చేనేత.. చతికిలా!

ABN , First Publish Date - 2020-04-05T09:44:39+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా దుకాణాలు మూతపడటం, రవాణా రంగం స్తంభించడంతో చేనేత రంగం నష్టాల బాటపట్టింది. వెంకటగిరి కేంద్రంగా చేనేత వస్త్రాల వ్యాపారం జోరుగా సాగుతుంది.

చేనేత.. చతికిలా!

 నేతన్నను ముంచేసిన కరోనా

నేచిన చీరలు అమ్ముడుపోక అవస్థలు

13 రోజుల్లో ఆగిన రూ.20 కోట్ల టర్నోవర్‌

మగ్గాలకు ముసుగు.. ఆదుకోవాలని విజ్ఞప్తి


లాక్‌డౌన్‌ కారణంగా దుకాణాలు మూతపడటం, రవాణా రంగం స్తంభించడంతో  చేనేత రంగం నష్టాల బాటపట్టింది. వెంకటగిరి కేంద్రంగా చేనేత వస్త్రాల వ్యాపారం జోరుగా సాగుతుంది. రోజుకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల మేర వ్యాపార లావాదేవీలు నడుస్తాయి. అయితే, ఒక్కసారిగా దుకాణాలు మూతపడటంతో 13 రోజుల్లో రూ.20 కోట్లకుపైగా లావాదేవీలు ఆగిపోయాయి. దీంతో చేనేత కార్మికులే కాదు.. వ్యాపారులు కూడా నష్టాల ఊబిలో కూరుకుపోయారు. వెంకటగిరి, డక్కిలి ప్రాంతాల్లో సుమారు 2 వేల మగ్గాలు ఉండగా, ఇక్కడ నేచిన చీరలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ఒక్కో మగ్గానికి ముగ్గురేసి చొప్పున పది వేలకుపైగా నేత కార్మికులు గడిచిన 15 రోజుల్లో 6 వేల చీరలకుపైగా తయారు చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా మార్కెట్‌ వ్యవస్థ స్తంభించడంతో చీరలు అమ్ముడు పోవడం లేదని వారు వాపోతున్నారు.


ముడిసరుకు వచ్చే దారేది?

రవాణాకు పూర్తిగా బ్రేకులు పడటంతో ముడిసరుకులు రావడం లేదని కార్మికులు వాపోతున్నారు. ఉన్నకొద్ది పాటి జరీ, పట్టు, నూలుతో కొందరు కార్మికులు చీరలను తయారు చేస్తుండగా, మరికొందరు మగ్గాలకు ముసుగు వేసేశారు. దీనికితోడు తయారుచేసిన చీరలను ఇంటిలోనే బీరువాలో భద్రపరిచి ఆకలితో అలమటిస్తున్నారు. కొన్నిచోట్ల సహకార సంఘాలు, ఆప్కో వంటి బడా సంస్థలు కూడా మూతపడ్డాయి. 

- డక్కిలి

Updated Date - 2020-04-05T09:44:39+05:30 IST