కట్టడి.. కట్టుదిట్టం..!

ABN , First Publish Date - 2020-04-04T10:19:47+05:30 IST

జిల్లా పోలీసు యంత్రాంగం శుక్రవారం నుంచి లాక్‌డౌన్‌ ఆంక్షలు మరింత కఠినం చేసింది.

కట్టడి.. కట్టుదిట్టం..!

రోడ్డెక్కినవారికి బడిత పూజ

జరిమానాలు, గుంజీలతో శిక్ష

అయినా ప్రజల్లో కనిపించని మార్పు

భౌతిక దూరానికి తిలోదకాలు

దుకాణాలు, మార్కెట్ల వద్ద కిక్కిరిసిన జనం

నేటి నుంచి మార్కెట్‌ యార్డులో పాతూరు మార్కెట్‌


అనంతపురం, ఏప్రిల్‌3(ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీసు యంత్రాంగం శుక్రవారం నుంచి లాక్‌డౌన్‌ ఆంక్షలు మరింత కఠినం చేసింది. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారికి పోలీసులు లాఠీతో బుద్ధిచెప్పారు. జనాన్ని కట్టడి చేయాలన్న కోణంలోనే ఆంక్షలు కొనసాగాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ పోలీసులు ఇదే వైఖరిని అవలంబించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నించారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకూ రోడ్లపై ప్రజలు తిరిగినా చూసీచూడనట్లు వ్యవహరించారు. ఆ సమయం ముగియగానే లాఠీలకు పని చెప్పారు. వీధుల్లోకి పరుగెత్తినా వదలకుండా బడితెపూజ చేశారు. దీంతో అనవసరంగా రోడ్లపైకి రావడానికి జనం జంకారు.


రోడ్డెక్కిన వారికి లాఠీ దెబ్బలు 

జిల్లాలోని అనంతపురం నగరంతోపాటు తాడిపత్రి, కళ్యాణదుర్గం, ధర్మవరం, హిందూపురం, కదిరి, గుంతకల్లు పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లోనూ శుక్రవారం ప్రజలు యథేచ్ఛగా రోడ్లపై తిరిగారు. ఇక అనంతపురం నగరంలో ఏ వీధిలో చూసినా జనం సాధారణ రోజుల్లో మాదిరిగానే తిరిగారు. దీంతో పోలీసులు ఓ వైపు ప్ర ధాన రోడ్లపై తిరుగుతున్న జనంపై లాఠీ ఝళిపిస్తూనే శిక్షలు కూడా అమలు చేశారు. 300 మందికిపైగా ద్విచక్రవాహనదారులకు జరిమానాలు విధించారు. రోడ్లపైకి వచ్చిన కొందరు యువకులతో నగర నడిబొడ్డున టవర్‌క్లాక్‌ వద్ద గుంజీలు తీయించారు. మరోసారి రోడ్డుపైకి వస్తే జరిమానాలు, గుంజీలతో కాదు కేసులు నమోదు చేసి, జైలుకు పంపుతామంటూ హెచ్చరించారు. అయినా ప్రజల్లో మార్పు కనిపించలేదు. పోలీసుల కళ్లుగప్పి సందుల్లో తిరుగుతూనే కనిపించారు. ప్రజల బాధ్యతారాహిత్యానికి ఇదో పరాకాష్ట. ఇలా అయితే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అరికట్టడమెలా అని పోలీసులు సైతం వాపోతుండటం బాధ్యతలేని ప్రజల తీరుకు అద్దం పడుతోంది.


భౌతికదూరానికి తిలోదకాలు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఎవరూ నిత్యావసరాలకు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకూ సమయం నిర్దేశించింది. ఆ సమయంలో భౌతికదూరాన్ని పాటించాలని ఆదేశించింది. జిల్లా యంత్రాంగం, పోలీసులు భౌతికదూరాన్ని పాటించాలని ప్రజల్లో అవగాహన కల్పించినప్పటికీ క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి పెడచెవిన పెడుతున్నారు. బ్యాంకులు, ఏటీఎంలు, కిరాణాకొట్లు, మెడికల్‌ షాపులు, కూరగాయల మార్కెట్ల వద్ద జనం కిక్కిరిసిపోవటమే ఇందుకు నిదర్శనం. జిల్లా కేంద్రంలో పరిస్థితి  మరీ  ఘోరంగా మారింది. ఒకరిపై ఒకరు తోసుకునేలా వ్యవహరించారు.


ఇక కూరగాయల మార్కెట్ల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. వ్యాపారులు సైతం ఎక్కడా తమ దుకాణాల వద్ద భౌతిక దూరాన్ని సూచించే విధంగా గడులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు క్యూలైన్‌ను పాటించలేకపోయారు. పాతూరు మార్కెట్‌లోనూ ఇదే పరిస్థితి. ఇలా అయితే కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం ఎలా అని వాపోవడం కొందరి వంతైంది. కాగా పాతూరు మార్కెట్‌ను శనివారం నుంచి అనంతపురం మార్కెట్‌ యార్డులో నిర్వహించనున్నారు.


అన్నార్థులకు నేతల అభయహస్తమేదీ?

జిల్లాలో రెక్కాడితేగానీ డొక్కాడని ప్రజల పరిస్థితి అ యోమయంగా మారింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంట్లో నుంచి కాలు బయట పెట్టే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఎవరు ఒక పూట తిండి పెడతారా అని ఎదురుచూస్తూ.. కాలం వెల్లబుచ్చుతున్నారు. అన్నం కోసం అలమటించే ఆ పేదలకు రాజకీయ నేతల నుంచి ఎలాంటి అభయం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వేళ్లమీద లెక్కపె ట్టేలా కొందరు రాజకీయ నాయకులు మాత్రమే పేదలకు, బతుకుతెరువు కోసం జిల్లాకొచ్చిన ఇతర ప్రాంతాల వారికి భోజనం, వసతి సదుపాయాలు కల్పిస్తున్నారు.


జిల్లాలో ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న వారు గానీ, మాజీలు గానీ అన్నార్థులకు మేమున్నామంటూ అభయమిచ్చేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం. ఈ క్రమంలో స్వచ్ఛంద సంస్థలతో పాటు కొన్ని కులసంఘాలు, కొందరు యువకులు గుమిగూడి తమకు తోచిన సాయం అందిస్తుండటంతో ఆ పేద వర్గాలు బతుకులు అలా సాగిపోతున్నాయి. కొందరు రైతులు సైతం తమ పొలాల్లో పండిన టమోటా, కూరగాయలు, పండ్లు ప్రజలకు ఉచితంగా పంచుతూ సేవల్లో భాగస్వాములవుతున్నారు. మరికొందరు వ్యాపారులు సైతం సొంత లాభం కొంత మానుకుని పేద ప్రజలకు సేవలు చేస్తున్నారు.  


నర్సింగ్‌హోమ్‌లు, ఆస్పత్రులు తెరుచుకున్నా కానరాని వైద్యులు 

జిల్లాలోని అన్ని ప్రైవేట్‌ నర్సింగ్‌ హోమ్‌లు, ఆస్పత్రులు శుక్రవారం నుంచి తెరవాల్సిందేనని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. లేని పక్షంలో ఆ నర్సింగ్‌ హోమ్‌లు, ఆ ఆస్పత్రుల యాజమాన్యాలు డాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాధా రణ రోజుల్లో ఆస్పత్రులు ఓపెన్‌ చేసి క్లిష్ట సమయాల్లో మూసేయడం సరికాదని హితవు పలికారు. కలెక్టర్‌ హె చ్చరికల నేపథ్యంలో అనంతపురం నగరంతో పాటు జిల్లాలోని వివిధ పట్టణాల్లో ఉన్న నర్సింగ్‌ హోమ్‌లు, ఆస్పత్రులు తెరుచుకున్నాయి.


జ్వరం వచ్చిందనో, కడుపునొప్పి ఉందనో, మరీ ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆ ప్రైవేట్‌ నర్సింగ్‌ హోమ్‌లు, ఆస్పత్రులకు ఆతృతగా వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక డాక్టర్లు లేరంటూ అక్కడి సిబ్బంది చావుకబురు చల్లగా చెప్పారు. అనంతపురం నగరంలోని సాయినగర్‌కు వెళ్లే మెయిన్‌ రోడ్డులో ఉన్న ఆస్పత్రే ఇందుకు ఉదాహరణ. ఏదో కలెక్టర్‌ ఓపెన్‌ చేయ మన్నాడు కదా అని ఆస్పత్రులు తెరవడం కాదు.. రోగులకు వైద్యమందిస్తేనే కలెక్టర్‌ ఆదేశాలు అమలు చేసిన వారవుతారు. లేదంటే బేఖాతరు చేసినట్లే. ప్రైవేట్‌ నర్సింగ్‌ హోమ్‌లు, ఆస్పత్రుల యాజమాన్యాలే ఆలోచించాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2020-04-04T10:19:47+05:30 IST