మహారాష్ట్రలో లాక్‌డౌన్‌!!

ABN , First Publish Date - 2021-04-11T06:44:44+05:30 IST

మహారాష్ట్రలో మరోసారి లాక్‌డౌన్‌ అమలు కానుంది. వైరస్‌ తీవ్రతపై శనివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే ఈ మేరకు సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది. రెండు గంటలపైగా జరిగిన అఖిలపక్ష

మహారాష్ట్రలో లాక్‌డౌన్‌!!

విధింపునకు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే మొగ్గు

అఖిలపక్ష సమావేశంలో 2 గంటలు చర్చ

15 రోజుల సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రతిపాదన

నేడు కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌తో భేటీ.. నిర్ణయం!

జీవనోపాధి దెబ్బతినే వారికి ఆర్థిక ప్యాకేజీ

వలస కూలీలు తిరిగి వెళ్లేందుకు సమయం

దేశంలో 1.45 లక్షల కొత్త కేసుల నమోదు

మహారాష్ట్ర వాటా తగ్గినా మిగతాచోట్ల ఉధృతి

ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీకి తోడైన కేరళ

794 మరణాలు; ఆర్నెల్ల తర్వాత గరిష్ఠం


ముంబై, న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 10: మహారాష్ట్రలో మరోసారి లాక్‌డౌన్‌ అమలు కానుంది. వైరస్‌ తీవ్రతపై శనివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే ఈ మేరకు సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది. రెండు గంటలపైగా జరిగిన అఖిలపక్ష భేటీలో.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు  ఏకైక మార్గం సంపూర్ణ లాక్‌డౌన్‌ ఒక్కటేనని ఉద్ధవ్‌ స్పష్టం చేశారు. ‘‘ప్రజల  ప్రాణాలు కాపాడటం ముఖ్యం. ఈరోజు మనం లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకోకుంటే, రేపు లాక్‌డౌన్‌ తరహా పరిస్థితులు వాటతంటవే వస్తాయి’’ అని వ్యాఖ్యానించారు.  సమావేశం సందర్భంగా 15 రోజుల సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రతిపాదన వచ్చింది. అయితే, ఆదివారం కొవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌తో ఉద్ధవ్‌ భేటీ కానున్నారు. అనంతరం నిర్ణయానికి రానున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వారాంతపు లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. కేసులు ఎక్కువగా వస్తున్నచోట రాత్రి కర్ఫ్యూ సైతం అమలు చేస్తున్నారు. అయినా, పాజిటివ్‌లు భారీగా నమోదవుతున్నాయి. రోజువారీ మరణాలు 300 పైగా ఉంటున్నాయి. కాగా, లాక్‌డౌన్‌ అమలు చేస్తే జీవనోపాధి దెబ్బతినేవారిని ఆదుకునేందుకు ఆర్థిక ప్యాకేజీ, వివిధచోట్ల నుంచి వచ్చిన వలస కూలీలు స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు కొంత గడువు ఇవ్వాలని సర్కారు ఆలోచిస్తోంది. ప్యాకేజీపై సోమవారం సమావేశం నిర్వహించి విధి విధానాలు రూపొందించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ తెలిపారు. 


+ దేశంలో శనివారం టీకా లబ్ధిదారుల సంఖ్య పది కోట్లు దాటింది. ప్రపంచంలో అత్యంత వేగంగా.. 85 రోజుల్లోనే ఈ మార్క్‌ను చేరుకున్నామని కేంద్రం తెలిపింది.  

+ సెకండ్‌ వేవ్‌తో అన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర వాటా కొద్దిగా తగ్గినా.. మిగతా రాష్ట్రాల్లో ఉధృతితో అత్యధిక సంఖ్యలో పాజిటివ్‌లు నమోదవుతున్నాయి. ఈ విషయంలో మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌కు కేరళ తోడైంది. శుక్రవారం 1,45,384 మందికి వైరస్‌ నిర్ధారణ అ యిందని, 794 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కాగా, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజాకు పాజిటివ్‌ వచ్చింది. ‘‘మహాభారత్‌’’ సీరియల్‌లో ఇంద్రుడి పాత్రధారి, పంజాబ్‌ నటుడు సతీష్‌ కౌల్‌ (74) కరోనాతో మృతిచెందారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు, మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా దెగ్లూ ర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎమ్మె ల్యే అంతపుర్కార్‌ రావూసాహెబ్‌(64) కరోనాతో మృతి చెందారు. బెంగళూ రు సహా 7నగరాల్లో శనివారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. 


రాష్ట్రాల్లో శనివారం కేసులు, మరణాలు ఇలా..

మహారాష్ట్ర 58,993 301

ఛత్తీస్‌గఢ్‌ 11,447 91

ఉత్తరప్రదేశ్‌ 9,600 36

ఢిల్లీ 8,521 39

కర్ణాటక 7,955 46

కేరళ 5,063 22

(మధ్యప్రదేశ్‌, తమిళనాడుల్లో 5వేలపైగా, గుజరాత్‌, రాజస్థాన్‌లో 4వేలకు మించి నమోదయ్యాయి)

Updated Date - 2021-04-11T06:44:44+05:30 IST