సాయం సొమ్ముకూ.. వైసీపీ రంగు!

ABN , First Publish Date - 2020-04-05T09:12:24+05:30 IST

సొమ్ము ఒకరిది... సోకు ఒకరిది అన్న చందంగా..

సాయం సొమ్ముకూ..  వైసీపీ రంగు!

స్థానిక సంస్థల అభ్యర్థులతో పంపిణీ

వలంటీర్లు వద్ద నగదు తీసుకుని తామేదో ఇస్తున్నట్లు కలరింగ్‌!

జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు

 

గుంటూరు(ఆంధ్రజ్యోతి): సొమ్ము ఒకరిది... సోకు ఒకరిది అన్న చందంగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రభుత్వం పేద కుటుంబాలకు ప్రకటించిన రూ.1000 ఆర్థికసాయాన్ని వాళ్లేదో ఇస్తోన్నట్లుగా బిల్డప్‌ ఇస్తున్నారు. శనివారం జిల్లాలో పలుచోట్ల నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ నాయకులు వలంటీర్ల వద్ద డబ్బులు లాక్కొని లబ్ధిదారులకు తామే ఇస్తున్నట్లు అందజేశారు. 


లాక్‌డౌన్‌ కారణంగా తెల్లరేషన్‌ కార్డు కలిగిన పేద కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం రూ.వెయ్యి నగదుని ఆర్థికసాయంగా ప్రకటించింది. శనివారం ఉదయం నుంచి నగదు పంపిణీని వలంటీర్లు ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమంపై కన్నేసిన వైసీపీ నాయకులు దానిని హైజాక్‌ చేశారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ప్రత్యేకించి నగదు పంపిణీపై అత్యుత్సాహం చూపించారు. వలంటీర్లు ఎక్కుడున్నారో తెలుసుకొని అభ్యర్థులే ఇంటింటికి వెళ్లి వైసీపీ కండువాలు మెడలో కప్పుకొని నగదు పంపిణీ చేశారు.


దీంతో ప్రభుత్వ ఆర్థికసాయం ఒక విధంగా వైసీపీ కార్యక్రమంగా మారిపోయింది. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు భౌతికదూరం పాటించాలని ఒకవైపు ప్రభుత్వం చెబుతోంది. అయితే వైసీపీ నాయకులకు అవేమీ పట్టించుకోకుండా నగదు, రేషన్‌, పెన్షన్‌ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నగదు పంపిణీ మరో మూడు, నాలుగు రోజుల పాటు జరిగే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ ఈ విషయంపై దృష్టి సారించి తగిన ఆదేశాలు జారీ చేయాలని ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నారు. 


కలెక్టర్‌కు ఫిర్యాదు

నగరం, పొన్నూరు, గుంటూరు సిటీ తదితర ప్రాంతాల్లో వైసీపీ నాయకులు నిబంధనలు ఉల్లంఘించడంపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ సుబ్బారావు జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ని కలిసి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వసాయాన్ని వలంటీర్లు అందజేయాలని, అలాంటిది వైసీపీ నాయకులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 


అభ్యర్థుల హల్‌చల్

రేపల్లె: రేపల్లె నియోజకవర్గంలోని పురపాలక సంఘం, రేపల్లె, నగరం, నిజాంపట్నం, చెరుకుపల్లి మండలాల్లో రూ.1000 సాయాన్ని ఇటీవల నామినేషన్లు వేసిన కౌన్సిలర్‌, ఎంపీటీసీ అభ్యర్థులే పంపిణీ చేస్తున్నారు. 13వ వార్డులో నాయకులు నగదును పంపిణీ చేస్తుంటే 1004 ఫోన్‌కు టీడీపీ నాయకులు ఫోన్‌ చేయగా పోలీస్‌ సిబ్బంది వచ్చి చెదరగొట్టారు. నగరం ఎంపీపీ అభ్యర్థి చింతల శ్రీకృష్ణయ్య ఈదుపల్లి పంచాయతీవద్ద రూ.1000 బహిరంగంగా పంపిణీ చేశారు. 

Updated Date - 2020-04-05T09:12:24+05:30 IST