చివరి'లో ముంచేసింది

ABN , First Publish Date - 2020-11-24T06:23:43+05:30 IST

తీవ్ర అల్పపీడనం ప్రభావంతో జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం అర్ధరాత్రి, సోమవారం తెల్లవారుజామున భారీవర్షం కురిసింది.

చివరి'లో ముంచేసింది
చీడికాడ మండలం మంచాలలో నీటిలో వరి మొనలు

భారీవర్షాలకు పంట పొలాలు జల మయం

వరికి తీవ్ర నష్టం

కోత కోసిన పొలాల్లో నీట మునిగిన పనలు

పంటను కాపాడుకోవడానికి రైతుల పాట్లు

గట్లమీదకు, మెరక ప్రాంతాలకు తరలింపు

మరికొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులకు నేలకొరిగి, నీట మునిగిన వరి పైరు

తుఫాన్‌ హెచ్చరికలతో ఆందోళన చెందుతున్న అన్నదాతలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌) 

తీవ్ర అల్పపీడనం ప్రభావంతో జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం అర్ధరాత్రి, సోమవారం తెల్లవారుజామున భారీవర్షం కురిసింది. దీంతో కోత కోసి, కుప్ప వేయని పొలాల్లో వరి పనలు నీటిలో తేలియాడుతున్నాయి. వర్షంతోపాటు ఈదురుగాలులు కూడా వీయడంతో కోతకు వచ్చిన వరి పైరు నేలవాలింది. వేలాది రూపాయలు అప్పులు చేసి పెట్టుబడి పెట్టి, ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంట చేతికందే దశలో తుఫాన్‌ రూపంలో ముప్పు పొంచివుండడం అన్నదాతలను తీవ్రంగా కలవరపరుస్తున్నది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారానికి వాయుగుండంగా మారడం, ఇది మరింత బలపడి మంగళవారం నాటికి తుఫాన్‌గా మారుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లాలో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. 26వ తేదీ వరకు భారీవర్షాలు పడే అవకాశం వున్నట్టు చెబుతుండడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. ఈ గండం నుంచి గట్టెక్కేదెలా అంటూ మథనపడుతున్నారు. గత నెలలో భారీవర్షాలు, వరదల కారణంగా పలు ప్రాంతాల్లో వరి పైరు నీటమునిగి వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. మిగిలిన ప్రాంతాల్లో వరి పైరు కోత దశకు చేరుకుంది. ముందస్తుగా నాట్లు వేసిన పొలాల్లో కోతలు మొదలయ్యాయి. ఈ తరు ణంలో అల్పపీడనం ఏర్పడి ఆదివారం అర్ధరాత్రి తరువాత భారీవర్షం కురవడంతో రెండు, మూడు రోజుల క్రితం కోత కోసి, కుప్ప వేయని పొలాల్లో వరి పనలు నీట మునిగాయి. వర్షంతోపాటు ఈదురుగాలులు కూడా వీయ డంతో కోత కోయని పొలాల్లో పైరు పూర్తిగా నేలవాలింది. సోమవారం ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు...నీటిలో తేలాడుతున్న వరి పనలను చూసి కన్నీటి పర్యంతం అయ్యారు. వెంటనే కూలీలను ఏర్పాటుచేసుకుని, వరి పనలను గట్లపైకి, మెరక ప్రదేశాలకు చేర్చారు. పనలు తడిసిపోవడంతో కుప్ప వేసే పరిస్థితి లేదని, మూడు, నాలుగు రోజుల వరకు వర్షాలు పడకపోతే ఇబ్బంది వుండదని, ఒకవేళ వర్షాలు పడితేమాత్రం గింజ రంగు మారడం లేదా మొలకెత్తడం జరుగుతుందని రైతులు చెబు తున్నారు.ముంపునకు గురైన పంటలను అధికారులు పరిశీలించి, నష్టాన్ని అంచనా వేయాలని కోరుతున్నారు. చోడవరం, రావికమతం, బుచ్చెయ్యపేట, చీడికాడ, ఎస్‌.రాయవరం, నక్కపల్లి, ఎలమంచిలి, రాంబిల్లి, పాయకరావు పేట, కోటవురట్ల, మాడుగుల, రోలుగుంట మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో వరి పనలు నీట మునిగాయి. రైతులు వరి పనలను మోపులు కట్టి, మెరక ప్రదేశాలకు తరలించి ఆరబెట్టుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో కోతకు వచ్చిన పంట నేలకొరిగింది.


వరి కోతలు వాయిదా వేసుకోండి

వ్యవసాయ శాఖ జేడీ సూచన

తుఫాన్‌ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చ రించిందని, అందువల్ల రైతులు వరి కోతలను రెండు, మూడు రోజులు వాయిదా వేసుకోవాలని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు జేఎస్‌ఎన్‌ఎస్‌ లీలావతి సూచించారు. ఇప్పటికే కోసి వున్నట్టయితే వరి పనలను నీటి ముంపు లేనిచోట చిన్నపాటి కుప్పలుగా వేసుకుని టార్పాలిన్‌ పట్టాలను కప్పాలన్నారు. వరి పనలు పచ్చిగా వుండి, కుప్ప వేయడానికి వీలుకాని పరిస్థితి వుంటే పనలపై ఉప్పు ద్రావకం పిచికారీ చేయాలని సూచించారు. పొలంలో నీరు నిల్వ లేకుండా బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కోత కోయని పొలాల్లో రెండు, మూడు వరి దుబ్బులను కలిపి కట్టినట్టయితే గాలులకు వాలిపోకుండా కాపాడుకోవచ్చునన్నారు.

Updated Date - 2020-11-24T06:23:43+05:30 IST