వలస కార్మికుల ఆకలి కేకలు

ABN , First Publish Date - 2020-04-04T09:21:12+05:30 IST

స్థానిక ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్‌)లోని వివిధ కర్మాగారాల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనులు చేయడానికి పలు రాష్ట్రాల నుంచి నుంచి వచ్చిన కార్మికులు కరోనా వైరస్‌- లాక్‌డౌన్‌ కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నారు.

వలస కార్మికుల ఆకలి కేకలు

వలస కార్మికుల నరకయాతన

లాక్‌డౌన్‌తో ఆగిన పనులు

సెజ్‌లో మూడు వేల మంది వరకు ఇతర రాష్ట్రాల కూలీలు

‘భత్యం’తో సరిపెడుతున్న లేబర్‌ కాంట్రాక్టర్లు

అదీ వారానికి రూ.200 నుంచి రూ.300!

అర్ధాకలితో అలమటిస్తున్న కూలీలు

బిల్లులు రాలేదంటూ వేతనాలు ఇవ్వని వైనం

స్థానికేతరులు కావడంతో అందని ఉచిత రేషన్‌

ఇరుకు రేకుల షెడ్లలో నివాసం

ఎండ తీవ్రతకు మగ్గిపోతున్న వైనం

పట్టించుకోని అధికారులు


అచ్యుతాపురం, ఏప్రిల్‌ 3:స్థానిక ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్‌)లోని వివిధ కర్మాగారాల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనులు చేయడానికి పలు రాష్ట్రాల నుంచి నుంచి వచ్చిన కార్మికులు కరోనా వైరస్‌- లాక్‌డౌన్‌ కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నారు.  


ఎస్‌ఈజడ్‌లోని పలు కర్మాగారాల నిర్మాణ పనులతోపాటు, ఉత్పత్తి జరుగుతున్న కంపెనీల్లో పనుల కోసం ‘లేబర్‌ కాంట్రాక్టర్లు’ జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, ఒడిశా, తదితర రాష్ట్రాల నుంచి దినసరి కూలీలను తీసుకువస్తుంటారు. వీరు భవన నిర్మాణాల్లో తాపీ, రాడ్‌ బెండింగ్‌, కాంక్రీట్‌ మిక్చర్‌, సెంట్రింగ్‌ తదితర పనులు చేస్తుంటారు. అదేవిధంగా ఉత్పత్తి జరుగుతున్న కంపెనీల్లో దినసరి కూలీలుగా పనిచేస్తుంటారు. వీరు సుమారు మూడు వేల మంది వరకు ఉన్నారు. వీరికి కుమారపురం, కోనేంపాలెం, ఉద్దపాలెం, జంగులూరు జంక్షన్‌, తదితర ప్రాంతాల్లో గాలి, వెలుతురు లేని రేకుల షెడ్డుల్లో ఆవాసం కల్పించారు. కొంతమంది భార్యాపిల్లలతో వుంటుండగా, ఎక్కువ మంది ఒక్కరే ఉంటున్నారు.


భార్యాపిల్లలు సొంతూళ్లలో ఉంటున్నారు. ఉదయం పనుల్లోకి వెళ్లి సాయంత్రం తిరిగి నివాసానికి చేరతారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ కారణంగా పనులు ఆపేయడంతో 24 గంటలూ షెడ్‌లలోనే మగ్గిపోతున్నారు. ఇరుకుగా వున్న ఒక్కో గదిలో పది మంది వరకు ఉంటున్నారు. భౌతిక దూరం పాటించే అవకాశం వుండడం లేదు. ఇక పగటిపూట వీరు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఇనుప రేకుల షెడ్లలో వుంటున్న కార్మికులు ఎండ వేడికి మగ్గిపోతున్నారు. లోపల వుండలేక, బయటకు రాలేక అల్లాడిపోతున్నారు.


అరకొరగా ఆర్థిక ఆసరా

రెండు వారాల నుంచి పనులు లేకపోవడంతో కూలి చెల్లింపులు లేవు. సంబంధిత కాంట్రాక్టర్లు వారానికి ఒక్కో కుటుంబానికి రూ.200 నుంచి రూ.300 వరకు భత్యం కింద ఇస్తున్నారు. నలుగురైదుగురు వున్న కుటుంబానికి ఈ డబ్బులు రెండు రోజులకు మించి వచ్చే పరిస్థితి లేదు.  సాధారణంగా పనులు చేసినప్పుడు వచ్చే కూలి డబ్బుల్లో ఖర్చులకు కొంత వుంచుకుని, మిగిలిన సొమ్మును సొంతూళ్లలోని కుటుంబ సభ్యులకు పంపేవారు. పనులు లేకపోవడంతో ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వలేదు. కాంట్రాక్టర్లు ఇచ్చే అరకొర భత్యంతో ఒక పూట తిని, మరోపూట పస్తులుంటున్నారు. స్థానికేతరులు కావడంతో రేషన్‌ కార్డులు లేవు.


ప్రభుత్వపరంగా రేషన్‌ గానీ, లాక్‌డౌన్‌ ఆర్థిక సాయంగానీ అందే పరిస్థితి లేదు. కాంట్రాక్టర్లు అరకొర భత్యం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. వీరి బాధలు తెలుసుకున్న స్థానిక స్వచ్ఛంద సంస్థలు తోచిన సహాయాన్ని అందజేస్తున్నాయి. శుక్రవారం హెల్పింగ్‌ హ్యాండ్స్‌ సంస్థ కార్మికుల పిల్లలకు స్నాక్స్‌ పంపిణీ చేయగా, సీఐటీయూ నేతలు మధ్యాహ్నం పులిహోర ప్యాకెట్లు అందజేశారు. మీనింగ్‌ఫుల్‌ రివార్డ్స్‌ హెల్పింగ్‌ హ్యాండ్స్‌ సొసైటీ వారు బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. 


దిక్కుతోచడం లేదు... ఆన ంద్‌ మిశ్రా, కార్మికుడు, ఉత్తరప్రదేశ్‌

నేను ఒక పెయింట్స్‌ కంపెనీలో కార్మికునిగా పనిచేస్తున్నాను.  మా  కాంట్రాక్టర్‌ నెలకు ఒకసారి వేతనం ఇస్తారు. మధ్యలో ఇంటి ఖర్చుల కోసం కొంత మొత్తం ఇస్తుంటారు. తరువాత జీతం నుంచి మినహాయించుకుంటారు. కానీ మార్చి నెల వేతనం ఇవ్వలేదు. తిండి గింజలకు మాత్రం కొద్దిపాటి సొమ్ము ఇస్తున్నారు. సొంతూళ్లో వున్న భార్య పిల్లలకు డబ్బులు పంపడం లేదు. ఇక్కడ ఉండడం చాలా ఇబ్బందిగా ఉంది. మా ఊరు వెళ్లిపోదామంటే రైళ్లు, బస్సులు నడవడం లేదు. 


నరకయాతనగా ఉంది... అనిరుధ్‌, రోజువారీ కూలీ, బిహార్‌

నేను ఆర్‌సీసీ కంపెనీలో పనిచేస్తున్నాను. కేరళకు చెందిన కాంట్రాక్టర్‌ మమ్మల్ని ఇక్కడ పనిలో పెట్టాడు. బిల్లులు రాలేదంటూ రెండు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. కరోనా కారణంగా ప్రస్తుతం పనులు ఆపేశారు. భార్యాపిల్లలు సొంతూరులో ఉన్నారు. నేను ఇక్కడ ఉండలేక, సొంతూరు వెళ్లలేక నరకయాతన పడుతున్నాను.

Updated Date - 2020-04-04T09:21:12+05:30 IST