సర్వ జగత్తూ భగవత్‌ సృష్టే!

ABN , First Publish Date - 2021-05-21T05:30:00+05:30 IST

పంచభూతాల పుట్టుకకు కారణం ఆ వాసుదేవుడే! పదునాలుగు లోకాలు ఆ శ్రీహరి నియమించినవే! సురలంతా ఆ దివ్య స్వరూపుడి శరీరం నుండి పుట్టినవారే! వేదాలు, యుగాలు, తపస్సులు, యోగాలు...

సర్వ జగత్తూ భగవత్‌ సృష్టే!

పంచభూతాల పుట్టుకకు కారణం ఆ వాసుదేవుడే! పదునాలుగు లోకాలు ఆ శ్రీహరి నియమించినవే! సురలంతా ఆ దివ్య స్వరూపుడి శరీరం నుండి పుట్టినవారే! వేదాలు, యుగాలు, తపస్సులు, యోగాలు, విజ్ఞానం ఇవన్నీ నారాయణుడికి చెందినవే! సర్వాంతర్యామి, సర్వాత్ముడు, అన్నిటికీ సాక్షీభూతుడు ఆ పరమేశ్వరుడే! బ్రహ్మ సృష్టి చేసేది అతడి అనుగ్రహంతోనే!


మహాకవి బమ్మెర పోతనామాత్య రచించిన ‘శ్రీమహాభాగవతం’లో ప్రపంచోత్పత్తి గురించి, అంతుచిక్కని సృష్టి రహస్యం గురించి, పిండోత్పత్తి క్రమం గురించి అనేక రహస్యాలున్నాయి. విలాసార్థం జగత్తును పుట్టించాలనే సంకల్పం విరాట్స్వరూపుడైన ఆ మహాపురుషుడికి కలిగింది. ఆ ఆలోచనతో బ్రహ్మాండాన్ని చీల్చాడు. మొదట తన సుఖం కోసం శుచిగా ఉండే నీళ్లను పుట్టించాడు. ఆ జలరాశిలో పవళించాడు. ఆయన హృదయాకాశం నుండి ఓజస్సు, సహస్సు, బలం అనే ధర్మాలు పుట్టాయి. సూక్ష్మమైన క్రియాశక్తి వల్ల ప్రాణం పుట్టింది. నోటి నుండి దవడలు, నాలుక మొదలైనవి పుట్టాయి. ముఖం నుండి శోభిల్లి పలుకు తన రూపాన్ని కోరుకుంటుంది. మాట్లాడాలనే సంకల్పం కలుగుతుంది. ఇలా, ముఖం నుండి వాక్కు పుట్టింది. దీనికి దేవత అగ్ని. నీరు అగ్నికి ప్రతిరోధకం అయింది. మహావాయువు వల్ల ముక్కు పుట్టింది. దీని దేవత వాయువు. తేజస్సు నుండి రెండు కళ్ళు పుట్టాయి. వీటి దేవత సూర్యుడు. భగవంతుడు ‘చెవి’ అనే ఇంద్రియ కారకుడు అయ్యాడు. దీని దేవత దిక్కులు. తరువాత చర్మం ఏర్పడింది. దాని నుండి రోమాలు పుట్టాయి. వీటి మూలదేవత చెట్లు. వాయువు నుండి చేతులు పుట్టాయి. ఈశ్వరుడి శరీరం నుండి పాదాలు పుట్టాయి. స్త్రీ-పురుషుల కలయిక వల్ల సంతానం కలిగింది. పొట్ట, నాడీ మండలం నిర్మితమయ్యాయి. హృదయం పుట్టింది అలాగే. విరాట్పురుషుడి తనువు నుండి ఏడు ధాతువులు... ఏడు ప్రాణాలు పుట్టాయి. ఇదంతా ఆ పరమేశ్వరుడి స్థూల శరీరం. 

భగవంతుడికి సృష్టి సంకల్పం కలిగి... తానే కార్యం, కారణం అయి తన కడుపులో నుండి విశ్వాన్ని సృష్టించాడు. ఇది భగవంతుడికి మాత్రమే కనిపిస్తూ, మరో రూపాన్ని పొందింది. దాంట్లో నుండి క్రమంగా ‘కారణం, కార్యం, కర్త’ అనే పేర్లతో భేదాలు ఏర్పడి, పంచ భూతాలు, ఇంద్రియాలు, మనస్సు పుట్టాయి. ఆ తరువాత అహంకారం ఏర్పడింది. ఇది సత్త్వరజోస్తమో గుణాలతో కూడి ఉంటుంది. పంచభూతాలు, పంచేంద్రియాలు, పంచ తన్మాత్రలు వేర్వేరుగా ఉండి, సమైక్యం కాలేకపోవడంతో సృష్టి సామర్థ్యం వాటికి చాలలేదు. అప్పుడు దేవతలందరూ నారాయణుణ్ణి ప్రార్థించారు. జగత్తును సృష్టించే శక్తిని తమకు ఇవ్వమని అడిగారు. విష్ణుమూర్తి ప్రకృతిలో తన శక్తిని ప్రవేశపెట్టి, పంచభూతాలు, పంచేంద్రియాలు తదితర 27 తత్త్వాలలో తాను ప్రవేశించి వాటికి ఏకత్వాన్ని కలిగించాడు. 

విరాట్పురుషుడిలో కొంత భాగం ముఖం కాగా, శ్రీహరి అంశతో అగ్నిదేవుడు అక్కడ స్థావరం ఏర్పరుచుకున్నాడు. ఆ కారణంగా జీవుడు శబ్దాన్ని పలుకగలుగుతున్నాడు. కొంత భాగం వేరుగా కన్నులు అయ్యాయి. సూర్యభగవానుడు కన్నులకు అధికారై జీవులకు రూపవిజ్ఞానాన్ని ఇస్తున్నాడు. మరికొంత భాగం చర్మమై వాయువు అక్కడ నిలిపాడు. మరికొంత భాగం వేరై చెవులుగా ఏర్పడింది. ఈశ్వరాంశ అయిన దిక్కులు జీవుడి శ్రవణ ఇంద్రియాన్ని ఆశ్రయించి.. అతడికి శబ్ద జ్ఞానాన్ని కలిగిస్తున్నాయి. ఈశ్వరాంశ అయిన వరుణుడు జీవుడి రసనేంద్రియంగా కనిపిస్తూ రుచులను తెలుసుకుంటున్నాడు. అలాగే పరమేశ్వరుడు నుండి ముక్కు విడిగా ఏర్పడి... ఆయన అంశ కలిగిన అశ్వనీదేవతలకు స్థానమై జీవుడికి వాసన చూసే శక్తిని ఇచ్చింది. పరమ పురుషుడి నుంచి వేరైన చర్మం ఆయన అంశలైన కేశాలను కూడడం వల్ల ప్రాణికి దురద లాంటివి ఏర్పడ్డాయి. ఈశ్వరాంశ అయిన ప్రజాపతి శుక్రంతో అమ్యోగం పొందడం వల్ల జీవుడు అపరిమితమైన ఆనందాన్ని పొందుతున్నాడు. అలాగే ఆసన స్థానంలో అచ్యుతాంశ అయిన మిత్రుడు వాయువుతో కూడి ఉండడం వల్ల జీవుడికి విసర్జన శక్తి కలుగుతున్నది. విరాట్పురుషుడి చేతులతో ఇచ్చి, పుచ్చుకునే శక్తి కలవాడైన జీవుడు జీవనోపాధిని పొందుతున్నాడు. పాదాలను విష్ణువు అధిష్ఠించి నడిచే శక్తిని కలిగించడం వల్ల జీవుడు నడవగలుగుతున్నాడు. చంద్రుడు మనస్సులో ప్రవేశించడం వల్ల జీవుడు సంకల్ప- వికల్పాలను పొందుతున్నాడు. అలాగే అహంకారంలో రుద్రుడు ప్రవేశించినప్పుడు జీవుడు కర్తవ్యాన్ని తెలుసుకొని ప్రవర్తిస్తాడు. బుద్ధి వాగీశ్వరుడి నివాసమైన జ్ఞానాంశతో కూడినప్పుడు జీవుడికి విషయ పరిజ్ఞానం కలుగుతుంది. బ్రహ్మకు నివాసమై చైతన్యాన్ని పొందినప్పుడు జీవుడు విజ్ఞాని అవుతాడు. 



- వనం జ్వాలా నరసింహారావు 

80081 37012


Updated Date - 2021-05-21T05:30:00+05:30 IST