బంధాలనూ.. లాక్‌ చేద్దాం!

ABN , First Publish Date - 2020-04-08T19:52:09+05:30 IST

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఎన్నడూ లేని రీతిలో ఈ లాక్‌డౌన్‌ కారణంగా కాలు బయటపెట్టలేని పరిస్థితి. వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ఈ లాక్‌డౌన్‌ ఉపయోగపడుతుందని నమ్ముతున్నట్లుగానే బంధాలను పెంచుకోవడానికి కూడా ఇది తోడ్పడుతుందని విశ్వసించే వారు ఎంతో మంది ఉన్నారు.

బంధాలనూ.. లాక్‌ చేద్దాం!

స్ట్రెస్‌ డిజార్డర్‌ సమస్యలకు కుటుంబసభ్యుల సహకారం తప్పనిసరి


దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఎన్నడూ లేని రీతిలో  ఈ లాక్‌డౌన్‌ కారణంగా కాలు బయటపెట్టలేని పరిస్థితి. వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ఈ లాక్‌డౌన్‌ ఉపయోగపడుతుందని నమ్ముతున్నట్లుగానే బంధాలను పెంచుకోవడానికి కూడా ఇది తోడ్పడుతుందని విశ్వసించే వారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఈ లాక్‌డౌన్‌ ఇప్పుడు విషాదకర ఘటనలకూ వేదికవుతోంది.  మరీముఖ్యంగా గృహహింస పరంగా ! భార్యాభర్తల నడుమ పొరపొచ్చాలకు కారణమవుతుండటమే కాదు, తీవ్రమైన వేధింపులకూ నిలయంగా ఈ లాక్‌డౌన్‌ సమయం నిలుస్తుందంటున్న వారూ లేకపోలేదు. ఇంటిలోనే ఉండటం వల్ల ఆందోళన,  అసహనం, కోపం లాంటి భావోద్వేగాలు అధికంగా చూపుతుండటం వల్లనే ఎక్కువ శాతం సమస్యలు వస్తాయంటూనే కుటుంబసభ్యుల సహకారం, ప్రొఫెషనల్స్‌ మద్దతు తీసుకోవడం ద్వారా సమస్యల నుంచి బయటపడవచ్చంటున్నారు సైకాలజి్‌స్టలు, సైక్రియాటి్‌స్టలు.

హైదరాబాద్‌ సిటీ, ఆంధ్రజ్యోతి:



అక్యూట్‌ స్ట్రెస్‌ రియాక్షన్‌ వల్లనేనా..?

రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసుల భయానికి తోడు లాక్‌డౌన్‌తో ఇంటిపట్టునే గడపాల్సి రావడం వల్ల కొంతమంది తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోతున్నారు. ఈ ఒత్తిడికి ప్రతిస్పందనే హింస. కుటుంబసభ్యుల మీద తమ అసహనం, కోపం వెళ్లగక్కుతుండటం వల్ల బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదమూ లేకపోలేదు. ఇదే విషయమై అపోలో హాస్పిటల్‌, హైదర్‌గూడాలో సీనియర్‌ కన్సల్టెంట్‌ సైక్రియాటి్‌స్టగా సేవలనందిస్తున్న డాక్టర్‌ భరత్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.  కొన్ని కుటుంబాలలో గృహహింస చోటుచేసుకుంటుండటానికి అక్యూట్‌ స్ట్రెస్‌ రియాక్షన్‌ కూడా కారణమే! ఈ స్థితిలో వారు చాలా కోపం కలిగి ఉంటారు. దీనితో పాటుగా అపరాధ భావన, నిస్సహాయత, ప్రతికూలత వంటి భావనలో ఉంటారు. దానిని అధిగమించడానికి కుటుంబంగా కలిసి రావడంతో పాటుగా ఒకరికొకరు సహాయపడాల్సి ఉంటుంది.. అని అన్నారు. రోజంతా టీవీలు లేదంటే సోషల్‌మీడియా సైట్లకు అతుక్కుపోయే వారిలో కొంతమంది ఆందోళన స్థాయి ఎక్కువగానే ఉంటుంది. ఈ సమయంలో వారిని ఒంటరిగా వదిలేయడం చేయకూడదు. సైక్రియాటి్‌స్టలు, సైకాలజి్‌స్టలు లాంటి ప్రొఫెషనల్స్‌ సలహా తీసుకోవడం ద్వారా ఈ భావోద్వేగాలను కొంతమేరకు అధిగమించవచ్చు. 


లాక్‌డౌన్‌ వేళ పలు కారణాల వల్ల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. వాటిని అధిగమించడానికి ఏం చేయాలనే అంశమై సైకాలజి్‌స్టలు ఏం సూచిస్తున్నారంటే..


విమర్శ వద్దు... ప్రోత్సాహమే ముద్దు..

భార్యాభర్తలన్న తరువాత చిన్న చిన్న తగవులు సహజం. కానీ, భార్య/భర్త చేసిన పనిని విమర్శించడమే పనిగా పెట్టుకుంటే అది వివాదాలకు దారితీసే ప్రమాదం ఉంది. ప్రతిదీ భూతద్దంలో చూడకుండా మంచిని ప్రోత్సహిస్తూ, తప్పును ఎదుటి వారు అర్థం చేసుకునేలా సరిదిద్దగలిగితే ఆ సంసారం మరింత ఆనందమయం అవుతుంది.


డెయిలీ రొటీన్‌ సృష్టించుకోవాలి..

 ఏ పనీ లేకపోతేనే గొడవలు పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. అందుకే డెయిలీ రొటీన్‌ సిద్ధం చేసుకోవడం మంచిది. దీనిలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు టైమ్‌ కేటాయించడం మొదలు, బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, స్నాక్స్‌, లీజర్‌ టైమ్‌, కిడ్స్‌ టైమ్‌.. అన్నీ ఉండాలి. మనసు విప్పి మాట్లాడుకునేందుకు కూడా సమయం కేటాయించగలిగితే బంధం మరింత బలపడుతుంది. ఇంట్లో పిల్లలుంటే ఈ రొటీన్‌ మరింతగా ఉపయోగపడుతుంది. రోజుకొకరు పిల్లల బాధ్యత తీసుకుంటే , ఎవరెంతగా కష్టపడుతున్నారో కూడా తెలుస్తుంది. తాము ఆఫీ్‌సకు వెళ్లిన తరువాత ఆడవాళ్లకు పనేమీ ఉండదనే పురుషపుంగవులకు తత్త్వం బోధపడేందుకు సైతం ఇది తోడ్పడుతుంది.


మాట్లాడితే అడ్డంకులు తొలగిపోతాయి...

చాలావరకూ కుటుంబాలలో చిన్నచిన్న గొడవలనే పెద్దవి చేసుకుంటుంటారు. వీటిలో అధికశాతంఇలాంటి వాటికి కూడా ఇంత గొడవ అవసరమా.. అనే రీతిలోనే ఉంటాయి. మాట్లాడితే పోయేదానికి పంతాలు పట్టుకుని కూర్చుంటారు. ఈ లాక్‌డౌన్‌ను ఈ మాటల కోసం సద్వినియోగం చేసుకోండి. ప్రతి రోజూ మీ కోసం మీరు సమయం కేటాయించుకోండి. ఏదన్నా ఓ విషయంలో పంతం వస్తే ఆ క్షణంలో పట్టు పట్టినా... స్థిమితంగా ఆలోచిస్తే మీది తప్పనిపించవచ్చు. దానిని ఒప్పుకుంటే.. ఆ ఆనందమే వేరు !  


హాబీలకు ఇప్పుడు టైమ్‌ కేటాయించాలి

టైమ్‌ లేదనే వాదన నుంచి టైమ్‌ ఎలా కిల్‌ చేయాలనే కాన్సె్‌ప్టకు లాక్‌డౌన్‌ సమయంలో ఎక్కువ మంది వచ్చారు. మనం సానుకూల దృక్పథంతో ఆలోచిస్తే అనవసరమైన గొడవలు, చర్చలకు దారి తీసే విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరికి వారు తాము గతంలో చేయాలనుకుని చేయలేని పనులు ఏమిటి, ఈ సమయాన్ని ఎలా వాడుకుంటాం అనే అంశాల పట్ల ఆలోచన చేస్తే మంచిది. మరీ ముఖ్యంగా హాబీలను మెరుగుపరుచుకునేందుకు ఈ సమయం వినియోగిస్తే భార్యాభర్తల నడుమ గొడవలకూ సమయం మిగలదు. క్రియేటివిటీ అనేది అంతర్లీనంగా ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దానిని బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే ప్రొడక్టివ్‌గా లైఫ్‌ను స్పెండ్‌ చేయవచ్చు.


పాత స్నేహాలకు విలువనివ్వండి..

రోజువారీ బిజీతో ప్రాణ స్నేహితులతో కూడా మాట్లాడే వీలు కుదురకపోవచ్చు చాలామందికి. ఈ లాక్‌డౌన్‌ వేళ ఆ స్నేహాలను మరలా చిగురింపజేయవచ్చు. 


ఆందోళన పడొద్దు.. పడనీయొద్దు..

కరోనా విజృంభిస్తున్న వార్తలు టీవీలలో అనుక్షణం ఊదరగొట్టేస్తున్నారు. న్యూస్‌ఛానెల్‌ చూడాలంటేనే భయపడాల్సిన స్థితి. ఏం జరుగుతుందో తెలుసుకోవడం అవసరమే కానీ పదే పదే అవే సంఘటనలు చూస్తే ఆందోళన అధిగమై విచక్షణ కోల్పేయే అవకాశాలున్నాయి. అందుకే వీలైనంత వరకూ ఆ అంశాలను చూడడం తగ్గించడంతో పాటుగా వాటి గురించిన చర్చను కూడా అనవసరంగా చేయకపోవడం మంచిది. వాటికి బదులు  మంచి విషయాలను చర్చించడం మంచిది. 


రొటీన్‌ మారింది... వరుస మార్చుకోవాలి..

ఇండియాలో ఇప్పుడు అందరివీ వేగవంతమైన జీవితాలే! మరీ ముఖ్యంగా నగరాల్లో. రోజువారీ కార్యక్రమాలలో లాక్‌డౌన్‌ పుణ్యమా అని అకస్మాత్తుగా వచ్చే మార్పులు వల్ల భావోద్వేగాల పరంగా మార్పులను తీసుకువచ్చే అవకాశాలున్నాయి. వాటిని అధిగమించాలంటే.. 


1. రోజు ప్రణాళిక చేసుకోవాలి. ఓ నిర్దిష్టమైన టైమ్‌ టేబుల్‌ అనుసరిస్తే మరింత ప్రయోజనం ఉంటుంది.

2. అలాగని ప్రతి రోజూ ఒకే విధమైన షెడ్యూల్‌ అనుసరించరాదు. ప్రతి రోజూ నూతన అంశాలను ప్రణాళిక చేసుకోవాలి

3. మీ డెయిలీ రొటీన్‌లో ఖచ్చితంగా క్వాలిటీ టైమ్‌ ఉండాలి. మీ షెడ్యూల్స్‌ అర్థవంతంగానూ ఉండాలి. లేదంటే మరో రోజు వ్యర్థమయ్యిందనే భావన వస్తుంది.

4. నూతన హాబీలు, ఆసక్తులను ట్రై చేయాలి

5. ఇంటర్నెట్‌పై అధిక సమయం వెచ్చించడం తగ్గించాలి. 

6. కుటుంబ సభ్యులతో సంభాషించండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది.. ప్రతి ఒక్కరూ ఒకే విధమైన స్థితిని అనుభవిస్తున్నారని తెలుసుకోవాలి

7. ప్రకృతితో మమేకమవండి. అలాగని పార్కులకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి బాల్కనీల్లో కూర్చుని లేదంటే గార్డెన్‌లో కూర్చుని అయినా ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు.

8. ఆధ్మాత్మిక కార్యక్రమాల వైపు దృష్టి మళ్లించవచ్చు. యోగా, మెడిటేషన్‌ లాంటివీ చేయొచ్చు.


-డాక్టర్‌ భరత్‌ కుమార్‌ రెడ్డి, సీనియర్‌ కన్సల్టెంట్‌ 

సైక్రియాటిస్ట్‌, అపోలో హాస్పిటల్‌, హైదర్‌గూడ


ఒకరికొకరు సహాయపడితేనే...

ఈ లాక్‌డౌన్‌ మనకు ఓ విధంగా వరంలాంటిదే అనుకోవాలి. వ్యక్తిగతంగా మనలోని మార్పులు మనం విశ్లేషించుకుని, ఏ అంశంలో మార్పు చేసుకోవాలి. వ్యక్తిగతంగా ఎదిగేందుకు ఏం చేయాలనేది తెలుసుకోవడానికి బాగుంటుంది. అలాగే భార్యాభర్తలిరువురూ ఒకరికొకరు సహాయపడుతూ పనులు చేసుకుంటే మరింత ఉపయుక్తంగా ఉంటుంది. బంధం బలపడుతుంది. స్కిల్స్‌ మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తే టైమ్‌ సద్వినియోగం అవుతుంది. అదే సమయంలో అనవసర అంశాల పై వివాదాలూ తొలగుతాయి. పిల్లలుంటే టీవీలతో, స్మార్ట్‌ ఫోన్లకు అతుక్కుపోకుండా ఇండోర్‌ గేమ్స్‌ ఆడితే కొంత ప్రయోజనం ఉంటుంది. 

- డాక్టర్‌ స్వాతి, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైకాలజీ, ఉస్మానియా యూనివర్సిటీ  

Updated Date - 2020-04-08T19:52:09+05:30 IST