లాక్‌ డౌన్‌ నిబంధనలు బేఖాతర్‌

ABN , First Publish Date - 2020-06-06T10:10:32+05:30 IST

కంటైన్మెంట్‌ జోన్లలో ఆంక్షలు సడలించడంతో ముఖానికి మాస్క్‌లు కూడా ధరించకుండా, కనీస భౌతిక దూరం పాటించకుండా యఽథేచ్ఛగా తిరుగుతున్నారు.

లాక్‌ డౌన్‌ నిబంధనలు బేఖాతర్‌

మాస్క్‌లు లేవు ఫ భౌతికదూరం పాటించరు ఫ వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణం

చేతులెత్తి మొక్కుతా.. చేయి చేయి కలపకురా..

కాళ్లు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా..


కరోనా వ్యాప్తి నివారణకు లాక్‌డౌన్‌ విధించిన తొలినాళ్లలో ఈ పాట వైరల్‌.. ఒక స్ఫూర్తి.. చిన్న పిల్లల నుంచి పెద్దలు, మహిళలు సైతం వైరస్‌ తీవ్రతను అర్థం చేసుకోడానికి దోహదపడింది. దీనికితోడు పోలీసు శాఖ లాక్‌డౌన్‌ నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేయడంతో ప్రజలు గడప దాటి అడుగు బయట పెట్టలేదు. దీనితో మాస్క్‌, భౌతికదూరం అవసరం లేకపోయింది.


రెండు నెలల తర్వాత లాక్‌డౌన్‌ నిబంధనల్లో సడలింపులు, మద్యం విక్రయాలకు అనుమతితో జనం కట్టు తప్పారు. మాస్క్‌లు, భౌతికదూరం తప్పనిసరి అంటూ ఎంతగా హెచ్చరించినా జనం బేఖాతరు అంటున్నారు. 70 రోజులు గడిచిన తర్వాత నిబంధనలు పాటించండి అంటూ హెచ్చరించాల్సి వచ్చింది.


దుకాణాలు, బ్యాంకుల వద్ద భౌతిక దూరం లేదు. మాస్క్‌లు ధరించాలనే ధ్యాసే లేకుండా ప్రవరిస్తున్నారు. వాహనాలపై పరిమితికి మించి ప్రయాణిస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న దశలో నిబంధనల ఉల్లంఘన ఆందోళన కలిగిస్తోంది.


ఏలూరు రూరల్‌: కంటైన్మెంట్‌ జోన్లలో ఆంక్షలు సడలించడంతో ముఖానికి మాస్క్‌లు కూడా ధరించకుండా, కనీస భౌతిక దూరం పాటించకుండా యథేచ్ఛగా తిరుగుతున్నారు. నగరంలో రోడ్లపై రద్దీ వాతావరణం కనిపి స్తోంది. లాక్‌డౌన్‌ సడలింపులను కొందరు అపహాస్యం చేస్తున్నారు. కనీస భౌతిక దూరం ఆదేశాలు అటకెక్కుతున్నాయి. నిత్యావసర సరుకులు, ఇతర ముఖ్యమైన పనులకు వచ్చేవారు ఏమాత్రం రక్షణ చర్యలు తీసుకోవడం లేదు. దుకాణాల వద్ద కొనుగోలుకు వచ్చే వారు మాస్క్‌లు ధరించడం లేదు. గుంపులుగా చేరుతున్నారు.


ఆకివీడు: మాస్క్‌లు ధరించకుండా రోడ్లపై తిరుగుతున్నారు. బ్యాంకులు తదితర చోట్ల భౌతిక దూరం మరిచి గుంపులుగా చేరుతున్నారు.


తణుకు : స్వీయరక్షణ పాటించాలని అధికారులు మొత్తుకుంటున్నా ప్రజలు పెడచెవిన పెడుతున్నారు. రాష్ట్రపతి రోడ్డులో షాపింగ్‌ మాల్‌ వద్ద భౌతిక దూరం లేకుండా ఒకరిపై ఒకరు పడుతున్నట్లు నిలబడి ఉన్నారు. చాలా వ్యాపార సంస్థల వద్ద శానిటైజర్లు కూడా ఉంచడం లేదు.


నరసాపురం : లాక్‌డౌన్‌ సడలింపుతో నరసాపురం తీర ప్రాంతంలో నిబంధనలు గాలికి వదిలేశారు. మాస్కులు లేకుండానే రోడ్డపైకి వచ్చేస్తున్నారు. ఇక జాతీయ బ్యాంకుల వద్ద క్యూలైన్‌లో భౌతిక దూరం మచ్చుకైనా కనిపించడంలేదు. మెయిన్‌రోడ్‌లో తోపుడు బండ్లు, షాపుల వద్ద రద్దీ సమయాల్లో కస్టమర్లు గుంపులు కనిపిస్తున్నారు.  


గణపవరం : పోలీసులు ప్రత్యేక వాహనం పెట్టి మరీ కరోనాపై ప్రచారం చేస్తున్నా ప్రజలు బేఖాతరు అంటున్నారు. పనులకు వెళ్లేవారు భౌతిక దూరం అంటే తెలియనట్లే వ్యవహరిస్తున్నారు.  బ్యాంకుల వద్ద, దుకాణాల వద్ద ఖాతాదార్లు గుంపులుగా చేరుతున్నారు.


నిడదవోలు : కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ముఖాలకు మాస్కులు, భౌతిక దూరమే రక్షణ అని పదేపదే చెబుతున్నా కొంతమంది పట్టించుకో వడం లేదు. పట్టణంలో గాంధీబొమ్మ సెంటర్‌, నెహ్రూబొమ్మ సెంటర్‌, గణేష్‌చౌక్‌ సెంటర్లలో భౌతిక దూరం పాటించడం లేదు. 


ఆచంట : కరోనా వైరస్‌ రోజురోజుకు విజృంభిస్తుందని విస్తృత ప్రచారం చేస్తున్నప్పటికీ జనం మాత్రం మాస్కులు లేకుండానే ముఖ్యంగా యువకులు వాహనాలపై తిరుగుతూనే ఉన్నారు. షాపుల వద్ద కూడా మాస్కులు లేకుండానే పలువురు వస్తువులు కొనుగోలు చేసుకుంటున్నారు.


చింతలపూడి: చింతలపూడిలో భౌతిక దూరం బేఖాతరు అంటూ 60 శాతం మంది మాస్క్‌లు ధరించడం లేదు. వాహనాలపై ముగ్గురు, నలు గురు వెళుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల వద్ద మాత్రం శాని టైజర్లు, భౌతిక దూరం పాటిస్తున్నా, కార్యాలయాల బయట సౌకర్యాలు లేక పోవడంతో కార్యాలయాల వద్ద, బ్యాంకుల వద్ద రద్దీగానే ఉంటున్నాయి. 


భౌతిక దూరంతోనే కరోనాకు చెక్‌

పాలకొల్లు టౌన్: భౌతిక దూరం పాటిస్తే కరోనా వైరస్‌ ప్రబలే అవకాశం ఉండదని ఉప వైద్యాధికారి బి.దుర్గాప్రసాద్‌ అన్నారు. 19, 20 వార్డులలో శుక్రవారం దుర్గాప్రసాద్‌, నోడల్‌ అధికారి కె.అశ్విని ఆధ్వర్యంలో వైద్యులు కేవీ.రామకృష్ణారావు, భాస్కరరెడ్డి, స్వరూప్‌ ట్రూనా ట్‌ పరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బంది, సర్వే చేస్తున్న వలంటీర్లను పర్యవేక్షిం చారు. కరోనా నియంత్రణ జాగ్రత్తలపై అవగాహన కలిగించారు.


నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

భీమడోలు: రెడ్‌జోన్‌ ప్రాంతంలో విధించిన నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సుబ్బారావు హెచ్చరించారు. రెడ్‌ జోన్‌ ప్రాంతంలో వ్యాపార సంస్థలు మూతపడతాయని, గ్రామస్తులు ఈ జోన్‌ పరిధిలో తిరగరాదని సూచించారు. గ్రామ పంచాయతీ అధికారులు రెడ్‌జోన్‌ పరిధిలో శానిటేషన్‌ పనులు చేస్తు న్నారన్నారు. సీఐతోపాటు భీమడోలు ఎస్‌ఐ శ్రీహరిరావు రెడ్‌జోన్‌ ప్రాంతంలో పర్యటించి  గృహస్తులకు, వ్యాపారు లకు పలు సూచనలు, జాగ్రత్తలు ఇచ్చారు.


వ్యాపార సమయం పెంపు : జాగ్రత్తలు పాటించాలి

తాడేపల్లిగూడెం రూరల్‌: తాడేపల్లిగూడెం పట్టణంలో వ్యాపారులకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్టు తహసీల్దార్‌ బి.సాయిరాజ్‌ పేర్కొన్నారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద వ్యాపార వర్గాల నాయకులతో శుక్రవారం సమావేశం నిర్వహిం చారు. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలు పాటించాలని సూచించారు. సీఐ ఆకుల రఘు మాట్లాడుతూ  ఎవరు నిబంధనలు అతిక్రమించినా వారిపై కేసులు తప్పవని హెచ్చరించారు.

Updated Date - 2020-06-06T10:10:32+05:30 IST