అమరావతిని చంపేస్తున్నారు

ABN , First Publish Date - 2020-03-26T08:51:21+05:30 IST

‘సీఎం జగన్‌ తన దీర్ఘకాలిక రాజకీయ వ్యూహంలో భాగంగానే అమరావతిని చంపేయాలని కుట్రలు చేస్తున్నారు. వందరోజుల ...

అమరావతిని చంపేస్తున్నారు

ఇది సీఎం దీర్ఘకాలిక రాజకీయ వ్యూహం

ఈ కుట్రకు సూత్రధారి, పాత్రధారి జగనే 

వంద రోజుల పోరులో మహిళలే కీలకం 

రాష్ట్ర రాజధానిపై బీజేపీది ద్వంద్వ వైఖరి 

జేఏసీలో కీలక స్థానాల్లో జగన్‌ కోవర్టులు 

విశాఖలో సెంటు భూమి తీసుకోలేకపోయారు 

‘ఆంధ్రజ్యోతి’తో జేఏసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌ 


గుంటూరు, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ‘సీఎం జగన్‌ తన దీర్ఘకాలిక రాజకీయ వ్యూహంలో భాగంగానే అమరావతిని చంపేయాలని కుట్రలు చేస్తున్నారు. వందరోజుల పోరులో అమరావతి అందరిదీ అని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాం’ అని ఏపీ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు, అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ అధికార ప్రతినిధి కె.శ్రీనివాసరావు అన్నారు. వందరోజుల ఉద్యమం, భవిష్యత్‌ కార్యాచరణపై ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. 


ఢిల్లీలో అపోహలు సృష్టించిన వైసీపీ

రాజధాని అమరావతిపై సీఎం, వైసీపీ నేతలు ఢిల్లీలో లేనిపోని అపోహలు సృష్టించారు. అక్కడ ఉన్నదంతా కమ్మ సామాజికవర్గమని, రాజధానితో ఆ వర్గానికి మాత్రమే ప్రయోజనమని ప్రచారం చేశారు. జేఏసీ ప్రతినిధుల బృందం ఢిల్లీ పర్యటనలో ఈ విషయం బహిర్గతమైంది. అమరావతి కుట్రలో వందశాతం సూత్రధారి, పాత్రధారి జగనే. సీఆర్‌డీఏ పరిధిలోని 34 నియోజకవర్గాల్లో కమ్మ సామాజివర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నావారు కేవలం ఆరుగురు మాత్రమే. తాడికొండ నియోజకవర్గం 1998నుంచి ఎస్సీ రిజర్వుడ్‌. రాజధాని 29 గ్రామాల్లో 40శాతం ఎస్సీ, ఎస్టీలు ఉన్నారని చెప్పడంతో ఢిల్లీ నేతలు ఆశ్చర్యపోయారు. 


అనేక విజయాలు సాధించాం 

ఉద్యమం ప్రారంభమై గురువారానికి వంద రోజులకు చేరుతోంది. ఈ ప్రయాణంలో అనేక విజయాలు సాధించాం. అమరావతి అందరి రాజధాని అని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగాం. విశాఖలో రాజధాని అవసరాల కోసం జగన్‌ సెంటు భూమి కూడా తీసుకోలేకపోయారు. దానికి రాజధాని పోరే కారణం. అమరావతిపై న్యాయస్థానాల్లో ప్రతి తీర్పు రైతులకు అనుకూలంగానే వచ్చింది. దీనంతటి వెనుక రాజధాని మహిళల కృషి ఎంతో ఉంది. వారివెంట పురుషులు నడుస్తుంటే, జేఏసీ సమన్వయం చేస్తోంది. 


కరోనాతో ఉద్యమం ఉధృతం 

బాధత్య గల పౌరులుగా రైతులు ప్రధాని సూచనలు పాటిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఉద్యమానికి కరోనా మరింత ఊపునిచ్చింది. అంతకుముందు నాలుగైదు గ్రామాల రైతులు, ప్రజలు ఒక శిబిరం వద్దకు వచ్చి దీక్ష కొనసాగించేవారు. ఇప్పుడు ఎవరి ఇంటిముందు వారు కూర్చొంటున్నారు. దీంతో ఉద్యమ తీవ్రత బయట ప్రపంచానికి కూడా తెలుస్తోంది. రైతుల్లో పట్టుదలను పెంచిన కరోనా... అమరావతిని ఇంటింటికీ చేర్చింది. ఇకనుంచి ప్రజాపోరాటం, న్యాయపోరాటం సమాంతరంగా కొనసాగిస్తాం. 


అమరావతితోనే అభివృద్ధి

రాజధాని అమరావతితోనే రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సాధ్యం. స్థానిక ఎన్నికలు వాయిదా పడిన వెంటనే సీఎం జగన్‌ మీడియా ముందుకొచ్చి రూ.5వేల కోట్ల గ్రాంటు ఆగిపోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. అమరావతి అగిపోతే దానికి 30- 40రెట్లు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే అక్కడ రూ.10వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన భవనాలు 70, 80, 90శాతం పూర్తయ్యాయి. రూ.30వేల కోట్ల పనులు ఆగిపోయాయి. 5వేల మందికిపైగా పేదల కోసం ఇళ్ల నిర్మాణం పూర్తయింది. చిన్నచిన్న మౌలిక వసతులు కల్పిస్తే వాటిని వాడకంలోకి తీసుకురావచ్చు. ఇలా ఎన్నో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. వీటిని చూసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావట్లేదు. రాష్ట్రానికి జగన్‌ తీరని చేటు చేస్తున్నారు. 


జేఏసీలో కోవర్టులు 

అమరావతి జేఏసీలో సీఎం జగన్‌ కోవర్టులున్నారు. ఆయనపై ఈగ వాలినా తట్టుకోలేనివారు జేఏసీలో కీలక బాధ్యతలు వహిస్తున్నారు. ఇలాంటివారు క్షేత్రస్థాయి పోరులో ఎక్కడా కనిపించరు. కేవలం మీడియా సమావేశాల్లో మాత్రమే ఉంటారు. వారిపై ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా లేదు. వారికి జనం కావాలో... జగన్‌ కావోలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. రైతులు అమాయకంగా జేఏసీపై ఆధారపడటం సరికాదనిపిస్తోంది. జేఏసీ సరిగ్గా పనిచేసి ఉంటే ఉద్యమం ఇప్పటికే రెండోదశకు చేరేది. 


  చంద్రబాబుకు లాభం కలుగుతుందని... 

రాజధాని అమరావతికి అనుకూలంగా రాష్ట్ర బీజేపీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. కానీ ఆ స్థాయిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. వారి ప్రధాన లక్ష్యం చంద్రబాబును దెబ్బతీయడమే అన్నట్లుగా ఉంది. అమరావతి అభివృద్ధి చెందితే చంద్రబాబుకు, టీడీపీకి లాభం చేకురుతుందన్న ఆలోచనలో ఉన్నారు. దీంతో రాష్ట్రానికి, అమరావతికి తీవ్రంగా నష్టం వాటిల్లుతోంది. బీజేపీ ఎంపీ జీవీఎల్‌... జగన్‌ ఏజెంట్‌గా పని చేస్తున్నారు. జగన్‌కు ప్రతికూలంగా ఏం జరిగినా 2గంటల్లోనే మీడియా ముందుకొస్తున్నారు. అమరావతికి మద్దతిస్తున్న కాం గ్రెస్‌, వామపక్షాలు జాతీయ స్థాయిలో బలహీనంగా ఉన్నాయి. 


  భవిష్యత్‌ కార్యాచరణ 

అమరావతి ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, ఆమ్‌ఆద్మీ ఇలా అన్ని రాజకీయ పక్షాల నాయకులు సంఘీభావం తెలుపుతున్నారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత రెండోదశ ఉద్యమంలో భాగంగా సీఎం జగన్‌ సహా ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి వంటి కార్యక్రమాలు చేపడతాం. ప్రభుత్వంపై పూర్తిస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి అమరావతే ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు పోరాటం కొనసాగిస్తాం. 

Updated Date - 2020-03-26T08:51:21+05:30 IST