శ్రీరాముడు నేపాలీ

ABN , First Publish Date - 2020-07-14T07:06:43+05:30 IST

మా సాంస్కృతిక నిజాలను కప్పిపెట్టారు. భారతీయ రాజు రాముడికి సీతను ఇచ్చి పెళ్లి చేశామని మనం భావిస్తున్నాం. కానీ, అయోధ్యకు చెందిన శ్రీరాముడికి మనం సీతను...

శ్రీరాముడు నేపాలీ

భారత్ వ్యతిరేక చర్యలతో వివాదాస్పదమవుతున్న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ తాజాగా హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘శ్రీరాముడు నేపాలీ’ అంటూ తీవ్ర దుమారం లేపారు. ‘‘మా సాంస్కృతిక నిజాలను కప్పిపెట్టారు. భారతీయ రాజు రాముడికి సీతను ఇచ్చి పెళ్లి చేశామని మనం భావిస్తున్నాం. కానీ, అయోధ్యకు చెందిన శ్రీరాముడికి సీతను ఇచ్చాం. నిజమైన అయోధ్య నేపాల్‌లో ఉంది. అది నేపాల్‌లోని బిర్గుంజ్‌ దగ్గర్లో గ్రామం. భారత్‌లో ఇప్పుడున్న అయోధ్య కల్పితం. శ్రీరాముడు నేపాలీ’’ అని సోమవారం నాటి ప్రకటనలో తెలిపారు. 


చైనా చేతిలో కీలుబొమ్మగా మారిన నేపాల్... భారత్‌కు సంబంధించిన విషయాల్లో వివాదాస్పదంగా వ్యవహరిస్తోంది. భారత భూభాగాలను నేపాల్ భూభాగాలుగా చూపుతూ మ్యాప్‌ను సవరించింది. అంతేగాక తనను పదవీచ్యుతుడిని చేసేందుకు భారత్ కుట్ర పన్నుతున్నట్లు సాక్షాత్తు ప్రధాని ఓలీ ఆరోపించారు. ఈ కుట్రలో కొందరు నేపాలీలు కూడా భాగస్వాములయ్యారన్నారు. దీంతో ఆయనపై సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఓలీ తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు భారత దేశంపై విమర్శలు చేస్తున్నారని సొంత పార్టీ నేతల్లో అత్యధికులు ఆరోపించారు. 


ఇదిలా ఉంటే గత వారం భారత టీవీ చానెళ్లనన్నింటికీ తమ దేశంలో బంద్ చేస్తున్నట్లు అక్కడి కేబుల్ ఆపరేటర్లు ప్రకటించారు. కేవలం దూరదర్శన్ మాత్రమే అనుమతిస్తున్నామని, మిగతా వాటిని స్వచ్ఛందంగా నిలిపివేస్తున్నామని ప్రకటనలో తెలిపారు. 

Updated Date - 2020-07-14T07:06:43+05:30 IST