నేర రాజకీయాలపై లోక్‌పాల్‌ దర్యాప్తు

ABN , First Publish Date - 2020-11-23T07:06:16+05:30 IST

పెరుగుతున్న నేరరాజకీయాలపై లోక్‌పాల్‌ పర్యవేక్షణలో పూర్తిస్థాయి దర్యా ప్తు జరిపించేట్లు ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో బీజేపీ నేత అశ్వనీకుమార్‌ ఉపాధ్యాయ పిల్‌ దాఖలు చేశారు...

నేర రాజకీయాలపై లోక్‌పాల్‌ దర్యాప్తు

  • విచారణ కోసం లోక్‌పాల్‌కు అధికారాలు కల్పించాలి
  • సుప్రీంలో పిల్‌

న్యూఢిల్లీ, నవంబరు 22: పెరుగుతున్న నేరరాజకీయాలపై లోక్‌పాల్‌ పర్యవేక్షణలో పూర్తిస్థాయి దర్యా ప్తు జరిపించేట్లు ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో బీజేపీ నేత అశ్వనీకుమార్‌ ఉపాధ్యాయ పిల్‌ దాఖలు చేశారు. ‘ఎన్‌ఐఏ, సీబీఐ, ఈడీ, సీబీడీటీ, ఎస్‌ఎఫ్‌ఐవో, రా, ఐబీ, ఎన్‌సీబీల దర్యాప్తును లోక్‌పాల్‌ పర్యవేక్షించాలి. ఈ దర్యాప్తు సంస్థలు బయటపెట్టిన నేరాల వివరాల ఆధారంగా కేసులు పెట్టాలి. నేర రాజకీయులు, నేరగాళ్లతో సంబంధాలు నెరుపుతున్న బ్యూరోక్రాట్లను విచారించేందుకు లోక్‌పాల్‌కు విస్తృతాధికారాలు కల్పించాలి. వారిపై విచారణ నిమిత్తం ప్రత్యేక కోర్టులను నెలకొల్పాలి’ అని పిల్‌లో కోరారు. నేరగాళ్లు-రాజకీయవేత్తలు-బ్యూరోకాట్ర్లు కుమ్మక్కై దేశంలో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారని 1993లో అధ్యయనం చేసిన నాటి హోం శాఖ కార్యదర్శి ఎన్‌ఎన్‌ వోహ్రా కమిటీ తేల్చింది. 27 ఏళ్లుగా ఆ కమిటీ సిఫారసులను ప్రభుత్వాలు పక్కన పెట్టాయని, ఇకనైనా అమలు జరపాలని పిటిషనర్‌ అభ్యర్థించారు. మాఫియా, స్మగ్లర్లు, మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నవారు రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు, ప్రభుత్వోద్యోగులు, చట్టసభల సభ్యులు, కీలక పదవుల్లో ఉన్నవారితో సంబంధాలు పెట్టుకుని ప్రజాధనాన్ని దోచుకుంటున్నట్లు జస్టిస్‌ జేఎస్‌ వర్మ కమిటీ కూడా పేర్కొందన్నారు. 


Updated Date - 2020-11-23T07:06:16+05:30 IST