లాక్‌డౌన్‌ కష్టాలు

ABN , First Publish Date - 2020-03-28T09:06:26+05:30 IST

లాక్‌డౌన్‌తో వలస కార్మికుల కష్టాలు అన్నీఇన్నీకావు. ఎక్కడెక్కడినుంచో వచ్చినవారు వందల కిలోమీటర్ల దూరంలోని తమ సొంతూళ్లకు నడుచుకుంటూ వెళుతున్నారు. బతుకుదెరువు కోసం

లాక్‌డౌన్‌ కష్టాలు

స్వస్థలాలకు వెళ్లేందుకు వలస కూలీల తిప్పలు

యాదాద్రి జిల్లాలో చిక్కుకుపోయిన ఒడిసా కార్మికులు

వలస కార్మికుల బాగోగులు చూడండి: అమిత్‌ షా 

8వేలమందికిపైగా  మినహాయింపు పాస్‌లు అందజేత


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

లాక్‌డౌన్‌తో వలస కార్మికుల కష్టాలు అన్నీఇన్నీకావు. ఎక్కడెక్కడినుంచో వచ్చినవారు వందల కిలోమీటర్ల దూరంలోని తమ సొంతూళ్లకు నడుచుకుంటూ వెళుతున్నారు. బతుకుదెరువు కోసం దూర ప్రాంతాలకు వెళ్లిన తెలంగాణ ప్రజలూ ఎలాగో అలా సొంత ఊరుకు చేరుకుంటే అదే పదివేలు అనుకుంటున్నారు. మహారాష్ట్రలోని పర్బనీ ప్రాంతంలో ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్న నిజామాబాద్‌ జిల్లాకు చెందిన 62మంది కార్మికులు పనులు నిలిచిపోవడంతో సొంతూళ్లకు పయనమయ్యారు.  బోధన్‌ మండలం సాలూరు వద్ద ఆ గ్రామస్థులు వీరిని అడ్డుకున్నారు. అక్కడి ప్రభుత్వ పాఠశాలలోనే బస ఏర్పాటు చేసి భోజన సదుపాయాలు కల్పించారు. పోలీసులు, వైద్య సిబ్బంది వచ్చి వారందరికీ క్వారంటైన్‌ స్టాంపులు వేశారు. ఒడిసాకు చెందిన 21 కుటుంబాలు ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలానికి వచ్చారు.


పనిలేక పస్తులుం టున్నారు. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లొచ్చిన 31మంది కూలీలు హోం క్వారంటైన్‌ పాటించనందుకు  నారాయణపేట జిల్లా కృష్ణ మండలం తంగిడిగి గ్రామ సర్పంచ్‌ ఒక్కొక్కరికి 20వేల చొప్పున  జరిమానా విధించారు. కామారెడ్డి జిల్లా భిక్కునూరు మండలం అంతంపల్లి శివారులో 44వ జాతీయ రహదారిపై అనుమానాస్పదంగా తిరుగుతున్న హరియాణాకు చెందిన 30మందిని గ్రామస్థులు పట్టుకున్నారు. 13మంది ఛత్తీ్‌సగఢ్‌ కూలీలను వారుండే చోటే హోం క్వారంటైన్‌ చేశారు. గద్వాల జిల్లా పుల్లూరు చెక్‌పోస్ట్‌ వద్ద ఇరాన్‌కు చెందిన నలుగురు పర్యాటకులను పోలీసులు పట్టుకున్నారు. ఏపీలోకి వెళ్లే సూర్యాపేట జిల్లాలోని చెక్‌పోస్టు శుక్రవారం నిర్మానుష్యమైంది. సరిహద్దులను మూసివేశారు. వివిధ రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మాట్లాడారు. లాక్‌డౌన్‌తో వలస కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని..  వారి బాగోగులు చూడాలని ముఖ్యమంత్రులను కోరారు. 


భార్యాపిల్లలతో రిక్షాలో 130 కిలో మీటర్లు

రామ్‌చందర్‌ ఓ రిక్షా కార్మికుడు హైదరాబాద్‌లో భార్యాపిల్లలతో ఉంటున్నాడు. సొంతూరు జనగామ జిల్లా పాలకుర్తి మండలం వాయిలాల గ్రామ పరిధిలోని నారబోయిన గూడెంలో  ఉంటున్న  ఆయన తల్లి  తీవ్ర అనారోగ్యం పాలైంది.  135 కిలోమీటర్ల దూరం ఉన్న సొంతూరుకు వెళ్లేందుకు శుక్రవారం తెల్లవారుజామున 5గంటలకు భార్యాపిల్లలను  రిక్షాలో ఎక్కించుకొని తొక్కుకుంటూ బయలుదేరాడు. సాయంత్రం వరకు చేరుకుంటానని చెప్పాడు.


గుట్టుగా అంబులెన్స్‌లో 

పటాన్‌చెరుకు వలసొచ్చిన నారాయణఖేడ్‌  కూలీలను అంబులెన్స్‌లో గుట్టుగా వారి సొంతూరికి తరలించేందుకు డ్రైవర్‌ ప్రయత్నించగా.. సంగారెడ్డి వద్ద పోలీసులు పట్టుకున్నారు. పటాన్‌చెరు  నుంచి నారాయణఖేడ్‌కు నడుచుకుంటూ వెళుతున్న మరికొంత మంది   కోసం పోలీసులు ఓ వ్యాన్‌ను సిద్ధం చేసి అందులో కుక్కి పంపారు. 


మినహాయింపునకు పాసులివ్వండి 

హైదరాబాద్‌ సిటీ, మార్చి 27(ఆంధ్రజ్యోతి):  ఏప్రిల్‌-15 వరకు లాక్‌ డౌన్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో మినహాయింపు వర్గాల ప్రజలు బయటకు వెళ్లడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో వారికి ప్రత్యేక పాసులు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. దీంతో సైబరాబాద్‌ కమిషనరేట్‌కు ప్రజలు పోటెత్తారు. వీరిలో మెడికల్‌, కూరగాయాలు, నిత్యావసర సరులకులు విక్రయించేవారు, ఐటీ, ఫార్మా కంపెనీలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌ కమిషనరేట్‌లో 3వేలకు పైగా, సైబరాబాద్‌ పరిధిలో 5వేలకు పైన పాస్‌లు జారీ చేసినట్లు సమాచారం. డాక్టర్లు, మీడియా సిబ్బంది, పోలీసులు తమ ఐడీ కార్డులను చూపిస్తే సరిపోతుందని పోలీస్‌ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి మాత్రం పాస్‌లు మంజూరు చేసే అవకాశం లేదని, ఎక్కడి వాళ్లు అక్కడే ఉండిపోవాలని అధికారులు స్పష్టం చేశారు. హాస్టల్స్‌లో ఉండే వారిని యజమానులు ఇబ్బందులకు గురిచేస్తే స్థానిక పోలీ్‌సలను సంప్రదించాలన్నారు.

Updated Date - 2020-03-28T09:06:26+05:30 IST