లాక్‌తోనే డౌన్!

ABN , First Publish Date - 2021-05-14T07:54:58+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ ఢిల్లీని కుదిపేసింది! మహారాష్ట్రను అతలాకుతలం చేసింది. ఇప్పుడు ఆ రెండు రాష్ట్రాల్లో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ‘మాకు మెడికల్‌ ఆక్సిజన్‌ డిమాం

లాక్‌తోనే డౌన్!

ఆంక్షలతోనే వైరస్‌ విస్తృతికి అడ్డుకట్ట.. ఢిల్లీ, మహారాష్ట్ర చెబుతున్న పాఠమిదే

ఆ రెండుచోట్ల గణనీయంగా తగ్గిన కేసులు

అక్కడ యాక్టివ్‌ కేసుల గ్రాఫ్‌ తగ్గుముఖం

అంతర్జాతీయ నిపుణులదీ అదే సూచన

రాష్ట్రంలో మాత్రం ‘సహజీవన’ మంత్రం

అరకొర ఆంక్షల కర్ఫ్యూతో దక్కని ఫలం


ఒకరి ద్వారా ఒకరికి... మరొకరికి... ఇంకొకరికి! ఇది కరోనా  వైరస్‌ వ్యాపించే విధానం! ఈ ‘లింక్‌’ కట్‌ చేయాలంటే ఎవరికి వారు ఇళ్లలో కూర్చోవాలి. మన జనం స్వచ్ఛందంగా ఇళ్లకు పరిమితంకారు కాబట్టి... నిర్బంధంగా లాక్‌డౌన్‌ పెట్టడమొక్కటే మార్గం! లాక్‌డౌన్‌ నిక్కచ్చిగా అమలు చేస్తున్న ఢిల్లీ, మహారాష్ట్రలో కేసులు తగ్గుతుండటం నిజం!


కరోనాను, కర్ఫ్యూను లెక్కచేయకుండా జనం రోడ్లపై విచ్చలవిడిగా సంచరిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడ బందరు రోడ్డు... వాహనాలు, బైక్‌లతో ఇలా రద్దీగా కనిపించింది. 


(అమరావతి - ఆంధ్రజ్యోతి): కరోనా సెకండ్‌ వేవ్‌ ఢిల్లీని కుదిపేసింది! మహారాష్ట్రను అతలాకుతలం చేసింది. ఇప్పుడు ఆ రెండు రాష్ట్రాల్లో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ‘మాకు మెడికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ తగ్గింది. మా కోటాను ఇతర రాష్ట్రాలకు కేటాయించండి’ అని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రాన్ని కోరింది. మారిన ఈ పరిస్థితికి కారణం... కరోనా కోరలను ‘లాక్‌డౌన్‌’తో తుంచడమే అని నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీలో ఏప్రిల్‌ 19వ తేదీ నుంచి  లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. ఆ రోజుకు అక్కడ యాక్టివ్‌ కేసుల సంఖ్య 85 వేలు. ఆ తర్వాత కొన్ని రోజులు పెరుగుతూ పోయి... లక్షకు చేరుకున్నాయి. లాక్‌డౌన్‌ ప్రభావంతో ఆ తర్వాత కేసుల సంఖ్య తగ్గడం మొదలైంది. ఇప్పుడు ఢిల్లీలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 82 వేలు మాత్రమే. ప్రస్తుతం కొత్త కేసులకంటే... నయమవుతున్న వారి సంఖ్య ఎక్కువగా నమోదవుతోంది. ఇక... మహారాష్ట్రలోనూ అదే ఆశావహ పరిస్థితి కనిపిస్తోంది. మహారాష్ట్రంలో ఏప్రిల్‌ మూడోవారంలో 7 లక్షల యాక్టివ్‌ కేసులు ఉండేవి. లాక్‌డౌన్‌ దెబ్బకు వాటి సంఖ్య ఇప్పుడు 5.4 లక్షలకు దిగి వచ్చింది. ఇతర రాష్ట్రాలో పెరుగుతున్న కరోనా గ్రాఫ్‌... ఈ రెండు రాష్ట్రాల్లో కిందికి దిగుతోంది. వైరస్‌ చైన్‌ లింక్‌ కట్‌ చేయడానికి పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ప్రధాన అస్త్రంగా ఉపయోగిస్తున్నాయి. తమిళనాడు, కర్ణాటక, ఒడిసాలు ఎప్పటి నుంచో లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం తెలంగాణ కూడా రాష్ట్రం మొత్తం లాక్‌డౌన్‌ ప్రకటించింది.


మన రాష్ట్రంలో ఇదీ పరిస్థితి... ‘కరోనాతో సహజీవనం చేయడంతప్ప మరో మార్గం లేదు’ అని చెబుతున్నారే తప్ప... నియంత్రించేందుకు లాక్‌డౌన్‌ వంటి మార్గాలున్న విషయాన్ని ప్రభుత్వ పెద్దలు విస్మరించారు.  కరోనా ఉధృతి కట్టడికి అమలు చేస్తున్న అరకొర కర్ఫ్యూ జల్లెడలో నీళ్లు పట్టిన చందంగా మారుతోంది. ఆరు గంటలు ప్రజల్ని విచ్చలవిడిగా వదిలేసి... ఆ తర్వాత కర్ఫ్యూ పెట్టడం వల్ల ప్రయోజనం లభించడంలేదు. ఈ నెల 5వ తేదీ నుంచి రాష్ట్రంలో 18 గంటల కర్ఫ్యూ అమలవుతోంది. అంటే... దాదాపు 10 రోజులు కావొస్తోంది. కానీ, రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పట్టినట్లు కనిపించడం లేదు. పైగా పాజిటివిటీ రేటు జాతీయ సగటుతో సమానంగా నమోదు అవుతోంది. కేసుల సంఖ్య రోజూ 20 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాలు వందను దాటుతున్నాయి. నిజానికి... రాష్ట్ర ప్రభుత్వం ఈ కర్ఫ్యూ అమలు చేయకముందే చాలాచోట్ల ప్రజలే స్వచ్ఛంద కర్ఫ్యూ పాటించేవారు. స్థానిక  ప్రజా ప్రతినిధులు కూడా తమ పరిధిలో ఆంక్షలు అమలు చేశారు. పోనీ... ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన 18 గంటల కర్ఫ్యూ అయినా సక్రమంగా అమలవుతోందా అంటే అదీ లేదు. మొదటి రెండు రోజులు పోలీసులు హడావిడి చేశారు. విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలు, కొన్ని పట్టణాల్లో మాత్రం కొద్దిగైనా ఆంక్షలు అమలవుతున్నాయి. ఇక చాలాచోట్ల 12 గంటలకు ఆగిపోవాల్సిన రాకపోకలు మధ్యాహ్నం 3 వరకు సాగుతున్నాయి. మళ్లీ సాయంత్రం 5 తర్వాత జనం రోడ్ల మీదికి వస్తున్నారు. ఇలాంటి కర్ఫ్యూ వల్ల పెద్దగా ఉపయోగం లేదని నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర తరహాలో కఠినమైన లాక్‌డౌన్‌ అమలు చేయడమే మార్గమని సూచిస్తున్నారు.




మహారాష్ట్రలో తగ్గుముఖం


ఢిల్లీలో దిగువకు


ఆంధ్రప్రదేశ్‌లో పైపైకి..

Updated Date - 2021-05-14T07:54:58+05:30 IST