ఎన్నాళ్లు ఇలా..?

ABN , First Publish Date - 2020-05-31T11:40:06+05:30 IST

కట్టడి ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ 5.0 నెలపాటు పొడిగింపు.. కఠినంగా అమలు చేస్తాం అన్న మాట వింటూనే గుండె ఆగినంత పనైందని శ్రీనివాసరావుపేట 9వ లైనుకు చెందిన

ఎన్నాళ్లు ఇలా..?

లాక్‌డౌన్‌ పొడిగింపుతో తీవ్ర ఇబ్బందులే..

శ్రీనివాసరావుపేట మహిళల ఆవేదన

గుంటూరు, మే 30 (ఆంధ్రజ్యోతి): కట్టడి ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ 5.0 నెలపాటు పొడిగింపు.. కఠినంగా అమలు చేస్తాం అన్న మాట వింటూనే గుండె ఆగినంత పనైందని శ్రీనివాసరావుపేట 9వ లైనుకు చెందిన మహిళలు ఆవేదనభరితులయ్యారు. శనివారం రాత్రి వారు ఆంధ్రజ్యోతి కార్యాలయానికి ఫోన్లు చేసి 70 రోజులుగా తాము పడుతున్న నరకయాతనని కళ్లకు కట్టారు. లక్ష్మి అనే గృహిణి భర్త గణేష్‌ ఆటోడ్రైవర్‌గా పని చేసేవాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయాడు. లాక్‌డౌన్‌లో పక్షవాతం కూడా వచ్చింది. వీరికి ఇద్దరు చిన్నపిల్లలున్నారు. ఇప్పటికే రెండు నెలల పాటు ఇరుగుపొరుగు వారిని అడుక్కొని ఒక పూట తిని ఒక పూట పస్తులుండి జీవచ్ఛవాలుగా ఉన్నామన్నారు. కనీసం తల్లిదండ్రులఇంటికి వెళ్లిపోతానికి కూడా అనుమతి ఇవ్వడం లేదన్నారు.


తమకు కేవలం రేషన్‌ బియ్యం, కందిపప్పు/శనగలు మాత్రమే ఇచ్చారని, అవి వండుకోవాలంటే వంటగ్యాస్‌ ఉండాలి కదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి రూ.1000సాయం కూడా తమలాంటి ఎన్నో కుటుంబాలకు ఇక్కడ అందలేదన్నారు. ఇంటి అద్దె ఎలా కట్టాలో తెలియడం లేదు. మాకేమి వద్దు. ఇళ్లల్లో నుంచి బయటకు పంపిస్తే వెళ్లి ఏదో ఒక పని చేసుకొని కుటుంబ పోషణ జరుపుకొంటామన్నారు. మరో నెల పాటు ఇలానే కట్టడి చేస్తే తమకు బలవన్మరణం తప్పా మరో దారి లేదని వాపోయారు. 

Updated Date - 2020-05-31T11:40:06+05:30 IST