సంపూర్ణ లాక్‌డౌన్ ఎఫెక్ట్.. జల్లికట్టు వాయిదా

ABN , First Publish Date - 2022-01-12T16:11:41+05:30 IST

కరోనా తీవ్రతను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ నెల 16వ తేదీ సంపూర్ణ లాకడౌన్‌ ప్రభావం వివిధ రంగాలపై చూపుతోంది. మదురై జిల్లాలో ప్రసిద్ధిగాంచిన అలంగానల్లూర్‌ జల్లికట్టు ఒక్కరోజు వాయిదా

సంపూర్ణ లాక్‌డౌన్ ఎఫెక్ట్.. జల్లికట్టు వాయిదా

ప్యారీస్‌(చెన్నై): కరోనా తీవ్రతను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ నెల 16వ తేదీ సంపూర్ణ లాకడౌన్‌ ప్రభావం వివిధ రంగాలపై చూపుతోంది. మదురై జిల్లాలో ప్రసిద్ధిగాంచిన అలంగానల్లూర్‌ జల్లికట్టు ఒక్కరోజు వాయిదా పడింది. 16న జరగాల్సిన జల్లికట్టు.. ఆ రోజున సంపూర్ణ లాక్‌డౌన్‌ కారణంగా 17వ తేదీకి వాయిదా వేసినట్లు మదురై జిల్లా కలెక్టర్‌ అనీష్‌ శేఖర్‌ ప్రకటించారు. ప్రతియేటా సంక్రాంతి సందర్భంగా అలంగానల్లూరులో నిర్వహించే జల్లికట్టు తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశవిదేశాల నుంచి కూడా సందర్శకులు తరలి వస్తుంటారు. లాక్‌డౌన్‌లోనూ ఈ జల్లికట్టును నిర్వహించేందుకు కొన్ని కట్టు బాట్లతో ప్రభుత్వం అనుమతించింది. అయితే రాష్ట్రంలో కరోనా తీవ్రరూపం దాల్చడంతో ఈ నెల 16వ తేదీన కూడా సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో అలంగానల్లూరు జల్లికట్టును ఒక్కరోజుకు వాయిదా వేసినట్లు కలెక్టర్‌ ప్రకటించారు. 

 

 బస్సు టిక్కెట్ల వాపస్‌

ఈ నెల 16వ తేదీ సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో ఆ రోజున ప్రయాణించేందుకు ముందుగా రిజర్వేషన్‌ చేసుకున్నవారికి డబ్బులు వాపస్‌ చేస్తామని రవాణా సంస్థలు స్పష్టం చేశాయి. ఇలా రిజర్వేషన్‌ చేసుకున్నవారిలో 12 వేల మందికిపైగా వున్నట్లు పేర్కొన్నాయి. సంపూర్ణ లాక్‌డౌన్‌ నాడు రాష్ట్రంలో ఎక్కడా బస్సులు తిరగకూడదని ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశాయి. అందువల్ల రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణీకులు ఆయా ప్రాంతాల్లో వున్న రిజర్వేషన్‌ కౌంటర్ల వద్దకు వెళ్లి చార్జీలు వాపస్‌ తీసుకోవచ్చని పేర్కొన్నాయి. అయితే ఆన్‌లైన్‌ ద్వారా టిక్కెట్లు బుక్‌ చేసు కున్న ప్రయాణికులకు వారి బ్యాంకు అకౌంట్లలోనే డబ్బు జమ చేయనున్నట్లు ప్రకటించాయి.


కదిలిన 16,768 ప్రత్యేక బస్సులు

పొంగల్‌ పండుగను సొంతూళ్లలో జరుపుకునేవారి కోసం రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థలు ప్రకటించిన ప్రత్యేక బస్సు సర్వీసులు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. చెన్నై సహా పలు ప్రాంతాల నుంచి 16,768 బస్సులు బయలుదేరాయి. మంగళ, బుధవారాల్లో చెన్నై నుంచి రోజూ నడుస్తున్న 2,100 బస్సులతో పాటు మరో 4 వేల ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా మూడు రోజుల పాటు నడపనున్నట్లు రవాణాశాఖ ప్రకటించింది. అలాగే వివిధప్రాంతాల నుంచి 16,768 బస్సులు బయలుదేరాయి.

Updated Date - 2022-01-12T16:11:41+05:30 IST