బహుదూరపు బడి

ABN , First Publish Date - 2021-06-12T06:12:45+05:30 IST

నూతన విద్యావిధానం పట్ల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమౌ తోంది. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయడం, మూడో తరగతి నుంచి ప్రాథమిక పాఠశాల విద్యార్థులను ఉన్నత పాఠశాలలకు పంపడం వంటి నిర్ణయాలను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది.

బహుదూరపు బడి

  1. పీపీ స్కూళ్లలో అంగన్‌వాడీల విలీనం
  2. 3వ తరగతి నుంచి మరో పాఠశాలకు..
  3. దూరంగా పంపేందుకు ఇష్టపడని తల్లిదండ్రులు
  4. గ్రామీణ విద్యార్థుల డ్రాపౌట్స్‌ పెరిగే ప్రమాదం
  5. విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల ఆందోళన


గడివేముల/ఆలూరు, జూన్‌ 11: నూతన విద్యావిధానం పట్ల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమౌ తోంది. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయడం, మూడో తరగతి నుంచి ప్రాథమిక పాఠశాల విద్యార్థులను ఉన్నత పాఠశాలలకు పంపడం వంటి నిర్ణయాలను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. దీంతో ఇంటికి సమీపంలో ఉండే ప్రాథమిక విద్య దూరమౌ తుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నూతన విద్యావిధానం ప్రకారం ఎల్‌కేజీ నుంచి 2వ తరగతి వరకు ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఉంటాయి. వీటిలోకి అంగన్‌వాడీ సెంటర్లను విలీనం చేస్తారు. 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకూ ప్రాథమిక విద్య ఉంటుంది. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు ప్రాథ మికోన్నత పాఠశాలలు, 9 నుంచి 12వ తరగతి వరకూ ఉన్నత పాఠశాలలు నిర్వహిస్తారు. నూతన విద్యావి ధానంతో కింది స్థాయిలో అంగన్‌వాడీ కేంద్రాలు, పై స్థాయిలో జూనియర్‌ కళాశాల వ్యవస్థ ఇకపై కనిపించదు. 


చిన్నారులకు సమస్య

నూతన విద్యావిధానం కారణంగా ఇంటికి సమీపంలో ఉండే అంగన్‌వాడీ కేంద్రాలు ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో విలీనం అవుతాయి. దీంతో పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ 3వ తరగతి నుంచి బడి దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మాత్రమే పాఠశాల విద్య అందుబాటులో ఉంది. ఆరో తరగతి నుంచి సమీపంలోని పట్టణాలకు పంపుతున్నారు. కానీ ఇకపై 3వ తరగతి చిన్నారులను కూడా అలా దూరంగా పంపాల్సి వస్తుందని, ఇది తీవ్ర ఇబ్బంది కలిగిస్తుందని ఉపాధ్యాయ సంఘాలు కూడా అంటున్నాయి. ఈ విధానం అమలులోకి వస్తే 3వ తరగతి చదివేందుకు 5 నుంచి 10 కి.మీ. దూరం వెళ్లాల్సి ఉంటుందని, డ్రాపౌట్స్‌ పెరిగే ప్రమా దం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నూతన విద్యా విధానం అమలుకు ప్రభుత్వం ఇప్పటికే సర్క్యులర్‌ జారీ చేసింది. క్షేత్రస్థాయిలో అంగన్‌వాడీ విద్యను ప్రాథమిక పాఠశాలలో విలీనం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. 


చాలా దూరం వెళ్లాలి..

గడివేముల మండలంలో నాలుగు ఉన్నత పాఠశాలలు మాత్రమే ఉన్నాయి. నూతన విద్యావిధానం అమలులోకి వస్తే.. ఒండుట్ల, పైబోగుల, ఎల్‌కే తండా విద్యార్థులు సుమారు 7 కి.మీ.దూరంలో ఉన్న మంచాలకట్ట ప్రాథమికోన్నత పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది. ఆళ్లగడ్డ గ్రామ విద్యార్థులు 3 కి.మీ. నడుచు కుంటూ గడివేముల ప్రాథమికోన్నత పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఆళ్లగడ్డ నుంచి గడివేములకు ప్రైవేటు, ఆర్టీసీ బస్సులు లేవు. ఆరో తరగతి, ఆపై తరగతుల విద్యార్థులు ఎలాగోలా వెళ్లి వస్తున్నారు. ఇకపై మూడో తరగతి నుంచి నడవాలంటే చిన్నారులకు కష్టంగా ఉంటుంది. ఇది చిన్నారుల శారీరక, మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నూతన విద్యావిధానాన్ని రాష్ట్రమంతటా కాకుండా పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రతి జిల్లాలోనూ ఒక మండలంలో అమలు చేసి పరీక్షించాలని, లోటుపాట్లను సరిదిద్దుకుని పూర్తిస్థాయిలో అమలు చేస్తే బాగుంటుందని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. 


విరమించుకోవాలి..


నూతన విద్యావిధానంతో ప్రాథమిక స్థాయి పాఠశాలల్లో తరగతుల విభజనను విరమించుకోవాలి. 3, 4, 5 తరగతులను సమీప ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలకు తరలించడాన్ని వ్యతిరేకిస్తున్నాం. విద్యా హక్కు చట్టం ప్రకారం కి.మీ. దూరంలోనే ప్రాథమిక విద్య ఉండాలి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించ కూడదు. ఉన్నత పాఠశాలలో రెండు మీడియంలను కొనసాగించాలి. 

    - నాగరాజు, ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిలర్‌


ఉన్నత పాఠశాల ఏర్పాటు చేస్తాం..


నూతన విద్యావిధానంపై క్షేత్రస్థాయిలో మ్యాపింగ్‌ చేస్తున్నాం. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తక్కువ దూరంలోనే ఉన్నత పాఠశాలలను ఏర్పాటు చేస్తాం.

- బ్రహ్మం, ఎంఈవో, గడివేముల


ఏకపక్ష నిర్ణయం తగదు..


నూతన విద్యావిధానం అమలుపై ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయం తగదు. మండల కేంద్రంతో పాటు అత్యధిక విద్యార్థులు ఉండే ఉన్నత పాఠశాలలో తప్పనిసరిగా ప్లస్‌ 2 తరగతులు ప్రారంభించాలి. ఖాళీగా ఉన్న 26 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి. ప్రాథమిక పాఠశాలకు పీఎస్‌ హెచ్‌ఎం పోస్టును మంజూరు చేయాలి. ఏ ఒక్క పాఠశాలనూ మూసివేయకూడదు. విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. నూతనంగా ప్రవేశపెట్టదలచిన వైస్సార్‌ ప్రీ ప్రైమరీ పాఠశాలలను, ప్లస్‌ 2 తరగతులను స్వాగతిస్తున్నాం. 

- కరె కృష్ణ, డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు


అంత దూరం ఎలా..?


మా పాప మనస్వి ఆళ్లగడ్డ ప్రాథమిక పాఠశాలలో 2వ తరగతి పూర్తి చేసుకుంది. ప్రభుత్వం నూతన విద్యావిధానాన్ని అమలు చేస్తే 3 కి.మీ. దూరంలో ఉన్న గడివేముల ఉన్నత పాఠశాలకు పంపించాల్సి వస్తుంది. మా గ్రామానికి బస్సు సౌకర్యం లేదు. చిన్నారిని అంతదూరం ఎలా పంపించాలి..? ప్రభుత్వం పాత విధానాన్నే అమలు చేయాలి. 


- శారద, విద్యార్థిని తల్లి, ఆళ్లగడ్డ


డ్రాపౌట్స్‌ పెరిగే ప్రమాదం..


నూతన విద్యావిధానం వల్ల డ్రాపౌట్స్‌ పెరిగే ప్రమాదం ఉంది. గ్రామీణ విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇబ్బంది పడతారు. చిన్న వయసులో పిల్లలనే దూరంగా ఉండే పాఠశాలలకు పంపించడానికి తల్లిదండ్రులు ఇష్టపడక పోవచ్చు. దీనివల్ల డ్రాపౌట్స్‌ పెరిగి పేదవారికి చదువు దూరం అవుతుంది. ప్రభుత్వం నూతన విద్యావిధానాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా ఒక జిల్లాలో అమలు చేసి, ఉత్తమ ఫలితాలు వస్తే రాష్ట్ర మంతటా అమలు చేస్తే బాగుంటుంది. 


- సతీష్‌ కుమార్‌, వ్యవస్థాపక జిల్లా అధ్యక్షుడు, బహుజన టీచర్స్‌ ఫెడరేషన్‌


Updated Date - 2021-06-12T06:12:45+05:30 IST