నాపై కేసులు పెట్టండి భరిస్తా.. కార్యకర్తల జోలికొస్తే..

ABN , First Publish Date - 2021-04-16T06:58:18+05:30 IST

రాష్ట్రంలో అన్యాయం జరిగిన..

నాపై కేసులు పెట్టండి భరిస్తా.. కార్యకర్తల జోలికొస్తే..
అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని పరామర్శిస్తున్న లోకేశ్‌

కార్యకర్తలకు అండగా ఉంటా

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ హెచ్చరిక

ప్రశ్నించినందుకే టీడీపీ నేత రామకృష్ణారెడ్డిపై తప్పుడు కేసులు

అనపర్తి మాజీ ఎమ్మెల్యేకు పరామర్శ


అనపర్తి(తూర్పు గోదావరి): రాష్ట్రంలో అన్యాయం జరిగిన ప్రతి టీడీపీ కార్యకర్తకు తాను అండగా ఉంటానని, అధైౖర్యపడి వెనుకడుగేసే తత్వం తమ కార్యకర్తల్లో లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. గురువారం అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు రామవరం వచ్చిన ఆయనకు స్వాగతం పలికేందుకు వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ తనపై కేసులు పెట్టినా భరిస్తానని, కానీ తమ కార్యకర్తల జోలికొస్తే ఎవరినీ వదలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. అనపర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినందుకే రామకృష్ణారెడ్డిపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపారని ఆరోపించారు. బిక్కవోలు మండలం కాపవరం గ్రామంలో ఇళ్ల స్థలాల పేరుతో అక్రమంగా మైనింగ్‌ నిర్వహించి సుమారు రూ.400 కోట్లు సంపాదించాలన్న అధికార పార్టీ ఆలోచనలకు రామకృష్ణారెడ్డి అడ్డుతగిలి ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేయడంతో అవినీతి బయట పడిందన్నారు.


అక్రమ మైనింగ్‌ చేసినవారికి మైనింగ్‌ శాఖ సుమారు రూ.1.23 కోట్ల పెనాల్టీ విధించిందని, దీంతో ఏంచేయాలో తోచని స్థితిలో రామకృష్ణారెడ్డి బావ సత్తిరాజురెడ్డి మరణాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు బనాయించారని లోకేశ్‌ అన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి.. యాక్టర్‌ సూర్యనారాయణరెడ్డిగా మారి తనకేమీ తెలియదని చెబుతూ తెర వెనుక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. రామకృష్ణారెడ్డి  బావ సత్తిరాజురెడ్డి గుండెపోటుతో మరణించినట్టు పోస్టుమార్టం ప్రాథమిక రిపోర్టులో వచ్చిందని, అయితే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో రిపోర్టులు మార్పించి అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారన్నారు. సుమారు 15 సంవత్సరాలుగా అటు తల్లిదండ్రులతోగాని, ఇటు భార్యా పిల్లలతోగాని సంబంధం లేకుండా ఉన్న సత్తిరాజు రెడ్డి మరణాన్ని రాజకీయం చేసి అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు.


అదే ఎమ్మెల్యే వల్ల తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని సూసైడ్‌నోట్‌ రాసి అరుణకుమారి అనే గృహిణి మరణిస్తే ఎటువంటి కేసు ఎందుకు నమోదుకాలేదని ప్రశ్నించారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడినవారు పేదలుగా ప్రభుత్వ పథకాలు పొందుతూ లక్షలాది రూపాయల సెస్సు ఎలా కడుతున్నారో తెలియడం లేదని, దీన్ని బట్టే వారు ఎమ్మెల్యేకు బినామీలుగా అర్థమవుతోందన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి నిల్‌, అవినీతి ఫుల్‌ అన్నట్టు ఉందన్నారు. అనపర్తి నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో కోట్లాది రూపాయలు చేతులు మారాయని, ఎందుకూ పనికిరాని భూములను సైతం లక్ష లాది రూపాయలు చెల్లించి కొన్నారని లోకేశ్‌ విమర్శించారు. దీనికి ఉదాహరణగా అచ్యుతాపురం గ్రామంలో పైన హెచ్‌టీ లైను, కింద గ్యాస్‌ పైప్‌లైను ఉన్న భూములను తాను పరిశీలించానన్నారు.


అదేవిధంగా నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు, నాటుసారా తయారీ కేంద్రాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని అన్నారు. ఇక్కడ ప్రతి విషయంలోను దోపిడీ జరుగుతూనే ఉందని, దీనికి బాధ్యులైన ప్రతి ఒక్కరూ జైలుకు వెళ్లే రోజు దగ్గరలోనే ఉందన్నారు. లోకేశ్‌ ప్రసంగిస్తున్నంతసేపు టీడీపీ కార్యకర్తలు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. లోకేశ్‌తో సెల్ఫీలు దిగేందుకు అటు కార్యకర్తలు, ఇటు నాయకులు కూడా పోటీపడ్డారు. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌, ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, తెలుగు మహిళ అధ్యక్షురాలు విజయలక్ష్మి, సిరసపల్లి నాగేశ్వ రరావు, సత్తి దేవదానరెడ్డి. జుత్తిగ సూర్యకుమారి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-16T06:58:18+05:30 IST