లోకేశ్‌ పర్యటనపై టెన్షన్‌.. టెన్షన్‌..!

ABN , First Publish Date - 2021-09-08T05:30:00+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి..

లోకేశ్‌ పర్యటనపై టెన్షన్‌.. టెన్షన్‌..!

నేడు నరసరావుపేటకు రానున్న నారా లోకేశ్‌

అనూష కుటుంబానికి పరామర్శ

అనుమతి లేదన్న డీఐజీ త్రివిక్రమ వర్మ

అసలు దరఖాస్తే స్వీకరించని పోలీసు శాఖ

నరసరావుపేటలో పొలిటికల్‌ హీట్‌  

ప్రశాంతతను పాడు చేస్తామంటే ఊరుకోం: డాక్టర్‌ గోపిరెడ్డి

ఆయన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్న డాక్టర్‌ అరవిందబాబు

ఇక్కడకు రావడానికి వీసా కావాలా..?: జీవీ ధ్వజం

మేమేం సంఘ విద్రోహ శక్తులమా?: ఆనందబాబు

 

గుంటూరు, నరసరావుపేట(ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నరసరావుపేట పర్యటనపై సర్వత్రా టెన్షన్‌.. టెన్షన్‌ నెలకొంది. గత ఫిబ్రవరి 24న ఉన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థిని అనూష కుటుంబసభ్యులను నరసరావుపేటలో పరామర్శించనున్నారు. ఈ మేరకు షెడ్యూలు ఖరారు చేశారు. ఆయన పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ టీడీపీ నేతలు స్థానిక పోలీసు అధికారులకు దరఖాస్తు అందజేసేందుకు వెళ్లగా దానిని స్వీకరించేందుకు వారు నిరాకరించారు. లోకేశ్‌ పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు ప్రకటించారు. 


కాగా లోకేశ్‌ పర్యటన నరసరావుపేటలో రాజకీయ హీట్‌ పెంచుతోంది. తెలుగుదేశం నేతలు శవ రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే గోపిరెడ్డి విమర్శించారు. నరసరావుపేటలో పార్టీ మనుగడ కోసం లోకేశ్‌ వస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. నరసరావుపేటలో ఉన్న ప్రశాంతతను పాడు చేస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు. దిశచట్టంపై ప్రభుత్వానికి పూర్తి నిబద్ధత ఉందన్నారు. ఈ వ్యాఖ్యలను టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, డాక్టర్‌ అరవిందబాబు తదితర నేతలు తీవ్రంగా ఖండించారు. 

   

నరసరావుపేట రావడానికి పాస్‌పోర్టు కావాలా?: జీవీ ఆంజనేయులు 

నరసరావుపేట రావడానికి టీడీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలకు పాస్‌పోర్టు కావాలా? వీసా కావాలా? అని టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ధ్వజమెత్తారు. బుధవారం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ అనూష అనే విద్యార్థిని హత్యచేస్తే ప్రభుత్వం పట్టించుకోలేదని, ఆ నిందితుడికి శిక్ష పడలేదని అన్నారు. అనూష కుటుంబాన్ని పరామర్శిస్తే వచ్చేనష్టం ఏంటన్నారు. నరసరావుపేటలో గ్రూపలు లేవు, ఒకే గ్రూపు, అదే తెలుగుదేశం పార్టీ గ్రూపు, ఒకే నాయకుడు చంద్రబాబునాయుడు అని స్పష్టం చేశారు.

  

లోకేశ్‌ నరసరావుపేట వచ్చి తీరుతారు.. : అరవిందబాబు

నారా లోకేష్‌ గురువారం నరసరావుపేటకు వచ్చి తీరుతారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు అన్నారు. ఈ నెల 9వ తేదీ అనూష పుట్టిన రోజని, గుంటూరులో రమ్య చనిపోయి 9వ తేదీ నాటికి 21 రోజులు అవుతుందని.. ఈ నేపథ్యంలోనే లోకేశ్‌ వస్తున్నారని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అతిగా స్పందించటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రతిపక్షనాయకుడిగా నారా లోకేశ్‌ వస్తుంటే అసభ్య పదజాలంతో ఎమ్మెల్యే మాట్లాడడం బుద్ధి తక్కువ పని అన్నారు. హత్య జరిగినప్పుడు సకాలంలో స్పందించి ఆరోజు మీరు వచ్చి ఉంటే ఇంకా న్యాయం జరిగి ఉండేదని గుర్తు చేశారు. 

 

బాధిత కుటుంబాన్ని పరామర్శించడం తప్పా..: నక్కా ఆనందబాబు

బాధిత కుటుంబాన్ని లోకేశ్‌ పరామర్శించడం తప్పా అని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. గుంటూరులోని తన కార్యలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ  ప్రజాస్వామ్యంలో ఉన్నామా..? పోలీసు రాజ్యంలో ఉన్నామో అర్ధం కావడం లేదన్నారు. మేం ఏమైనా అరాచక శక్తులమా..? సంఘ విద్రోహులమా...? లేక యుద్ధానికి వెళుతున్నామా..? అంటూ పోలీసులను నిలదీశారు. ప్రతిపక్ష నాయకులుగా బాధితులను పరామర్శించటం మా బాధ్యతన్నారు. వైసీపీ ప్రభుత్వం పెట్టే తప్పుడు కేసులకు భయపడేలేదని స్పష్టం చేశారు.   


పర్యటన సాగేదిలా..

లోకేశ్‌ గురువారం ఉదయం 9గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అనంతరం రోడ్డుమార్గం ద్వారా ఉదయం 11గంటలకు నరసరావుపేటకు వస్తారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి పల్నాడు బస్టాండ్‌ వరకు పాదయాత్ర నిర్వహించి అనంతరం ఉన్మాదిచేతిలో బలైన అనూష కుటుంబాన్ని లోకేశ్‌ పరామర్శించనున్నారని పార్టీనేతలు వెల్లడించారు. అలానే స్థానికంగా ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని పార్టీ నేతలు తెలిపారు.  


ఏడుగురు పార్టీ శ్రేణుల అరెస్టు

లోకేశ్‌ పర్యటన పర్యటనకు వెళ్లకుండా బుధవారం రాత్రి స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్న తెలుగు విద్యార్థి, తెలుగు యువతకు చెందిన ఏడుగురిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డాక్టర్‌ అరవిందబాబును కూడా హౌస్‌ అరెస్టు చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. 


లోకేశ్‌ పర్యటనకు అనుమతి లేదు: గుంటూరు డీఐజీ త్రివిక్రమవర్మ

నరసరావుపేటలో లోకేశ్‌ పర్యటనకు అనుమతి లేదని గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమవర్మ స్పష్టం చేశారు. బుధవారం గుంటూరులోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనూష హత్యకు గురైన గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు. ఈ కేసులో ఈనెల 21 నుంచి ట్రైల్‌ కూడా ప్రారంభం కాబోతుందన్నారు. ఆమె కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుని త్వరలో కేసు విచారణ ప్రారంభం కాబోతున్న తరుణంలో ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు లోకేశ్‌ వస్తుండటం.. కేవలం దానిని రాజకీయం చేయటం కోసమేనని స్పష్టమవుతుందన్నారు. ప్రభుత్వం పకడ్బందీగా రూపొందించిన దిశ చట్టం పార్లమెంటు అనుమతికి వెళ్లిందని, అక్కడ ఆమోదముద్రపడితే చట్ట రూపం దాల్చటం జరుగుతుందన్నారు. అయితే ప్రస్తుతం దిశ చట్టం లేకపోయినప్పటికీ దిశ స్ఫూర్తితో మహిళల భద్రతకు బహుళార్ధకసాధక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. 

 

రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ మాట్లాడుతూ రాజకీయ పక్షాలకు మహిళలపై గౌరవం, అభిమానం ఉంటే పోలీసులకు సహకరించాలేగానీ తమను ఇబ్బంది పెట్టకూడదన్నారు. పాత కేసులను తీసుకువచ్చి రాజకీయం చేయవద్దన్నారు. అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ మాట్లాడుతూ మహిళల భద్రతకు సంబంధించి అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. 

Updated Date - 2021-09-08T05:30:00+05:30 IST