‘పోలవరం’తో ముంపు లేకుండా చూడండి: ఎన్జీటీ

ABN , First Publish Date - 2020-09-19T07:01:28+05:30 IST

పోలవరం ప్రాజెక్టు ఎగువ రాష్ట్రాలైన తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్‌, ఒడిసా ప్రభుత్వాలు లేవనెత్తుతున్న అంశాలు,

‘పోలవరం’తో ముంపు లేకుండా చూడండి: ఎన్జీటీ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు ఎగువ రాష్ట్రాలైన తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్‌, ఒడిసా ప్రభుత్వాలు లేవనెత్తుతున్న అంశాలు, అభ్యంతరాలను పరిశీలించాలని, ఆయా రాష్ట్రాల్లో ముంపు జరగకుండా తగిన నివారణ, రక్షణ చర్యలు తీసుకోవాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశించింది. సందేహాల నివృత్తికి ఈ మూడు రాష్ట్రాలతో పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్ర జల సంఘం, గోదావరి జలవివాదాల ట్రైబ్యునల్‌, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా రెండు నెలల్లోగా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది.


పోలవరం ప్రాజెక్టు ఎగువ రాష్ట్రాల్లో ముంపు ప్రభావం, ఏపీలో నిర్వాసితులకు సంబంధించి ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీ సిఫారసులను ధర్మాసనం ఆమోదించింది. తెలంగాణలో ముంపుపై బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, ఏపీలో ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లింపుపై సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై శుక్రవారం ఎన్జీటీ చైర్మన్‌ జస్టిస్‌ ఏకే గోయల్‌, న్యాయ సభ్యుడు జస్టిస్‌ ఎస్పీ వాంగ్డీ, సభ్య నిపుణుడు డాక్టర్‌ నాగిన్‌ నందాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ ముగించింది. 


చత్తీ్‌సగఢ్‌, ఒడిసాలలో నిర్వాసితులకు సంబంధించి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చించి వారికి పునరావాసం కల్పించడమా? లేక ముంపు జరగకుండా కరకట్టను నిర్మించడమా? అన్నది నిర్ణయించాలని స్పష్టం చేసింది. తెలంగాణలో ముంపునకు సంబంధించి కేసును సుప్రీం కోర్టుకు బదిలీ చేయాలని సంయుక్త కమిటీ చేసిన సూచనను తోసిపుచ్చింది.



Updated Date - 2020-09-19T07:01:28+05:30 IST