Advertisement
Advertisement
Abn logo
Advertisement

వడివడిగా..!

లాక్‌డౌన్‌ గడువు పెంపుతో పెరుగుతున్న రాకపోకలు

వివిధ రాష్ర్టాల నుంచి నగరానికి వలసకార్మికులు

అందుబాటులో ఉన్న రైళ్ల ద్వారా నివాస ప్రాంతాలకు..

సికింద్రాబాద్‌ స్టేషన్‌ పరిసరాల్లో మళ్లీ రద్దీ


హైదరాబాద్‌ సిటీ: రైళ్లలో రాకపోకలు మళ్లీ పుంజుకుంటున్నాయి. వైరస్‌ తీవ్రత, లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిన్న, మొన్నటివరకు ఒక్కో రైలులో 20-30 శాతం మంది మంది మాత్రమే ప్రయాణించారు. అయితే తాజాగా ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, తమిళనాడు వంటి రాష్ర్టాల్లో లాక్‌డౌన్‌ సడలింపులు ఇస్తున్నారు. రాష్ట్రంలో కూడా లాక్‌డౌన్‌ మే 31 నుంచి పది రోజులపాటు పొడిగించినా సడలింపు వేళలను పెంచారు. కొవిడ్‌ భయంతో రెండు నెలల క్రితం సొంతూళ్లకు వెళ్లిన వలసకూలీలు, ప్రైవేట్‌ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఒక్కొక్కరుగా తిరిగి నగరానికి చేరుకుంటున్నారు. దీంతో సికింద్రాబాద్‌ స్టేషన్‌ పరిసరాల్లో రద్దీ కనిపిస్తోంది. ఏప్రిల్‌ 20 నుంచి కరోనా రెండో దశ కేసులు పెరిగిపోవడంతోపాటు, వందల సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటుండడంతో రాష్ట్ర ప్రభుత్వం మే 12 నుంచి లాక్‌డౌన్‌ అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కూరగాయలు, అత్యవసర పనుల నిమిత్తం ప్రజలకు వెసులుబాటు కల్పించారు. అలాగే నాలుగు గంటల వ్యవధిలోనే మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు. ఆటోలు, ప్రైవేట్‌ వాహనాల రాకపోకలకు అనుమతిచ్చారు. దీంతో నిర్ణీత సమయంలో పనులు చక్కబెట్టుకునేందుకు, రవాణాకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు.


స్టేషన్‌కు రాలేక..

లాక్‌డౌన్‌ ఆంక్షలు నగరంలోని అన్ని రవాణా సౌకర్యాలపై ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రైల్వేశాఖపై లేదు. అయితే రైళ్లలో వెళ్తున్న వారు ఉదయం 6 నుంచి 10 గంటలలోపే స్టేషన్లకు చేరుకోవాలని, తర్వాత అనుమతించేదిలేదని పోలీసులు గట్టిగా చెప్పారు. దీంతో ఉదయం 10 తర్వాత రైళ్లలో వెళ్లే వారంతా తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. ఒకరిద్దరు మాత్రం క్యాబ్‌ల ద్వారా తమ వద్ద ఉన్న టికెట్లను పోలీసులకు చూపించి స్టేషన్లకు చేరుకునేవారు. ఈ క్రమంలో ప్యాసింజర్ల సంఖ్య పడిపోతున్నందున దక్షిణ మధ్య రైల్వే వివిధ మార్గాల్లో రైళ్లను తగ్గిస్తూ వస్తోంది. కాగా, గత నవంబర్‌ నుంచి ఏప్రిల్‌ వరకు 260పైగా నడిచిన ట్రైన్లు ఇప్పుడు 35 శాతానికి పడిపోయాయి. ప్రస్తుతం రోజు 127 రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. 


నగరానికి  వలస కార్మికులు..

తమ రాష్ర్టాల్లో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయడంతోపాటు తెలంగాణలో కూడా లాక్‌డౌన్‌ సడలింపులు పెరగటం, కేసుల తీవ్రత తగ్గుతుండడంతో  పొరుగు రాష్ర్టాలకు చెందిన వలస కార్మికులు మళ్లీ నగరానికి చేరుకుంటున్నారు. మంగళవారం గోరఖ్‌పూర్‌-హైదరాబాద్‌ స్పెషల్‌ రైలులో సుమారు 150 మంది కార్మికులు సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి తమ నివాస ప్రాంతాలకు తరలివెళ్లారు. అలాగే యశ్వంత్‌పూర్‌  స్పెషల్‌లో మరో 60మంది వరకు దిగారు. లాక్‌డౌన్‌ ను పూర్తిగా ఎత్తివేస్తే ప్రయాణికుల తాకిడి పెరుగుతుందనే భయంతో ముందస్తుగా నగరానికి వస్తున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, రైళ్లలో వెళ్లేందుకు వస్తున్న ప్రయాణికుల టికెట్లను తనిఖీచేసిన తర్వాతనే ఆర్‌పీఎఫ్‌ పోలీసులు స్టేషన్‌ లోపలికి పంపిస్తున్నారు. మాస్కులు లేకుండా స్టేషన్‌లో తిరుగుతున్న వారిని గట్టిగా హెచ్చరిస్తున్నారు. 


ఓనర్‌ రమ్మంటే వచ్చాను 

నేను నగరంలోని బోరబండలో ఉంటాను. ఇక్కడే కొన్నేళ్లుగా టైల్స్‌ పనిచేస్తున్నాను. కొవిడ్‌ భయంతో నెలరోజుల క్రితం ఇంటికి వెళ్లాను. మా రాష్ట్రం (ఉత్తరప్రదేశ్‌)లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఇన్నాళ్లూ ఇంటివద్దే ఉన్నాను. తెలంగాణలో లాక్‌డౌన్‌ సమయాన్ని పెంచినట్లు టీవీల ద్వారా తెలుసుకున్నాను. ఓనర్‌ ఫోన్‌ చేసి రమ్మంటే ఈ రోజు గోరఖ్‌పూర్‌-హైదరాబాద్‌ రైలులో వచ్చాను.

- రాకే్‌షయాదవ్‌, గోరఖ్‌పూర్‌


పని లేక ఇబ్బందులు 

ఏప్రిల్‌ నుంచి కొవిడ్‌ కేసులు పెరుగుతుండడంతో మే 2న  మా రాష్ర్టానికి వెళ్లాను. అక్కడ ఖాళీగా కూర్చోవడంతోపాటు పనులు లేక ఇబ్బందులు పడ్డాను. బాలానగర్‌లో టైల్స్‌ పనిచేస్తుంటాను. ఇక్కడ లాక్‌డౌన్‌ను మరో 8రోజుల్లో ఎత్తివేస్తారని తోటి పనివాళ్లు చెప్పడంతో వచ్చాను. పని చేసుకుంటేనే కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి ఉంటుంది.

 రాము గుప్తా, ఉత్తర్‌ప్రదేశ్‌

Advertisement
Advertisement