రూ.9 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2020-03-26T08:25:34+05:30 IST

కోవిడ్‌-19 వైరస్‌ కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌తో భారత్‌ భారీ నష్టాలను చవిచూడనుంది. కరోనా మహమ్మారితో భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు 12,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.9.10 లక్షల

రూ.9 లక్షల కోట్లు

లాక్‌డౌన్‌తో భారత ఆర్థిక వ్యవస్థకు నష్టం 

ఇది జీడీపీలో 4 శాతానికి సమానం.. రోజుకు రూ.40,000 కోట్ల గండి

న్యూఢిల్లీ : కోవిడ్‌-19 వైరస్‌ కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌తో భారత్‌ భారీ నష్టాలను చవిచూడనుంది. కరోనా మహమ్మారితో భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు 12,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.9.10 లక్షల కోట్లు)మేర ఉత్పత్తిని నష్టపోనుంది. ప్రస్తుత భారత జీడీపీలో ఇది దాదాపు నాలుగు శాతానికి సమానం. ఇందులో 9,000 కోట్ల డాలర్ల (రూ.6.75 లక్షల కోట్లు) నష్టం ప్రధాని మోదీ ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్‌తో వాటిల్లుతుందని బ్రిటిష్‌ బ్రోకరేజీ సంస్థ బార్‌క్లేస్‌ తాజా నివేదిక వెల్లడించింది. మరోవైపు కేర్‌ రేటింగ్‌ సంస్థ అయితే ఈ 21 రోజుల లాక్‌డౌన్‌తో భారత ఆర్థిక వ్యవస్థ రోజుకు రూ.35,000 కోట్ల నుంచి రూ.40,000 కోట్ల చొప్పున నష్టపోతుందని తెలిపింది. ఈ లెక్కన 21 రోజుల్లో రూ.6.3 లక్షల కోట్ల నుంచి రూ.7.2 లక్షల కోట్ల ఉత్పత్తి నష్టపోతుందని అంచనా వేసింది. 


‘సాయం’పై అలసత్వం 

ప్రభుత్వం ఆదుకుంటే తప్ప ప్రస్తుతం ఏ రంగం గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఇతర దేశాల్లోని ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ఇందుకోసం ఇప్పటికే స్పష్టమైన చర్యలు ప్రకటించాయి. అయితే భారత ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాత్రం ఈ విషయంలో ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ఇప్పటివరకు ప్రకటించిన అరకొర చర్యలు ఆపరేషన్‌ అవసరమైన రోగికి బ్యాండ్‌ ఎయిడ్‌ ఇచ్చి సర్దుకోమన్నట్టు ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ద్రవ్య లోటు భయాలను పక్కన పెట్టి ప్రభుత్వం వెంటనే ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని పారిశ్రామిక వర్గాలు కోరుతున్నాయి. 


వడ్డీ రేట్లు తగ్గించాలి

భారత ఆర్థిక రంగం ఇప్పటికే ఐసీయూలో ఉంది. కోవిడ్‌-19తో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టయింది. ఉత్పత్తి నిలిచి పోవడంతో చాలా కంపెనీలు తీవ్ర నిధుల కొరత ఎదుర్కొంటున్నాయి. కొన్ని కంపెనీలు ముఖ్యంగా ఎంఎ్‌సఎంఈలైతే ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేవు. ఏప్రిల్‌ 3న జరిగే ఎంపీసీ సమావేశం వరకు ఆగకుండా ఆర్‌బీఐ వీలైనంత త్వరగా కీలక రెపో వడ్డీ రేటు భారీగా తగ్గించడంతో పాటు రుణాల చెల్లింపులనూ రీషెడ్యూల్‌ చేయాలనే డిమాండ్‌  వినిపిస్తోంది. దీంతో ఆర్‌బీఐ ఈ సంవత్సరం రెపో రేటు రెండు విడతలుగా 1.65 శాతం మేర తగ్గించే అవకాశం ఉందని బార్‌క్లేస్‌ అంచనా వేస్తోంది.  


ఫార్మాకు లాక్‌డౌన్‌ కష్టాలు

లాక్‌డౌన్‌ నుంచి ప్రభుత్వం ఫార్మా కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలకు మినహాయింపు ఇచ్చింది. అయినా చాలా చోట్ల అధికారులు ఈ విషయం పట్టించుకోవడం లేదు. ప్లాంట్లను మూసివేయించటంతో పాటు వాటికి వచ్చే ముడి పదార్ధాల సరఫరాను అడ్డుకుంటున్నారు. దీంతో దేశీయ ఫార్మా కంపెనీల ఎగుమతులూ నిలిచి పోయాయి. విమానాశ్రయాలు, ఓడ రేవుల్లోనూ ఈ కంపెనీల కన్‌సైన్‌మెంట్ల తనిఖీలు ఆగిపోయాయని హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సువెన్‌ లైఫ్‌సైన్సెస్‌ చైర్మన్‌ వెంకట్‌ జాస్తి.. వాటాదారులు, ఖాతాదారులకు రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.


అమెజాన్‌ సరఫరాలు బంద్‌  

ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ప్యాంట్రీ సరుకుల డెలివరీలను ఆపేసింది అయితే ఫ్లిప్‌కార్ట్‌ మాత్రం బుధవారం సాయంత్రం మళ్లీ డెలివరీలను ప్రారంభించినట్లు తెలిపింది


జీడీపీ ఢమాల్‌

2020-21 ఆర్థిక సంవత్సరంలో లాక్‌డౌన్‌తో భారత జీడీపీ వృద్ధి రేటు 3.5 శాతం మించకపోవచ్చని బార్‌క్లేస్‌ అంచనా వేస్తోంది. ఇదే సంస్థ ఇంతకుముందు 2020-21లో భారత జీడీపీ వృద్ధి రేటు 5.2 శాతం వరకు ఉంటుందని అంచనా వేసింది. కేర్‌ రేటింగ్స్‌ అయితే  2020 జనవరి-మార్చి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 1.5 లేదా 2.5 శాతం మించదని స్పష్టం చేసింది. ఉత్పత్తి కార్యకలాపాల్లో దాదాపు 80 శాతం వరకు ఆగిపోతాయని అంచనా వేసింది. 


రియల్టీ నేలచూపులు

లాక్‌డౌన్‌తో స్థిరాస్తి రంగం మరిన్ని కష్టాల్లో పడింది. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు అమ్మకాలు నిలిచిపోయాయి. ఇప్పటికే కొనుగోలు చేసిన వారు బిల్డర్లకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించడం కష్టంగా మారింది. దీంతో బ్యాంకులు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ (హెచ్‌ఎ్‌ఫసీ)లకు బిల్డర్లు చెల్లించాల్సిన రుణాలు ఆలస్యమవుతున్నాయి. కొంతమంది బిల్డర్లయితే ప్రస్తుత పరిస్థితుల్లో రుణాల చెల్లింపు మావల్ల కాదని చేతులెత్తేస్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గించి ప్రభుత్వమే ఏదోలా నిధులు సమకూరిస్తే తప్ప ఉన్న ప్రాజెక్టులు పూర్తిచేసే అవకాశం లేదంటున్నారు. కొత్త ప్రాజెక్టుల ఊసెత్తటమే మానేశారు.

Updated Date - 2020-03-26T08:25:34+05:30 IST