అన్నదాత విలవిల

ABN , First Publish Date - 2020-04-06T10:14:10+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ టొమేటో, పుచ్చ రైతులను తీవ్రంగా దెబ్బతీసింది.

అన్నదాత విలవిల

లాక్‌ డౌన్‌తో టొమేటో, పుచ్చకాయల రవాణాకు ఇక్కట్లు

కొనుగోళ్లకు పట్టణ ప్రాంతాల నుంచి రాని వ్యాపారులు

28 కిలోల టొమేటో క్రేట్‌ రూ.100లకు అమ్ముకోవాల్సిన దుస్థితి

గత ఏడాది ఇదే సమయంలో క్రేట్‌ రూ.350లకు అమ్మకం

పుచ్చకాయలు టన్ను రూ.9 వేల నుంచి రూ.4 వేలకు పడిపోయిన వైనం

ఆ ధరకు సైతం ముందుకురాని కొనుగోలుదారులు

పెట్టుబడిలో సగం కూడా దక్కదని రైతుల ఆవేదన


కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ టొమేటో, పుచ్చ రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. సరుకు కొనుగోలు చేయడానికి వ్యాపారులు పొలాల వద్దకు రాకపోవడం, రైతులు మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్ముకునే పరిస్థితి లేకపోవడంతో పలువురు రైతులు పొలంలోనే వదిలేస్తున్నారు. మరికొంతమంది మాత్రం చిరువ్యాపారులకు నామమాత్రపు ధరకు అమ్ముకుంటున్నారు.  మొత్తం మీద పెట్టుబడితో సగం కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.

అనకాపల్లి, ఏప్రిల్‌ 5: 


కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ టొమేటో రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. సరుకు కొనుగోలు చేయడానికి వ్యాపారులు పొలాల వద్దకు రాకపోవడం, రైతులు మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్ముకునే పరిస్థితి లేకపోవడంతో పలువురు రైతులు టొమేటోలను కోయకుండా పొలంలోనే వదిలేశారు. మరికొంతమంది మాత్రం చిరువ్యాపారులకు నామమాత్రపు ధరకు అమ్ముకుంటున్నారు. సాధారణంగా ఏటా ఈ సమయంలో క్రేట్‌(సుమారు 28 కిలోలు) టొమేటోలు రూ.400 వరకు పలుకుతుంటాయి. కానీ లాక్‌డౌన్‌ కారణంగా క్రేట్‌ రూ.100లకు పడిపోయింది. అయినాసరే పంట మొత్తాన్ని కొనేవారు లేకపోయారు. దీనికితోడు ఇటీవల కురిసిన అకాల వర్షాలతో కాయలు పగిలిపోయి, కుళ్లిపోతున్నాయి. ఎకరాకు రూ.35 వేల వరకు పెట్టుబడులు అయ్యాయని, క్రేట్‌ రూ.100లకు అమ్మితే రూ.15 వేలు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.



పెట్టుబడిలో సగం కూడా రాదు .. దాడి మహలక్ష్మి, పల్లపువీధి, గవరపాలెం, అనకాపల్లి

ఎకరా భూమిలో టొమేటో వేశాను. అన్ని రకాల ఖర్చులు కలిపి రూ.35 వేల వరకు అయ్యాయి. కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వం లాక్‌ డౌన్‌ విధించడంతో టొమేటోల కొనుగోలుకు వ్యాపారులు రావడంలేదు. సొంతంగా మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్ముదామంటే వాహనాలు తిరగడంలేదు. చిరువ్యాపారులకు క్రేట్‌ రూ.80 నుంచి రూ.100లకు అమ్ముకోవాల్సి వస్తున్నది. పెట్టుబడిలో సగం కూడా వచ్చే పరిస్థితి లేదు.


బాగా నష్టపోయాను.. కాండ్రేగుల గణేష్‌, ఆవఖండం, అనకాపల్లి 

గత ఏడాది ఇదే సమయంలో టొమేటోలు క్రేట్‌ రూ.300 నుంచి రూ.350 పలికింది. కానీ ఈ ఏడాది కరోనా వైరస్‌, లాక్‌ డౌన్‌తో రూ.100లకు కూడా కొనేవారు లేరు. కాపు బాగున్నన్పటికీ ధర లేకపోవడం, దీనికితోడు ఇటీవల కురిసిన అకాల వర్షాలతో కాయలు దెబ్బతినడంతో బాగా నష్టపోయాను.


 చితికిపోయిన పుచ్చ రైతు


కోటవురట్ల, ఏప్రిల్‌ 5:వ్యాపారులు పుచ్చ తోటల వద్దకే వచ్చి ఎగబడి కొనుగోలు చేయాల్సిన ప్రస్తుత తరుణంలో రైతులే సగం ధరకైనా తీసుకోండని వ్యాపారులను బతిమాలుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. టన్ను పది వేల రూపాయల ధర పలకాల్సిన పుచ్చకాయలను, ఇప్పుడు టన్ను నాలుగు వేల రూపాయలకు ఇద్దామన్నా కొనేవారు లేరు. లాక్‌ డౌన్‌ కారణంగా ప్రైవేటు వాహనాల రాకపోకలపై నిబంధనలు విధించడం, ఉదయం 11 గంటల తరువాత ఎటువంటి వ్యాపారాలు చేయవద్దని పోలీసులు ఆంక్షలు విధించడంతో పుచ్చకాయల విక్రయదారులు తాత్కాలికంగా తమ వ్యాపారాన్ని ఆపేశారు. ఫలితంలో తోటల్లో పక్వానికి వచ్చిన పుచ్చకాయలు ముదిరిపోయి, పాడైపోతున్నాయి. సమీప గ్రామాల్లో రోడ్లపక్కన పెట్టుకుని అమ్ముకునే వ్యాపారులు మాత్రమే తోటల వద్దకు వచ్చి పుచ్చకాయలు కొనుగోలు చేస్తున్నారు.  


కోటవురట్ల మండలంలో రామచంద్రపురం, కైలాసపట్నం, పాతరోడ్డు, కొడవటిపూడి, కొత్తూరు, చిన బొడ్డేపల్లి తదితర గ్రామాల్లో ఎక్కువ విస్తీర్ణంలో పంట సాగు చేపట్టారు. కాపు ఆశాజనకంగా కాయడంతో మంచి ఆదాయం వస్తుందని రైతులు ఆశించారు. సరిగ్గా కాయలు కోతకు వచ్చే సమయానికి కరోనా వైరస్‌తో ప్రభుత్వం లాక్‌ డౌన్‌ విధించింది. రవాణాతోపాటు అన్ని వ్యాపారాలు నిలిచిపోయాయి. పట్టణ ప్రాంతాల నుంచి పుచ్చకాయలు కొనుగోలు చేయడానికి వ్యాపారులెవరూ రావడంలేదు. రైతులు స్వయంగా మార్కెట్‌ తీసుకెళదామంటే వాహనాలు అందుబాటులో లేవు. ఒకవేళ స్థానికంగా వున్న చిన్నపాటి వాహనాల్లో పుచ్చకాయలను మార్కెట్‌కు తీసుకెళితే, వ్యాపారులు కొనుగోలు చేస్తారో లేదో తెలియదు. దీంతో సమీప గ్రామాల్లో రహదారుల పక్కన అమ్ముకునే చిరువ్యాపారులకు, వారు అడిగిన రేటుకు తెగనమ్ముకుంటున్నారు. 


పెట్టుబడిలో సగం కూడా రాలేదు.. షేక్‌ బాబ్జీ, పుచ్చ రైతు, రామచంద్రపురం

నేను ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని పచ్చపంట వేశాను. సుమారు రూ.2.5 లక్షలు వరకు పెట్టుబడి అయ్యింది. లాక్‌ డౌన్‌కు కొద్ది రోజుల ముందు కాయ కోతకు వచ్చింది. తొలివిడత టన్ను రూ.8500 నుంచి రూ.9 వేలకు అమ్మాను.  లాక్‌ డౌన్‌ తరువాత కొనుగోలు చేసేవారు రావడంలేదు. దీంతో టన్ను రూ.4 వేలకు ఇవ్వడానికి సిద్ధపడ్డాను. అయినా పూర్తిస్థాయిలో అమ్మకాలు సాగడంలేదు. మొత్తం మీద లక్షన్నర రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు. 


Updated Date - 2020-04-06T10:14:10+05:30 IST