ఈ నగరానికి ఏమైంది!?

ABN , First Publish Date - 2020-04-02T09:21:09+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలకు విస్తరించిన కరోనా మహమ్మారి నగరంలోనూ కోరలు చాస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది.

ఈ నగరానికి ఏమైంది!?

లాక్‌డౌన్‌ నిబంధనలు బ్రేక్‌

కిటకిటలాడుతున్న మార్కెట్లు

కానరాని భౌతిక దూరం స్పృహ

అంతర్గత రోడ్లపై ఆగని వాహనాల రాకపోకలు

అవసరం లేకపోయినా రహదారులపైకి...

కూరగాయలు కొనుగోలుకు కొంతమంది రోజూ బజార్‌కు వస్తున్న వైనం 

ఇలాగైతే ముప్పేనంటున్న వైద్యులు

ఒకరికి వైరస్‌ వున్నా నిమిషాల్లో వందలాది మందికి వ్యాప్తిచెందే అవకాశం

ప్రధాన కూడళ్లలో మాత్రమే నిబంధనల అమలు

నిర్మానుష్యంగా కనిపిస్తున్న రైల్వేస్టేషన్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌ ప్రాంతాలు 


(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం): ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలకు విస్తరించిన కరోనా మహమ్మారి నగరంలోనూ కోరలు చాస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకే కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే నిత్యావసర, అత్యవసర పనుల మీద బయటకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఇంత హడావిడి జరుగుతున్నా నగరవాసులు మాత్రం ఏమీ పట్టనట్టు మార్కెట్ల వద్ద భౌతిక దూరం పాటించకుండా మసులుతున్నారు. ఈ నిర్లక్ష్యంతో పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


వేలాది మంది ప్రాణాలు బలిగొంటున్న కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయడం ఎలా? అని ప్రపంచ దేశాలు తలలు పట్టుకుంటుంటే...నగరవాసులు మాత్రం దాని తీవ్రతను గుర్తించడం లేదు. వైరస్‌ వ్యాప్తిని నిరోధించాలంటే ప్రజలంతా ఇంట్లోనే గడపడం ఒక్కటే మార్గమని వైద్య నిపుణులు స్పష్టంచేయడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ఒకవేళ వచ్చినా మాస్కులు ధరించి, వ్యక్తికి వ్యక్తికి మధ్య కనీసం మీటరు దూరం పాటించాలని సూచించాయి. అయితే నగరంలో మాత్రం చాలామంది దీనిని పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇలాంటి నిర్లక్ష్యం కారణంగానే ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ బారినపడిన వేలాది మంది మృతిచెందుతున్నట్టు మీడియాలో పెద్దఎత్తున కథనాలు వస్తున్నప్పటికీ నగరంతో పాటు రూరల్‌లోనూ కొన్ని ప్రాంతాల్లో బుధవారం జన సంచారం ఎక్కువగానే కనిపించింది.


జనాలతో మార్కెట్లన్నీ కిటకిట

లాక్‌డౌన్‌ అమలవుతున్నప్పటికీ నగరంలోని పూర్ణామార్కెట్‌, జ్ఞానాపురం మార్కెట్‌, అక్కయ్యపాలెం, గాజువాక, గోపాలపట్నం వంటి ప్రాంతాల్లోని మార్కెట్లన్నీ జనాలతో సాధారణ రోజుల్లో మాదిరిగానే కిటకిటలాడుతుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కరోనా వైరస్‌ ప్రభావం ఆయా మార్కెట్లపై పెద్దగా చూపడం లేదు. వారానికి సరిపడా సరకులు కొనుక్కొని, ఇంట్లోంచి బయటకు రాకుండా గడపాల్సింది పోయి...ఎందుచేతనో కొంతమంది ప్రతిరోజూ మార్కెట్లలోకి పరుగులు పెడుతున్నారు. దీంతో పూర్ణామార్కెట్‌, జ్ఞానాపురం మార్కెట్‌, అక్కయ్యపాలెం మార్కెట్లు జనాలతో రద్దీగా కనిపించాయి. చాలామంది కనీసం మాస్క్‌లు, చేతి గ్లౌజ్‌లు ధరించకపోగా, భౌతిక దూరం పాటించకపోవడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.


ఒకరిని ఒకరు తోసుకుంటూ మార్కెట్‌లో తిరగడంతో వైరస్‌ పొరపాటున ఒకరికి వుంటే క్షణాల్లో వందలాది మందికి వ్యాపించడం ఖాయమని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు పోలీసులు, అధికారులు నిత్యం గగ్గోలు పెడుతున్నా సరే తమకు ఏం కాదులే...అన్నధోరణితో చాలామంది వ్యవహరిస్తున్నారు. వారి నిరక్ష్యం కారణంగా వారి కుటుంబంతోపాటు చట్టుపక్కల వున్నవారంతా కరోనా మహమ్మారి పంజాకు చిక్కిపోతామనే విషయాన్ని తెలుసుకోకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. 


పట్టించుకోని అధికారులు

లాక్‌డౌన్‌ ప్రభావం కేవలం రైల్వేస్టేషన్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌, జగదాంబ జంక్షన్‌ వంటి ప్రధాన కూడళ్లకే పరిమితం అవుతోంది. నగరంలోని మార్కెట్లు జనాలతో రద్దీగా కనిపిస్తుంటే...అంతర్గత రోడ్లపై కూడా వాహనాలు సాధారణంగానే రాకపోకలు సాగిస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. అధికారులు దీనిపై ఇప్పటికైనా స్పందించి లాక్‌డౌన్‌ పక్కాగా అమలు జరిగేలా చేయడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆశయాలను నెరవేర్చాలని నగరవాసులు కోరుతున్నారు.


Updated Date - 2020-04-02T09:21:09+05:30 IST