విద్యుత్‌ ఆదాపై నజర్‌

ABN , First Publish Date - 2021-07-30T05:51:46+05:30 IST

విద్యుత్‌ ఆదాపై జిల్లా యంత్రాంగం దృష్టిసారించింది. గ్రామాల్లో వీఽధిలైట్లు 24 గంటలపాటు వెలగడంతో కరెంటు బిల్లులు అధికంగా వస్తున్నాయి.

విద్యుత్‌ ఆదాపై నజర్‌
వాసాలమర్రిలో ఆటోమెటిక్‌ స్విచ్‌ను ప్రారంభిస్తున్న కలెక్టర్‌ పమేలా సత్పతి

సూర్యాస్తమయంకాగానే వెలిగేలా ఆటోమెటిక్‌ స్విచ్‌లు

వాసాలమర్రిలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు 

యాదాద్రి, జూలై29 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ ఆదాపై జిల్లా యంత్రాంగం దృష్టిసారించింది. గ్రామాల్లో వీఽధిలైట్లు 24 గంటలపాటు వెలగడంతో కరెంటు బిల్లులు అధికంగా వస్తున్నాయి. ప్రతీనెల బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతోంది. అదేవిధంగా వీధిదీపాలు పగలు వెలుగుతుండడంతో విద్యుత్‌ కూడా వృథా అవుతోంది. ఈ నేపథ్యంలో కరెంటు ఆదా చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. గ్రామాల్లో వీధిలైట్లు ఒకసారి ఆన్‌చేస్తే, అవి కాలిపోయే వరకు వెలుగుతూనే ఉంటాయి. 24 గంటలు లైట్లు వెలుగుతుండడంతో వాటి లైఫ్‌టైం తగ్గిపోతోంది. వీధి దీపాలు రాత్రులు మాత్రమే వెలిగి, తెల్లారగానే ఆరిపోయే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో మొట్టమొదట ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తత తీసుకున్న వాసాలమర్రిలో ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్నారు. ముఖ్యమంత్రి సందర్శించిన అనంతరం గ్రామాభివృద్ధి కోసం కమిటీలు వేయడంతోపాటు చేపట్టనున్న అభివృద్ధి పనులపై అధికారులు పూర్తి నివేదికలు రూపొందించారు. పారిశుధ్యం, హరితహారం, వైద్యం, విద్య, తదితర అంశాలపై వారానికోసారి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. గ్రామంలో విద్యుత్‌ ఆదాపై దృష్టి కేంద్రీకరించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ముప్పారపు రాజు అనే రూరల్‌ ఇన్నోవేటర్‌ లైట్‌ డిపెండెంట్‌ రెసిస్టర్‌ సహాయంతో పగలు సూర్యరశ్మిని గుర్తించి ఆటోమెటిక్‌గా వీధిలైట్లు ఆన్‌, ఆఫ్‌ అయ్యే డిజైన్‌ను తయారుచేశారు. సాయంత్రం సూర్యుడు అస్తమించాక మాత్రమే లైట్లు వెలిగేలా డిజైన్‌చేశారు. ఈ డిజైన్‌కు న్యాచురల్‌ స్ర్టీట్‌ లైట్‌ స్విచ్‌ అని పేరు పెట్టారు. వరంగల్‌తోపాటు పలు జిల్లాల్లోని పలు పంచాయతీల్లో ఆటోమెటిక్‌ స్విచ్‌ను వాడుతున్నారు. అన్ని పంచాయతీల్లోనూ దాదాపు 30శాతం వరకు కరెంటు ఆదా అవుతోంది. దీంతో సీఎం దత్తత తీసుకున్న వాసాలమర్రిలోనూ పలు విద్యుత్‌ స్థంభాలకు ఆటోమేటిక్‌ స్విచ్‌ను అమర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వాసాలమర్రి గ్రామపంచాయతీలో 200 వరకు వీధిదీపాలు ఉన్నాయి. వీధి దీపాలకు ఈ స్విచ్‌ల ఏర్పాటును ఈ నెల 27వ తేదీన కలెక్టర్‌ పమేలాసత్పథి ప్రారంభించగా, 20కి పైగా కనెక్షన్లు ఒక విద్యుత్‌ మీటర్‌కు అమర్చారు. వీటికి ఎనిమిది ఆటోమెటిక్‌ స్విచ్‌లను ఏర్పాటుచేశారు. ఒక్కో స్విచ్‌ ధర రూ.3000 వరకు ఉంటుంది. ఈ స్విచ్‌ను అమర్చడంతో దాదాపు 30 శాతానికిపైగా కరెంటు ఆదా అయ్యే అవకాశం ఉంది. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని ఆటోమెటిక్‌ స్విచ్‌ల తయారీపై యువతకు శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. శిక్షణలో భాగంగా యువత తయారు చేసిన వాటిని జిల్లావ్యాప్తంగా వీధి దీపాలకు అమర్చుతారు. 


వృత్తి విద్యాకోర్సుల్లో గ్రామస్థులకు శిక్షణ

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గ్రామంలో సర్వే నిర్వహించారు. గ్రామంలో ఎంతమంది అక్షరాస్యులు ఉన్నారు? ఏయే కోర్సుల్లో చదువుకుంటున్నారు? యువతకు స్థానికంగా ఎలాంటి కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలన్న దానిపై జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ప్రధానంగా ఐదు రంగాల్లో జీవనోపాధికి ఉపయోగపడే కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. మహిళల కోసం డిజైన్‌ (అల్లికలు, మగ్గం) టైలరింగ్‌ కోర్సులో, యువతకు మొబైల్‌ రిపేరింగ్‌, బ్యూటీషన్‌, కంప్యూటర్‌లో డీటీపీ, ఎంఎస్‌ ఆఫీసు, తదితర కోర్సుల్లో శిక్షణను ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కోర్సులు బోధించేందుకు ఉపాధ్యాయులు, సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.  



Updated Date - 2021-07-30T05:51:46+05:30 IST