యువతకు లోకేశ్‌ రోల్‌ మోడల్‌: వర్ల

ABN , First Publish Date - 2022-01-24T09:02:22+05:30 IST

మాజీ మంత్రి, టీడీపీ యువనేత నారా లోకేశ్‌ అత్యుత్తమ పోరాట పటిమతో అద్భుత విజయాలు సాధించి, నేటి యువతకు రోల్‌ మోడల్‌గా నిలిచారని టీడీపీ..

యువతకు లోకేశ్‌ రోల్‌ మోడల్‌: వర్ల

‘రథ సారథి’ వీడియో సాంగ్‌ విడుదల..

ఘనంగా లోకేశ్‌ జన్మదిన వేడుకలు

అమరావతి, జనవరి 23(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, టీడీపీ యువనేత నారా లోకేశ్‌ అత్యుత్తమ పోరాట పటిమతో అద్భుత విజయాలు సాధించి, నేటి యువతకు రోల్‌ మోడల్‌గా నిలిచారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య పేర్కొన్నారు. ఆదివారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో లోకేశ్‌ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బర్త్‌డే కేక్‌ను పార్టీ నేతలు కట్‌ చేసి, కార్యాలయ సిబ్బందికి మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. గుంటూరు శ్రీను ఆధ్వర్యంలో లోకేశ్‌ అభిమానులు రూపొందించిన ‘రథ సారథి’ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వర్ల మాట్లాడారు. ‘‘అతిచిన్న వయస్సులో మంత్రిగా ఐటీ, ఎలక్ర్టానిక్స్‌ రంగాల్లో సాధించిన పెట్టుబడులు, యువతకు చూపిన ఉపాధి లోకేశ్‌ సమర్థతకు గీటురాయి. ప్రతి కార్యకర్తకు రూ.2 లక్షల బీమా సౌకర్యం కల్పించి, పార్టీ కేడర్‌కు భరోసా కల్పించారు’’ అని అన్నారు. జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌.. ‘‘70 లక్షల టీడీపీ కార్యకర్తలకు భరోసాగా ఉన్న లోకేశ్‌ ప్రజాసమస్యలపై ఎంతటి పోరాటానికైనా సిద్ధపడే వ్యక్తి. తెలుగు తమ్ముళ్లకు అన్యాయం జరిగితే తట్టుకోలేరు. జగన్‌రెడ్డిని కట్టడి చేయగల దమ్మున్న నాయకుడు’’ అని కొనియాడారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనూ లోకే్‌శ్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.


పలుచోట్ల అన్నదానం, రక్తదానం

లోకేశ్‌ జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్నదాన శిబిరాలను ఆయన అభిమానులు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్‌ స్మారక ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఒక్కో శిబిరంలో 25 నుంచి 157 మంది వరకు రక్తదానం చేశారు. మరోవైపు ట్విటర్‌లో ‘హ్యాపీ బర్త్‌డే లోకేశ్‌’ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌గా మారింది. దేశంలోనే రెండోస్థానంలో, రాజకీయ విభాగంలో నంబర్‌ 1గా ఈ హ్యాష్‌ట్యాగ్‌ నిలిచింది.

Updated Date - 2022-01-24T09:02:22+05:30 IST