లాక్‌డౌన్‌ ఎత్తివేత

ABN , First Publish Date - 2021-06-20T04:20:14+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ ఎత్తివేసింది. కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయన్న వైద్య, ఆరోగ్యశాఖ నివేదిక మేరకు శనివారం జరిగిన మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో 40 రోజులుగా విధిస్తున్న అన్ని రకాల ఆంక్షలు పూర్తిగా తొలగిపోనున్నాయి.

లాక్‌డౌన్‌ ఎత్తివేత

కరోనా కేసులు తగ్గడంతో ప్రభుత్వం నిర్ణయం

నేటి నుంచి ప్రజలకు పూర్తి స్వేచ్ఛ

సినిమా హాళ్లు, బార్లు ఓపెన్‌

ఆఫీసుల్లో పూర్తిస్థాయి కార్యకలాపాలు

జూలై 1 నుంచి విద్యా సంస్థలు ప్రారంభం

- భౌతిక దూరం, మాస్క్‌ తప్పనిసరి

మంచిర్యాల, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ ఎత్తివేసింది. కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయన్న వైద్య, ఆరోగ్యశాఖ నివేదిక మేరకు శనివారం జరిగిన మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో 40 రోజులుగా విధిస్తున్న అన్ని రకాల ఆంక్షలు పూర్తిగా తొలగిపోనున్నాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభించడం, పాజిటివ్‌ కేసులు భారీ సంఖ్యలో పెరుగుతుండటంతో ప్రభుత్వం రాష్ట్రంలో మే 12వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ అమలు చేస్తోంది. ఆంక్షల సడలింపుతో  అంచెలంచెలుగా లాక్‌డౌన్‌ కొనసాగించారు. లాక్‌డౌన్‌ కారణంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో క్రమంగా సడలింపుల వ్యవధిని ప్రభుత్వం పెంచుతూ వచ్చింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ సంపూర్ణంగా ఎత్తివేయడంతో కార్యాలయాల్లో పూర్తిస్థాయి కార్యకలాపాలు జరుగనుండగా పనుల్లో వేగం పుంజుకోనుంది. లాక్‌డౌన్‌ ఎత్తివేసినప్పటికీ ప్రజలు మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. 

సినిమా హాళ్లు, బార్లు ఓపెన్‌...

ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో ఇంతకాలం మూసి ఉన్న సినిమా హాళ్లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లు తిరిగి తెరుచుకోనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 10 సినిమా హాళ్లు ఉండగా, వాటిపై ఆధారపడి దాదాపు 300 కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. మొదటి దఫా కరోనా నుంచి నిన్నటి  వరకు అంటే దాదాపు 12 నెలల పాటు థియేటర్లు  మూసి ఉన్నాయి. మొదటి దఫా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో మూడు నెలల పాటు సినిమా టాకీసులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అంతలోనే సెకడ్‌ వేవ్‌ ప్రారంభం కావడంతో తిరిగి మూత పడ్డాయి. కరోనా కాలంలో సినిమా హాళ్ల కార్మికులు అనేక ఇబ్బందులు పడగా, ప్రభుత్వ నిర్ణయంతో వారికి తిరిగి ఉపాధి లభించనుంది. అయితే ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినా వెంటనే సినిమా హాళ్లు తెరుచుకొనే అవకాశాలు లేవు. రాష్ట్రవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయం తీసుకొని, సినిమాలు విడుదలైతే తప్ప థియేటర్లు తెరుచుకొనే పరిస్థితులు లేవు. అలాగే జిల్లాలో ఎనిమిది బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లు ఉన్నాయి.  ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఇచ్చిన సడలింపుల్లో బార్లకు అనుమతి ఇచ్చినప్పటికీ వాటిని తెరిచేందుకు నిర్వాహకులు ఆసక్తి చూపలేదు. ఆరేడు గంటలు తెరిచి ఉంచితే పెద్దగా ఒరిగేది లేదని భావించిన బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ నిరవధికంగా మూసివేయాలని నిర్ణయించింది. తాజాగా లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో తిరిగి బార్లు ఓపెన్‌ కానున్నాయి. 

పెరగనున్న బస్సుల సంఖ్య...

లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడవనున్నాయి. మంచిర్యాల డిపో నుంచి సంస్థకు చెందిన 80 బస్సులు 24 గంటలపాటు పూర్తిస్థాయిలో ప్రయాణాలు సాగించనున్నాయి. ఉద్యోగులు పూర్తి సంఖ్యలో హాజరుకావాలని డిపో అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రయాణికుల సంఖ్యను బట్టి క్రమంగా అన్ని రూట్లలో బస్సులను నడిపించనున్నట్లు డిపో మేనేజర్‌ మల్లేషయ్య తెలిపారు. ఆర్టీసీ అద్దె బస్సుల పునరుద్ధరణకు ప్రభుత్వం ఇంకా ఆమోదం ఇవ్వకపోవడంతో అవి రోడ్డెక్కే అవకాశాలు లేవు. ప్రస్తుతం డిపో పరిధిలో ఉన్న సంస్థ సర్వీసుల రూట్లను మాత్రమే పునరుద్ధరించనున్నట్లు డీఎం తెలిపారు. 

జూలై 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం....

లాక్‌డౌన్‌ను పూర్తిస్థాయిలో ఎత్తివేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల కింద పనిచేసే విద్యాలయాలను వచ్చే 1వ తేదీ నుంచి ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది. విద్యాలయాలు ప్రారంభం చేసినప్పటికీ తప్పనిసరిగా విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరుకావాలనే నిబంధన ఏమీ లేదు. విద్యాలయాలకు హాజరయ్యేందుకు సుముఖంగా లేని విద్యార్థుల కోసం ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తొలుత నిర్ణయించిన మేరకు ఈ నెల 21 నుంచి ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరు కావలసి ఉంది. ప్రస్తుతం విద్యాలయాలను జూలై 1 నుంచి ప్రారంభిస్తుండగా సోమవారం నుంచి ఉపాధ్యాయులు హాజరు కావాలా లేదా అన్న విషయం ఇంకా స్పష్టం కాలేదు. గతంలో లాక్‌డౌన్‌ ఎత్తివేసిన సమయంలో మొదట ఉపాధ్యాయులను పాఠశాలలకు వెళ్లాలని ప్రభుత్వం సూచించింది. పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన ఏర్పాట్లు చేయడం కోసం వారు ముందస్తుగా పాఠశాలలకు హాజరయ్యే వారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉండవచ్చునని మెజారిటీ టీచర్లు అభిప్రాయపడుతున్నారు.  

Updated Date - 2021-06-20T04:20:14+05:30 IST