దళితులకు భూపంపిణీపై అడుగంటుతున్న ఆశలు

ABN , First Publish Date - 2021-07-30T05:17:12+05:30 IST

రాష్ట్రంలోని దళితుల కుటుంబాలకు మూడు ఎకరాల భూమి పంపి ణీ పథకంపై ఆయా వర్గాల్లో ఆశలు అడుగంటుతున్నాయి.

దళితులకు భూపంపిణీపై అడుగంటుతున్న ఆశలు

- పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోని పథకం

- జిల్లాలో ఇప్పటివరకు 75 కుటుంబాలకు భూమి పంపిణీ

- ‘దళితు బంధు’ను జిల్లాలో అమలుచేయాలని డిమాండ్‌

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

రాష్ట్రంలోని దళితుల కుటుంబాలకు మూడు ఎకరాల భూమి పంపి ణీ పథకంపై ఆయా వర్గాల్లో ఆశలు అడుగంటుతున్నాయి. ‘మా ప్రభు త్వం అధికారంలోకి వస్తే దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తా.. దళితులకు మూడు ఎకరాల భూమిని ఇస్తా..’ అన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ పూర్తిస్థాయిలో ఆచరణకు నోచుకోవడం లేదు. ఏడేళ్ల పాలనలో జిల్లాలో 4 కోట్ల 32 లక్షల 96 వేల రూపాయలు వెచ్చించి 75 కుటుం బాలకు 178.15 ఎకరాల భూమిని మాత్రమే ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇప్పుడుకొత్తగా దళిత బంధు పథకాన్ని తీసుకవస్తుండడంతో దళితులకు మూడు ఎకరాల భూమి పథకం అటకెక్కినట్లేనన్న విమర్శ లు వ్యక్తం అవుతున్నాయి. 

కొన్ని కుటుంబాలకే లబ్ధి..

తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత తొలిసారిగా టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సమయంలో దళితుడ్ని ముఖ్యమంత్రి చేస్తా, దళితులకు 3 ఎకరాల భూమిని ఇస్తానని కేసీఆర్‌ చేసిన వాగ్దానాలు ఇప్పటికీ నెరవేరలేదు. గద్దెనెక్కిన తొలి ఏడాదే సీఎం కేసీఆర్‌ ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ‘భూమి లేని నిరుపేద దళిత వ్యవసాయ ఆధారిత కుటుంబాలు’ పేరిట 3 ఎకరాల పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద సాగుకు యోగ్యమైన వ్యవసాయ భూములతో పాటు అవసరాన్ని బట్టి ప్రైవేట్‌గా భూములను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎకరానికి గరిష్టంగా 7 లక్షల రూపాయలకు మించకుండా నిర్ధేశించింది. ఆ మేరకు ఇప్పటివరకు 2014-15, 2015-16, 2018-19 ఆర్థిక సంవత్సరాల్లో జిల్లాలో ధర్మారం మండలం ఖానంపల్లి, అంతర్గాం మండలం అకెనపల్లి, ఓదెల మండలం ఓదెల, మంథని మండలం ఉప్పట్ల, కాల్వశ్రీరాంపూర్‌ మండలం చిన్నరాతుపల్లి, పెదరాతుపల్లి, తారుపల్లి, రామగిరి మండలం బేగంపేట గ్రామాల్లో మొత్తం 75 దళిత కుటుంబాలకు 178.15 ఎకరాల భూములను పంపిణీ చేశారు. ఇందుకోసం 4 కోట్ల 32లక్షల 96 వేల రూపాయలను ప్రభుత్వం వెచ్చించింది. ఒక్క ధర్మారం మండలం ఖానంపల్లి గ్రామంలోనే ప్రభుత్వ భూములను పంపిణీ చేశారు. 

దళితుల్లో తీవ్ర నిరాశ..

జిల్లా ఏర్పడ్డ తర్వాత 2016-17, 2017-18లో ఆ తర్వాత 2019-20 నుంచి ఇప్పటివరకు ఒక్క గుంట భూమి కూడా ప్రభుత్వం దళితులకు భూ పంపిణీ చేసింది లేదు. ఈ పథ కంపై ఎన్నో ఆశలు పెంచుకున్న దళితులు తీవ్ర నిరాశ, నిస్పృ హలకు గురవుతున్నారు. వారిలో నెలకొన్న నిరాశ, నిస్పృహ లను తొలగించేందుకు ప్రభుత్వం తాజాగా దళిత బంధు పథకాన్ని తీసుకవస్తున్నది. దళిత బంధు ద్వారా నిరుపేద కుటుంబాలకు 10 లక్షల రూపాయల నగదు ఇస్తామని ప్రక టించారు. ఈ డబ్బుతో ఏదేని ఉపాధి పొందేందుకు ఉపయో గించుకునేలా విధివిధానాలను ఖారారు చేస్తున్నది. ఈ పథకాన్ని మొదట ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాలకు వర్తింప జేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. త్వరలో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ప్రయోగాత్మకంగా ఆ నియోజకవర్గం నుంచే ప్రారంభిస్తామని, ఆ నియోజకవర్గంలో ఉన్న 21వేల నిరుపేద కుటుంబాలకు దళితబంధు కింద రూ.10లక్షల చొప్పున ఇస్తామని సీఎం ప్రకటించడంతో అంతా షాక్‌కు గురయ్యారు. దీంతో ఒక్క హుజూరాబాద్‌లోనే కాకుండా అన్ని జిల్లాల్లో దళిత బంధు పథకాన్ని వర్తింపజేయాలనే డిమాండ్‌ వస్తున్నది. పెద్దపల్లి జిల్లాలో కూడా ఆ పథకాన్ని వర్తింపజేయాలని దళిత హక్కుల పోరాట సమితి నాయ కులు జిల్లా అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. కొత్త పథకాన్ని ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందో కానీ, దళితులకు మూడు ఎకరాల భూమి పథకం అటకెక్కినట్లేనని తెలుస్తున్నది. 

Updated Date - 2021-07-30T05:17:12+05:30 IST