లో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలుచేస్తున్నామని ఏసీపీ వెంకటేష్‌ తెలిపారు. శనివారం రాత్రి ఏన్కూరులో అమలవుతున్న లాక్‌డౌన్‌ పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నియంత్రణకు ప్రజలంతా సహకరించాలని, స్వీయరక్షణే కరోనా నియంత్రణకు సాధ్యమవుతుందని తెలిపారు. ప్రజలు అనవసరంగా రోడ్లపై తిరిగితే జరిమానాలతో పాటు చర్యలు తప్పవని హెచ్చరించారు. దుకాణదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, భౌతిక దూరం పాటించే విదంగా మాస్క్‌లు ధరించే విధంగా అవగాహన కల్పించాలన్నారు. దుకాణాల దగ్గర గుంపులుగా ఉండరాదని సూచించారు. ప్రజల సహకారంతోనే కరోనా నియంత్రణ సాధ్యమవుతుందని కార్యక్రమంలో సీఐ తాటిపాముల కరుణాకర్‌, ఎస్‌ఐ శ్రీకాంత్‌, ట్రెయినీ ఎస్‌ఐ లక్ష్మీభార్గవి, సిబ్బంది పాల్గొన్నారు. కారేపల్లి రూరల్‌ పరిధిలో లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలుచేస్తున్నట్లు రూరల్‌ సీఐ బి. శ్రీనివా్‌సలు తెలిపారు.  

 నిబంధనలు బేఖాతరు

 కల్లూరు పట్టణంలోని పలు వ్యాపార సంస్థలు, మాంసం, చేపల మార్కెట్ల వద్ద ఆదివారం వినియోగదారులు కిక్కిరిసిపోయారు.  మండల అధికారులు ఆయా వ్యాపార సంస్థల యాజమానులు నిబంధ నలు పాటించకపోయినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి.  

Updated Date - 2021-05-17T05:44:07+05:30 IST