దీర్ఘ రాత్రి

ABN , First Publish Date - 2021-07-05T05:38:52+05:30 IST

ఎవడో కత్తికి కాటుక పూసి పగటిని ముక్కలు చేసాడు ఆకాశమంత గోడను ఎక్కి అవి అటు దుంకీ ఇటు దుంకీ...

దీర్ఘ రాత్రి

ఎవడో కత్తికి కాటుక పూసి

పగటిని ముక్కలు చేసాడు

ఆకాశమంత గోడను ఎక్కి

అవి అటు దుంకీ ఇటు దుంకీ

అవని అంతా పరుచుకున్నాయి

తెల్లవారడం నేడు సులభం కాదు

కోటాను కోట్ల రెప్పల్ని మూసి

తాండవం చేస్తుంది

కాళింది పడగలపై చిన్ని కృష్ణుడు ఆడినట్టు

ఈ రాత్రి బాగా బలిసిన రాత్రి

పలుచబడడానికి ఎన్ని

పొద్దులు బలి కావాలో

గుదిబండలా ఇది సమూహములోకి

చొచ్చుకొని వచ్చింది.

ఏక రాత్రి కాదు అనేక రాత్రి

మిళుకు మిళుకు మంటున్న

నక్షత్రాలను నెలరాలుస్తూ

ఇంకా విరగబడి నవ్వుతుంది

కాలం పొద్దు వాలితే

నిద్ర లేచిందా ఈ రాత్రి

కాదు కాదు కాలాన్ని

పొడిచి పొడిచి గాయం చేస్తే

కనుగుడ్ల సొన లోంచి కారింది

ఈ నల్లని రాత్రి

గుండెల్ని పిండేస్తూ

రోదనగా వేదన గుమ్మరిస్తున్న ఈ రాత్రి

ఎన్ని పసిమొగ్గలను ఒంటరి చేసి

చెట్లను కూల్చిందో

గాలి కూడా నలుపెక్కింది

గొంతులో గరళం చిమ్ముతుంది

ఇప్పుడు శ్వాసకు నిశ్వాసకు మధ్య

ఊపిరి బిగపట్టి ఉంది

ఈ రాత్రిని తగల బెట్టాలి

కొత్త కాగడాను వెలిగించాలి

లోకం కంటిలో సరికొత్త రేఖల్ని పూయించాలి

ముదిగొండ సంతోష్‌

79813 52713


Updated Date - 2021-07-05T05:38:52+05:30 IST