ఓడి గెలిచాడు!

ABN , First Publish Date - 2020-04-14T05:54:00+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడిన బెర్నీ సాండర్స్‌ రంగంనుంచి తప్పుకోవడం అమెరికా బాగుపడాలని కోరుకుంటున్న అనేకమందిని నిరాశపరిచింది. బరినుంచి దిగిపోతున్నట్టు ఆయన ప్రకటించగానే...

ఓడి గెలిచాడు!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడిన బెర్నీ సాండర్స్‌ రంగంనుంచి తప్పుకోవడం అమెరికా బాగుపడాలని కోరుకుంటున్న అనేకమందిని నిరాశపరిచింది. బరినుంచి దిగిపోతున్నట్టు ఆయన ప్రకటించగానే ఈ కరోనా కాలంలో కూడా అక్కడి స్టాక్‌మార్కెట్‌ హుషారుగా పరుగులు తీసిందంటే ఆయన ఎవరి పక్షమో తెలియచెబుతుంది. తమ ప్రయోజనాలకు కరోనా కంటే సాండర్స్‌ మరింత ప్రమాదకారి అని అమెరికా కంపెనీలు, బహుళజాతి సంస్థలు అనుకున్నాయని అర్థం. సాండర్స్‌కు మొదట్లో లభించిన ఆదరణ క్రమంగా సన్నగిల్లిన మాట నిజం. మొదట్లో న్యూహాంప్‌షైర్‌, నెవడా, అయోవా వంటి చోట్ల ఆయనకు మంచి మద్దతు లభించింది కానీ, గత వారం నాటి ‘సూపర్‌ ట్యూజ్‌డే’ పెద్ద దెబ్బకొట్టింది. పద్నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ప్రైమరీల్లో ఏకంగా పది రాష్ట్రాలు జో బిడెన్‌ ఖాతాల్లో పడ్డాయి. దీనితో ఆయనకే తన మద్దతునందిస్తూ బెర్నీ సాండర్స్‌ పక్కకు తప్పుకున్నారు.


పోటీనుంచి వైదొలిగినంత మాత్రాన అమెరికా ఎన్నికలపై సాండర్స్‌ ఇప్పటికే వేసిన ప్రభావం ఊరకనే పోదు. కరోనాకాలంలో తాము దశాబ్దాలుగా కోల్పోయినదేమిటో ప్రజలకు తెలిసివస్తున్నది. మరీ ముఖ్యంగా ఆరోగ్యరంగం పూర్తిగా కార్పొరేట్‌ చేతుల్లోకి పోయినందున తాము నష్టపోయినదెంతో అర్థమవుతున్నది. సాండర్స్‌ ఆలోచనలు, విధానాలు మరీ విపరీతంగా ఉన్నాయని ఆయన పార్టీయే  భావించిన మాట వాస్తవం. సంపన్నులమీద మరింత పన్ను, ఆదాయ వ్యత్యాసాలు తగ్గించడం, అందరికీ ఉచితవైద్య, ఉచిత కళాశాల విద్య, కనీస వేతనాలు పెంచడం వంటి ఆలోచనలు ఆయన ప్రగతిశీల ఆలోచనాధోరణికి కొన్ని ఉదాహరణలు. ఈ కారణంగానే కార్పొరేట్‌ ప్రపంచం సాండర్స్‌కు వ్యతిరేకంగా దుష్ప్రచారానికి నడుంబిగించింది. యూరప్‌ను సర్వనాశనం చేసిన సామ్యవాద విధానాలతో అమెరికాను ముంచబోతున్నాడని కొన్ని పత్రికలు వరుసపెట్టి కథనాలు ఆరంభించాయి. ఈ ‘కరడుగట్టిన కమ్యూనిస్టు’ను రేసు నుంచి తప్పించకపోతే మీరు మునగడం, ట్రంప్‌ గెలవడం ఖాయమని డెమోక్రాట్లకు నూరిపోశాయి. డెమోక్రాటిక్‌ పార్టీలోని విద్యార్థులు, యువకులు సాండర్స్‌ పక్షాన నిలిచినా, వృద్ధతరం మాత్రం ట్రంప్‌ను బిడెన్‌ మాత్రమే గట్టిగా ఢీకొనగలరని భావించింది. నల్లజాతీయులు గణనీయంగా ఉన్న చోట్ల కూడా సాండర్స్‌ గట్టి పోటీదారని భావించకపోవడం విచిత్రం. ట్రంప్‌ ఎట్టిపరిస్థితుల్లోనూ తిరిగి గెలవకూడదని గట్టిగా కోరుకుంటున్న నల్లజాతీయులు సాండర్స్‌ కంటే, పూర్వ ఉపాధ్యక్షుడు బిడెన్‌ మాత్రమే ట్రంప్‌కు బలమైన పోటీదారని నమ్మారు. కరోనా కారణంగా చాలా ప్రచారసభలకు కత్తెరపడటం సాండర్స్‌ అవకాశాలను దెబ్బతీసింది. పెట్టుబడిదారీ సమాజంలో తన ఆలోచనలకు సానుకూలత సాధించగలిగే సమయం ఈ సోషల్‌ డెమోక్రాట్‌కు లేకపోయింది. జో బిడెన్‌కూ డొనాల్డ్‌ ట్రంప్‌కూ విధానాల్లో పెద్ద తేడాలేదని వాదించిన సాండర్స్‌ చివరకు అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆయనకే వదిలేసి తాను తప్పుకోవాల్సి వచ్చింది.


పోటీ నుంచి సాండర్స్ తొలగినంత మాత్రాన ఆయన ఓట్లు గంపగుత్తగా తనకు పడవని బిడెన్‌కు కూడా తెలుసు. నిరుద్యోగులు, కార్మికులు, పేదలను సాండర్స్‌ స్థాయిలో ఆకర్షించడం సులభమేమీ కాదు. సాండర్స్‌ విధానాలు తనకూ ఇష్టమేనని చెప్పుకోవడానికి బిడెన్ కష్టపడుతున్నారు. ప్రజా వైద్యాన్ని మరింత విస్తృతం చేయడం, పేద విద్యార్థులను ఆదుకోవడం వంటి ప్రతిపాదనల ద్వారా సాండర్స్‌ ఎజెండా అమలుకు తాను కట్టుబడి ఉన్నానని నిరూపించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. గత నాలుగుదశాబ్దాలుగా అమెరికాను శాసిస్తున్న నయా ఉదారవాదంతో అక్కడి రెండు పార్టీల ఎజెండాలోనూ పెద్ద తేడాలేని పరిస్థితి ఏర్పడింది. అపరకుబేరులు, కార్పొరేట్‌ సంస్థలే విధానాలను నిర్దేశిస్తున్న నేపథ్యంలో, ప్రజా సంక్షేమం బాగా సన్నగిల్లింది. తీవ్ర ఆర్థిక అసమానతలు, పర్యావరణ విధ్వంసం, సంక్షేమ పథకాల్లో కోత, పెరిగిపోతున్న వినియోగ సంస్కృతిపై ప్రజల్లో వ్యతిరేకత కూడా హెచ్చుతున్నది. సంపన్నవర్గాలకు వ్యతిరేకంగా ఆక్యుపై వాల్‌స్ట్రీట్‌ వంటి ఉద్యమాలు కూడా జరిగాయి. నాలుగేళ్ళ క్రితం మాదిరిగానే, ఇప్పుడు కూడా డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిత్వాన్ని సాండర్స్‌ అందుకోలేకపోయినా, అమెరికా రాజకీయాలను ప్రభావితం చేయడంలో ఆయన విజయం సాధించాడు. ఇంతకాలమూ తమను కమ్మిన మాయ ఏమిటో అమెరికన్‌ సమాజానికి తెలియచెప్పి, లోతుగా ఆలోచించేట్టు చేశాడు. కరోనా అనంతర కాలంలో ప్రజలు తమ అసలు సిసలు అవసరాలు, ప్రయోజనాల పరిరక్షణకు నడుంబిగించేందుకు తోడ్పడ్డాడు. ఆయన సైద్ధాంతిక ప్రభావం ఈ ఎన్నికలకు మాత్రమే పరిమితం కాబోదు.

Updated Date - 2020-04-14T05:54:00+05:30 IST