ఇక సకలం బంద్

ABN , First Publish Date - 2021-05-10T14:30:27+05:30 IST

కరోనా రెండవ దశ నియంత్రణల్లో భాగంగా రాష్ట్రప్రభుత్వం విధించిన రెండు వారాల సంపూర్ణ లాక్‌డౌన్‌ సోమవారం తెల్లవారుజామున ..

ఇక సకలం బంద్

నేటినుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌

మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలు

మెట్రోరైలు సేవలు ఉండవు

అమ్మ క్యాంటీన్లలో మూడు పూటలా విక్రయాలు


చెన్నై: కరోనా రెండవ దశ నియంత్రణల్లో భాగంగా రాష్ట్రప్రభుత్వం విధించిన రెండు వారాల సంపూర్ణ లాక్‌డౌన్‌ సోమవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి అమలులోకి వచ్చింది. రాష్ట్రంలో రెండో దశ కరోనా విజృంభిస్తూ రోజువారీ పాజిటివ్‌ కేసుల సంఖ్య 27 వేలకు చేరుకుంది. అలాగే, పదిరోజులుగా మృతుల సంఖ్య 100కు పైగా ఉండగా, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 1.30 లక్షలు దాటింది. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రిగా గత శుక్రవారం బాధ్యతలు చేపట్టిన స్టాలిన్‌ తొలిరోజే రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై జిల్లా కలెక్టర్లు, వైద్యనిపుణులతో సమావేశమై చర్చించారు. సమావేశాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ అవశ్యమని వైద్యనిపుణులు అభిప్రాయపడ్డారు. దీంతో రాష్ట్రప్రభుత్వం సోమవారం నుంచి ఈనెల 24వ తేదీ వరకు రెండు వారాలు సంపూర్ణ లాక్‌డౌన్‌  ప్రకటించింది.


మధ్యాహ్నం వరకు దుకాణాలు

సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించిన ప్రభుత్వం, ప్రజల సౌకర్యార్ధం పలు మిన హాయింపులు కల్పించింది. పండ్లు, కూరగాయలు, చిల్లర దుకాణాలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయి. అలాగే, కోయంబేడు మార్కెట్‌లో కూడా తెల్లవారుజామున 4 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలు పనిచేయనున్నాయి. ప్రజలు తమ ప్రాం తాలకు దగ్గరలో ఉన్న దుకాణాల్లో మాత్రమే కూరగాయలు, సరుకులు కొనుగోలు చేయాలని, దూర ప్రాంతాలకు వెళ్లరాదని అధికారులు హెచ్చ రించారు.


మెట్రోరైళ్లు పూర్తిగా రద్దు

సంపూర్ణ లాక్‌డౌన్‌ కారణంగా సోమవారం నుంచి ఈ నెల 24వ తేదీ వరకు మెట్రోరైళ్లు పూర్తిగా రద్దయ్యాయి. ఈ మేరకు చెన్నై మెట్రోరైల్‌ లిమిటెడ్‌ (సీఎంఆర్‌ఎల్‌) విడుదల చేసిన ప్రకటనలో, సోమవారం సంపూర్ణ లాక్‌డౌన్‌ కావడం కావడంతో ప్రజల సౌకర్యార్థం ఆదివారం యఽథావిధిగా ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు 10 నిముషాలకు ఒక రైలు నడి పామన్నారు. సోమవారం నుంచి 24వ తేదీ వరకు మెట్రోరైళ్లు పూర్తిస్థాయి లో రద్దు చేసినట్టు సీఎంఆర్‌ఎల్‌ తెలిపింది.


ప్రజలతో దురుసుగా ప్రవర్తించొద్దు : డీజీపీ త్రిపాఠి 

సంపూర్ణ లాక్‌డౌన్‌ సమయంలో ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించవద్దని డీజీపీ త్రిపాఠి పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. అదే సమయంలో ప్రభుత్వం అమలు చేసిన సంపూర్ణ లాక్‌డౌన్‌కు ప్రజలు కూడా సహకరిం చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సాధ్యమైనంత వరకు ప్రజలు ఇళ్లలోనే వుండాలని కోరారు. అదే సమయంలో ఎలాంటి కారణం లేకుండా బయట తిరిగితే వాహనాలు స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. అలాగే, పోలీసులు కూడా ప్రజలతో దురుసుగా ప్రవర్తించరాదని, వారికి జాగ్రత్తలు చెప్పి పంపించాలని డీజీపీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


నగరం నుంచి తరలిన 3 లక్షల మంది

సంపూర్ణ లాక్‌డౌన్‌ నేపథ్యంలో, సుమారు 3 లక్షల మంది నగరం నుంచి తమ సొంతూర్లకు వెళ్లిపోయారు. స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర ్యార్థం శని, ఆదివారాల్లో రాష్ట్ర రవాణా సంస్థ ప్రత్యేక బస్సులు నడిపింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు నడిపిన 3,325 ప్రత్యేక బస్సుల్లో 1.33 లక్షల మంది ప్రయాణం చేశారు. అలాగే, ఆదివారం సాయంత్రం వరకు 4,816 ప్రత్యేక బస్సులు నడుపగా 1.50 లక్షల మంది ప్రయాణం చేశారు. కోయంబేడు బస్‌ టెర్మినల్‌, ప్రైవేటు బస్‌ టెర్మి నల్‌లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. అదే సమయంలో, సంపూర్ణ లాక్‌డౌన్‌ కారణంగా తమ స్వరాష్ట్రాలకు వెళ్లే వారితో చెన్నై సెంట్రల్‌, ఎగ్మూర్‌, కోయంబత్తూర్‌, మదురై తదితర రైల్వేస్టేషన్లు రద్దీగా కనిపించాయి.


ఆదివారం రద్దీగా మార్కెట్లు

సోమవారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలుకు రావడంతో ఆదివారం అమలుచేసే సంపూర్ణ లాక్‌డౌన్‌కు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. దీంతో, సరకులు, కూరగాయలు కొనుగోలు చేసే వారితో మార్కెట్లు దుకా ణాలు రద్దీగా కనిపించాయి. ఇక, కాశిమేడు చేపల మార్కెట్‌లో జనసం దోహం అధికంగా కనిపించింది. కొవిడ్‌ నిబంధనల్లో భాగంగా దుకాణాల వద్ద వినియోగదారులు భౌతికదూరం పాటించేలా యజమానులు చర్యలు చేపట్టారు.


నేటి నుంచి తక్కువ సంఖ్యలో సబర్బన్‌ రైళ్లు

రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ సోమవారం నుంచి అమలులోకి రావడంతో బస్సు, ఆటో, కారు, కాల్‌టాక్సీ సేవలు పూర్తిగా రద్దయ్యాయి. మెట్రోరైళ్ల సేవలు కూడా సోమవారం నుంచి 24వ తేది వరకు పూర్తిగా రద్దుచేశారు. అయినా, సబర్బన్‌ రైళ్లు మాత్రం తక్కువ సంఖ్యలో నడువనున్నాయి. అదే సమయంలో కరోనా కారణంగా ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో 37 ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లు రద్దయ్యాయి. ఎగ్మూర్‌ నుంచి పగటి పూట నడిపే వైగై, పల్లవన్‌, తేజస్‌ రైళ్లను అధికారులు రద్దుచేశారు. అలాగే, రాత్రి వేళల్లో నడిపే తిరుచ్చి మలైకోట రైలు రద్దయింది. ఇవి మినహా మిగిలిన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు యథా విధిగా నడువనున్నాయి. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా రిజర్వేషన్‌ చేసుకున్న 50 శాతం మంది ప్రయాణికులతో ఈ రైళ్లు నడువనున్నాయి. 


యాథావిధిగా అమ్మ క్యాంటీన్లు

సంపూర్ణ లాక్‌డౌన్‌ సందర్భంగా హోటళ్లలో పార్శిళ్లకు మాత్రమే అనుమ తించనున్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు పార్శిళ్లను విక్రయించనున్నారు. టీ దుకాణాల్లో కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు పార్శిళ్లు మాత్రమే ఇవ్వనున్నారు. అదే సమయంలో ఉపాధి కోల్పోయిన పేదలు, కార్మికుల కోసం అమ్మ క్యాంటీన్లు యఽథావిధిగా పని చేయనున్నాయి. ప్రజలు అధికంగా వచ్చే అవకాశముండడంతో ఆహారం అధికంగా సిద్ధం చేయాలని కార్పొరేషన్‌ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు.

Updated Date - 2021-05-10T14:30:27+05:30 IST