లేఆఫ్‌ గనుల్లో లాక్‌డౌన్‌ వేతనాలు

ABN , First Publish Date - 2020-04-05T10:26:45+05:30 IST

కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించి పూర్తిస్థాయిలో వేతనాలు చెల్లిస్తున్నా

లేఆఫ్‌ గనుల్లో లాక్‌డౌన్‌ వేతనాలు

అత్యవసర సిబ్బందికి డబుల్‌ మస్టర్లు

ఆర్‌ఎల్‌సీ ఎదుట పట్టుపట్టేందుకు కేంద్ర సంఘాల వ్యూహం 

 

ఇల్లెందు, ఏప్రిల్‌ 4: కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించి పూర్తిస్థాయిలో వేతనాలు చెల్లిస్తున్నా సింగరేణి కాలరీస్‌లో అండర్‌ గ్రౌండ్‌ గనుల్లో లేఆఫ్‌ ప్రకటించడం, ఓసీల్లో యథావిథిగా ఉత్పత్తి సాగిస్తుండటంతో జాతీయ కార్మిక సంఘాలు యాజమాన్యం ప్రకటించిన లేఆఫ్‌ గనుల్లో కార్మికులకు లాక్‌డౌన్‌ వేతనాలు చెల్లించాలని, అత్యవసర సర్వీసుల సిబ్బందికి డబుల్‌ మస్టర్లు ఇవ్వాలని కోరుతున్నాయి. కరోనా ప్రభావంతో తల్లడిల్లుతున్న కుటుంబాలను కాదని ప్రాణాలను పణంగా పెట్టి బొగ్గు గనులకు అనేక కష్ట నష్టాలకు ఓర్చి విధులు నిర్వహిస్తే అండర్‌గ్రౌండ్‌ బొగ్గు గనుల్లో లేఆఫ్‌ ప్రకటించడం, కార్మికుల అంగీకారం లేకుండా సీఎం సహయనిధికి ఒకరోజు వేతన మినహాయింపు, మార్చి వేతనాల్లో 50శాతం కోతలు విధించడాన్ని ఆగ్రహిస్తూ ఇప్పటికే ఓసీల కార్మికులు వివిధ ఏరియాల్లో మెరుపు సమ్మెలకు పూనుకోవడంతో యాజమాన్యం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది.


ప్రతి కార్మికుడికి రూ.15 వేలు తగ్గకుండా వేతనం చెల్లించేందుకు నిర్ణయించింఆది. సీఎం సహయనిధికి ఒక రోజు వేతనం మినహాయింపు కల్పించడం, కరోనా ప్రభావంతో నిలిపివేసిన 50శాతం వేతనాలు పరిస్థితులు కుదుట పడిన పిదప చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు శాంతించారు. అయితే పలు డిమాండ్లపై ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీచ, సీఐటీయూ, బీఎంఎస్‌, హెచ్‌ఎంఎస్‌ జాతీయ కార్మిక సంఘాలు సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీస్‌ జారీ చేయడంతో లాక్‌డౌన్‌ గడువు తరువాత రీజినల్‌ లేబర్‌ కమిషనర్‌(ఆర్‌ఎల్‌సీ) కార్మిక సంఘాలను, యాజమాన్యాన్ని చర్చలకు పిలిచే అవకాశం ఉంది.


ఈ క్రమంలో కేంద్ర, రాష్ష్ర ప్రభుత్వాలు, కోల్‌ ఇండియా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ కాలంలో ఉద్యోగులు, కార్మికులకు పూర్తిస్థాయి వేతనాల చెల్లింపుపై ఆర్‌ఎల్‌సీ ఎదుట గట్టి పట్టు పట్టాలన్న యోచనలో జాతీయ సంఘాల నాయకులు వ్యూహరచన చేస్తున్నారు. అయితే కార్మికుల ప్రధాన డిమాండ్‌ అయిన బొగ్గు గనుల్లో లాక్‌డౌన్‌ ప్రకటించాలన్న ఆంశంపై స్పష్టత ఇవ్వకపోవడంతో తమకు నష్టం జరుగుతుందని వాపోతున్నారు. అంతేగాక అనేక కష్ట నష్టాలకు ఓర్చి   విధులకు హజరువుతున్న కార్మికులు, ఉద్యోగులకు డబుల్‌ మస్టర్లు ఇవ్వాలని కోరుతుండటంతో  జాతీయ సంఘాలు ఆర్‌ఎల్‌సీ చర్చల్లో యాజమాన్యంపై ఈ విషయంపై వత్తిడి తెచ్చేందుకు సమాలోచనలు ప్రారంభించాయి.  


బ్యాంకుల్లో ఈఎంఐల కోతలు యథతథం

కరోనా వైరస్‌ మూలంగా బ్యాంకులు, ఇతర ప్రభుత్వ ఆర్థిక సంస్థల్లో నెలసరి వాయిదాల చెల్లింపులను నిలిపివేస్తున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించినప్పటికి క్షేత్ర స్థాయిలో అమలు కాకపోవడం గమనార్హం. కార్మికులు, ఉద్యోగులు బ్యాంకుల ద్వారా పొందిన గృహ రుణాలు, విద్య, వ్యక్తిగత రుణాలకు సంబంధించిన ఈఎంఐలను ఏప్రిల్‌ 1నే బ్యాంకుల ఖాతాల నుంచి మినహాయించుకున్నారు. కాగా సింగరేణి కార్మికులు, ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను బ్యాంకుల అధికారులకు వివరించగా కార్మికులు, ఉద్యోగులు ఈఎంఐల చెల్లింపులపై గడువు కోరుతూ వ్యక్తిగత దరఖాస్తులు సమర్పించాలని స్పష్టం చేస్తున్నట్లు కార్మికులు తెలిపారు.

Updated Date - 2020-04-05T10:26:45+05:30 IST