మహారాష్ట్రలో మళ్లీ లాక్‌?

ABN , First Publish Date - 2021-03-29T07:44:19+05:30 IST

మహారాష్ట్ర మరోసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్‌లోకి వెళ్లబోతోందా? పెరిగిపోతున్న వైరస్‌ ఉధృతికి అడ్డుకట్ట వేయాలంటే.. లాక్‌డౌన్‌ తప్పదని ప్రభుత్వం భావిస్తోందా? నిర్లక్ష్యం వీడకపోతే లాక్‌డౌన్‌ తప్పదని...

మహారాష్ట్రలో మళ్లీ లాక్‌?

  • ఆర్థిక ఇబ్బందులు రాకుండా లాక్‌డౌన్‌ అమలుకు ప్రణాళిక సిద్ధం చేయండి
  • ఒక్కరోజులో కేసులు 62 వేలు.. మరణాలు 312
  • అధికారులకు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఆదేశం
  • దేశంలో కొనసాగుతున్న సెకండ్‌ వేవ్‌ తీవ్రత
  • 18వ రోజూ రికవరీల కన్నా కొత్త కేసులే ఎక్కువ
  • మహారాష్ట్రలోనే 56శాతం కేసులు, 53శాతం మరణాలు
  • ముంబై, నాగ్‌పూర్‌లో భారీగా పాజిటివ్‌లు
  • కేంద్ర మంత్రి రతన్‌లాల్‌ కటారియాకు వైరస్‌

న్యూఢిల్లీ, మార్చి 28: మహారాష్ట్ర మరోసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్‌లోకి వెళ్లబోతోందా? పెరిగిపోతున్న వైరస్‌ ఉధృతికి అడ్డుకట్ట వేయాలంటే.. లాక్‌డౌన్‌ తప్పదని ప్రభుత్వం భావిస్తోందా? నిర్లక్ష్యం వీడకపోతే లాక్‌డౌన్‌ తప్పదని ఇప్పటికే హెచ్చరించిన సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే.. ఇప్పడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారా? అంటే.. ఔననే సమాధానం వినిపిస్తోంది. సెకండ్‌ వేవ్‌ తీవ్రతకు ప్రజల నిర్లక్ష్యమే కారణమని భావిస్తున్న ప్రభుత్వం.. మళ్లీ లాక్‌డౌన్‌ దిశగా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా కాపాడుకునేందుకు ఉద్ధవ్‌ యోచిస్తున్నారని సమాచారం. ఈ దిశగా పక్కా ప్రణాళిక సిద్ధం చేయాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సారి లాక్‌డౌన్‌ విధించాల్సి వస్తే.. గందరగోళానికి ఏమాత్రం ఆస్కారం లేకుండా ముందుకెళ్లాలని, అదే విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితికీ ఇబ్బంది రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఓ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను కోరారు. ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమన్నారు. 


రాష్ట్రంలో కేసులు రోజురోజుకీ పెరిగిపోతుండడం వల్ల ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి పెరిగిపోతోందని, ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు లాక్‌డౌన్‌ మినహా వేరే ప్రత్యామ్నాయం కనిపించడం లేదని ఉద్ధవ్‌ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ విధిస్తే.. ఆహార ధాన్యాలకు, మందులకు ఏ కొరతా రాకుండా చూసుకోవాలని, ముఖ్యమైన సేవలు, వైద్య సదుపాయాలకు ఎలాంటి అంతరాయమూ కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు. కాగా.. దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రరూపం దాల్చుతోంది. వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. శుక్రవారం 60 వేలు దాటిన కేసులు.. శనివారం కూడా అదే స్థాయిలో నమోదయ్యాయి. ఒక్కరోజులో 62,714 మంది వైరస్‌ బారినపడగా.. మొత్తం కేసులు 1,19,71,624కి చేరాయి. మరణాలు ఈ ఏడాదిలోనే తొలిసారిగా 300కు పైబడి నమోదయ్యాయి. ఒక్కరోజే 312 మంది మృత్యువాత పడగా.. మొత్తం మరణాల సంఖ్య 1,61,552కి పెరిగింది. 28,739 మంది తాజాగా వైరస్‌ నుంచి కోలుకోగా.. ఈ సంఖ్య 1,13,23,762కి చేరింది. వరుసగా 18వ రోజూ రికవరీల కన్నా కొత్తకేసుల సంఖ్య అధికంగా నమోదవడంతో.. యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,86,310కి పెరిగింది. ఇది మొత్తం కేసుల్లో 4.06 శాతం కావడం గమనార్హం. రికవరీ రేటు 94.58 శాతానికి తగ్గగా.. మరణాల రేటు 1.35 శాతంగా ఉంది. కాగా, కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రతన్‌లాల్‌ కటారియాకు కరోనా సోకింది. మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి అదుపు తప్పుతోంది. పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. ఇక్కడ శనివారం ఒక్కరోజులో 35,726 పాజిటివ్‌ కేసులు వెలుగుచూడగా.. ఏకంగా 166 మంది మృత్యువాత పడ్డారు. 




శనివారం దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 56 శాతం ఈ ఒక్క రాష్ట్రం నుంచే రాగా.. 53 శాతం మరణాలు కూడా ఇక్కడే సంభవించాయి. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ఇక్కడ ఒక్కరోజులో 6,923 మంది వైరస్‌ బారిన పడ్డారు. దీంతో.. యాక్టివ్‌ కేసుల సంఖ్య ఒక్క ముంబైలోనే 45 వేలకు చేరింది. ఇక నాగ్‌పూర్‌లో కూడా పరిస్థితి తీవ్రంగా మారుతోంది. ఇక్కడ శనివారం రికార్డు స్థాయిలో 58 మంది కొవిడ్‌తో కన్నుమూశారు. మరో 3,970 మందికి వైరస్‌ సోకింది. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్‌ రేటు కూడా ఆందోళనకర స్థాయిలో ఉంది. దేశ సగటు 5.04ు ఉండగా.. మహారాష్ట్ర సగటు మాత్రం 22.78ుగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మొత్తం 8 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో దేశ సగ టు కన్నా అధికంగా పాజిటివిటీ రేటు నమోదవుతోందని తెలిపింది. చండీగఢ్‌ (11.85 శాతం), పంజాబ్‌ (8.45 శాతం), గోవా (7.03 శాతం), పుదుచ్చేరి (6.85 శాతం), చత్తీ్‌సగఢ్‌ (6.79 శాతం), మధ్యప్రదేశ్‌ (6.65 శాతం), హరియాణ (5.41 శాతం) రాష్ట్రాలు మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయని వివరించింది. ఇక కరోనా నిర్ధారణ పరీక్షల విషయానికి వస్తే.. 15 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు దేశ సగటు కన్నా దిగువన ఉన్నాయని, ఈ జాబితాలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌ తదితర రాష్ట్రాలు ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.

Updated Date - 2021-03-29T07:44:19+05:30 IST