ఒక్కో మహిళకు లక్ష నష్టం

ABN , First Publish Date - 2020-08-13T07:48:31+05:30 IST

ఒక్కో మహిళకు లక్ష నష్టం

ఒక్కో మహిళకు లక్ష నష్టం

మాట తప్పి మడమ తిప్పిన జగన్‌

45 ఏళ్ల మహిళలకు పెన్షన్‌ ఇస్తే ఒక్కొక్కరికీ 1.80 లక్షలు వచ్చేవి

ఇప్పుడు 75 వేలే ఇస్తామంటున్నారు

కార్పొరేషన్ల నిధులన్నీ పక్కదారి తెలుగుదేశం పార్టీ ధ్వజం


అమరావతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు ఓట్లు వేయించుకోవడానికి ఒక మాట చెప్పి.. ఇప్పుడు మాట మార్చడం వల్ల బడుగు, మైనారిటీ వర్గాల్లో ఒక్కో మహిళకు రూ.లక్ష చొప్పున నష్టం వాటిల్లుతోందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఆయన మాట, మడమ తిప్పకుండా ఉంటే వీరికి మరో రూ.లక్ష అదనంగా లబ్ధి చేకూరేదని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ. మైనారిటీ వర్గాల మహిళలందరికీ పింఛను ఇస్తానని జగన్‌ ఎన్నికల ముందు కల్లబొల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని.. ఇప్పుడు నిలబెట్టులేకపోయినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. వైసీపీ పాలనలో ఈ వర్గాలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతోంది. సంబంధిత కార్పొరేషన్ల నుంచి ఈ 15 నెలల్లో యువతకు ఒక్క రూపాయి కూడా స్వయం ఉపాధి రుణాలు ఇవ్వలేదు. ఉన్నత చదువుకు సాయం చేయలేదు. కార్పొరేషన్లను నిర్వీర్యం చేసి వాటి నిధులను పక్కదారి పట్టించారు. టీడీపీ హయాంలో ఈ కార్పొరేషన్ల ద్వారా నేను నా ఒక్క నియోజకవర్గంలోనే ఆయా వర్గాల వారికి రూ.175 కోట్లు ఇప్పించగలిగాను. కానీ ఇప్పుడు వారికి పైసా కూడా రాలేదు. ఆయా వర్గాలపై దాడులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. మాజీ ఎంపీలు, న్యాయమూర్తులు, వైద్యుల వంటి ఉన్నత స్ధానాల్లో ఉన్నవారిపైనా దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వంలో కీలకమైన పదవులను జగన్‌ తన వారితో నింపుకొని.. పనికిమాలిన వాటిని ఇతర వర్గాలకు విసురుతున్నారు. ఒక దళిత న్యాయమూర్తిని పట్టుకొని విలేకరుల సమావేశంలో వాడూ... వీడూ అని దూషించిన మంత్రి పెద్దిరెడ్డిపై ఏ చర్యలూ లేవు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డిపై మాత్రం తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపారు. చంద్రబాబు హయాంలో ఈ వర్గాలు తలెత్తుకొని గర్వంగా జీవిస్తే ఇప్పుడు గొంతెత్తే పరిస్ధితి కూడా లేకుండా పోయింది. జగన్‌ను అధికారంలోకి తెచ్చిన ఈ వర్గాలే ఆయనకు బుద్ధి చెప్పడం కూడా ఖాయం’ అని అన్నారు.


పింఛను ఎంతో కూడా సీఎంకు తెలియదా?

రాష్ట్రంలో పేద వర్గాలకు ఇస్తున్న పింఛను ఎంతో కూడా జగన్‌కు తెలియకపోవడం విచిత్రమని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి ఓ ప్రకటనలో ఎద్దేవాచేశారు. ‘చేయూత కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ నెలకు పింఛను రూ. వెయ్యి మాత్రమేనని, దాని ప్రకారం ఏడాదికి రూ.12 వేలు వస్తుంటే తాను ఇప్పుడు రూ.18 వేలు ఇస్తున్నానని ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పుడు పింఛను నెలకు రూ.2,250 ఇస్తున్న విషయం కూడా ఆయనకు  తెలియదా? లేక మర్చిపోయినట్లు నటిస్తున్నారా’ అని ఆక్షేపించారు.


మేం కోటి మందికి ఇస్తే 23 లక్షలకు తగ్గించారు...లోకేశ్‌ ఆగ్రహం

‘ప్రభుత్వం చెబుతున్నట్లుగా అది వైఎస్సార్‌ చేయూత కాదు.. జగన్‌రెడ్డి చేతివాటం. 45 ఏళ్లకు పింఛను ఇస్తే ఏడాదికి రూ.36,000 ఇవ్వాలి. అంటే ఐదేళ్లలో రూ.1.80 లక్షలు ఇవ్వాలి. అందుకే జగన్‌ రివర్స్‌ టెండరింగ్‌ మొదలుపెట్టారు. ఐదేళ్ల పాలనలో ఒక్కో బీసీ, ఎస్సీ,ఎస్టీ మహిళకు కేవలం రూ.75,000 ఇస్తామంటున్నారు. అంటే జగన్‌ చేతివాటం రూ.1.05 లక్షలు’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. తెలుగుదేశం హయాంలో కోటి మందికి పసుపు-కుంకుమ ఇచ్చామని.. వీరేమో లబ్ధిదారులను 23 లక్షలకు తగ్గించి వారిలో విభేదాలు సృష్టిస్తున్నారని విరుచకుపడ్డారు. ‘మిగిలినవారు పేదలు కాదా? చాలామంది పేద మహిళలకు ఆధార్‌లో వయసు తప్పుగా నమోదైంది. వారు నిరక్షరాస్యులు. మార్చుకునే అవకాశమిచ్చి న్యాయం చేయాలి’ అని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-08-13T07:48:31+05:30 IST