ఖరీఫ్‌లోనూ కన్నీళ్లేనా...!

ABN , First Publish Date - 2021-08-08T05:08:16+05:30 IST

ఖరీఫ్‌ సీజన్‌ నేపథ్యంలో రైతులంతా పొలాలను దున్ని పంటల సాగును ప్రారంభించారు. అయితే మునుపెన్నడూ లేనంతగా పల్లెల్లో వాతావరణం స్తబ్ధుగా ఉంది.

ఖరీఫ్‌లోనూ కన్నీళ్లేనా...!
ఎర్రగొండపాలెం వద్ద మిర్చి నాట్లు వేస్తున్న కూలీలు

ఈఏడాదైనా వ్యవ‘సాయం’ కలిసొచ్చేనా!

ఒడిదొడుకుల మధ్యే సాగులోకి రైతాంగం

భారీగా పెరిగిన ఎరువుల ధరలు

రాయితీపై అరకొరగానే విత్తనాలు

కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్న కరోనా

నిరాశపరిచిన గత రబీ

ప్రభుత్వ ప్రోత్సాహం అంతంతమాత్రమే

జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ మందకొడిగా ప్రారంభమైంది. రైతు కళ్లలో పంటల ఉత్సాహం గానీ పల్లెల్లో సాగు సందడి కానీ అంతగా కనిపించడం లేదు. అసలే కష్టాలతో కునారిల్లుతోన్న జిల్లా రైతాంగానికి ఏడాది నుంచి కొవిడ్‌ తోడవడంతో వారి పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్లయింది. కష్టకాలంలో చేయూతనివ్వాల్సిన ప్రభుత్వాలు మొక్కుబడి సాయంతోనే సరిపెడుతున్నాయి. గత ఖరీఫ్‌ మొత్తం కొవిడ్‌తోనే గడిచిపోయింది. ఇక రబీ పంట చేతికొచ్చే సమయానికి కరోనా గతం కన్నా ఉధృతంగా విరుచుకుపడింది. దీంతో పెట్టుబడి ఖర్చులు పెరిగాయి. ధరలు దిగజారి రైతులు  అందిన కాడికి పంటను తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఖరీఫ్‌కు పంటలు వేస్తున్న రైతాంగానికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. 

ఒంగోలు (జడ్పీ), ఆగస్టు 7 : ఖరీఫ్‌ సీజన్‌ నేపథ్యంలో రైతులంతా పొలాలను దున్ని పంటల సాగును ప్రారంభించారు. అయితే మునుపెన్నడూ లేనంతగా పల్లెల్లో వాతావరణం స్తబ్ధుగా ఉంది. ఇందుకు ఒక పక్క కొవిడ్‌, మరోపక్క సాగు పెట్టుబడులు భారం కావడం కూడా కారణంగా కనిపిస్తోంది. గత ఏడాది  రైతులకు కష్టనష్టాలనే మిగిల్చింది. సాగు ఖర్చులు పెరగడం, సకాలంలో కూలీలు దొరక్కపోవడం, వ్యయప్రయాసలతో ఇంటికి తెచ్చుకున్న పంట దిగుబడులకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో వ్యవసాయమంటేనే రైతులు భయపడే పరిస్థితులొచ్చాయి. కౌలురైతుల సాగుకు ముందుకు రావడం లేదు. చాలాప్రాంతాల్లో పొలాల కౌలు రేట్లు పడిపోయాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మళ్లీ ఖరీఫ్‌ సీజన్‌ మొదలైంది. 


16వేల హెక్టార్లలో పంటల సాగు

ఈ సీజన్‌లో జిల్లాలో 2,12,552 హెక్టార్లను సాధారణ సాగు విస్తీర్ణం ఉంది. కంది పంట 90,173 హెక్టార్లు, పత్తి 33,037 హెక్టార్లు, మిరప 27,152 హెక్టార్లలో సాగవుతోంది. అదేవిధంగా ధాన్యం రకాలు 14,747, ఆయిల్‌ సీడ్స్‌ 9,165 హెక్టార్లలో రైతులు పండించనున్నారు. వీటితో పాటు ఉల్లి, పొగాకు, చెరకు, మినుము తదితరాలను కూడా రైతాంగం ఖరీఫ్‌లో గణనీయంగానే సాగు చేయనుంది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో సుమారు 16వేల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. అధికంగా 6251 హెక్టార్లలో పత్తి, 1560 హెక్టార్లలో కంది పంటలు సాగు కాగా వేరుశనగ, నువ్వు, ఇతర పశుగ్రాస పంటలు సాగయ్యాయి.


పెరిగిన ఎరువుల ధరలు

పెరిగిన ఎరువుల ధరలు ఈ సీజన్‌ నుంచే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం చెప్తోంది. ఒక్క డీఏపీకి మాత్రం పెరిగిన ధర మీద రాయితీ ఇవ్వడానికి కేంద్రం ముందుకొచ్చింది. యూరియాపై కేంద్రం నియంత్రణ ఉన్నందున పాత ధరే అమలుకానుంది. జిల్లాలో డీఏపీ, యూరియాతోపాటు రైతాంగం ఇతర కాంప్లెక్స్‌ ఎరువులను వినియోగిస్తోంది. పాత స్టాకును మినహాయిస్తే వాటిపై పెంచిన ధరలనే వ్యాపారులు వసూలు చేయనున్నారు. ఆర్బీకేలలో అందుబాటులో ఎరువులు అని ఆర్భాటం చేసిన అధికారులు వాటిని ఇంతవరకు పూర్తిస్థాయిలో చేర్చలేదు. ఎరువుల కోసం రైతులు ఆర్బీకేల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది.


అరకొరగానే రాయితీ విత్తనాలు

కందులు, మినుములు, పెసర విత్తనాలను మాత్రమే రాయితీపై ఖరీఫ్‌లో అందిస్తున్నారు. ఇవి కూడా మొత్తం సాగయ్యే విస్తీర్ణంతో పోల్చుకుంటే 20శాతంలోపే ఉంటోంది. దీంతో రైతులు అధికశాతం విత్తనాలను బహిరంగ మార్కెట్‌లోనే కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులు రైతుల అవగాహనలేమిని ఆసరాగా చేసుకుని నకిలీ విత్తనాలను అంటగడుతున్న ఉదాహరణలు ఉన్నాయి. విత్తనాలపై నిఘా ఉంచాల్సిన యంత్రాంగాలు మొద్దు నిద్రపోతుండటంతో సీజన్‌ ప్రారంభమైన ప్రతిసారీ రైతులు మోసానికి గురవుతున్నారు. ఆ ప్రభావం దిగుబడులపై కూడా పడడంతో రైతులు కుదేలవుతున్నారు. అలాగే రైతులకు అవసరమైన మిర్చి విత్తనాలను అందజేస్తామని చెప్పిన వ్యవసాయ అధికారులు ఇప్పటివరకు వాటి గురించి పట్టించుకోలేదు.


పత్తి రైతుపై అదనపు భారం

జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో 33,037హెక్టార్లలో పత్తి సాగవుతోంది. ప్రైవేటు కంపెనీలు బీటీ పత్తి విత్తన ధరలను పెంచాలని నిర్ణయించాయి. ఎకరానికి మూడు ప్యాకెట్ల విత్తనాలు రైతుకు అవసరమవుతాయి. గతంలో 450 గ్రాముల విత్తన ప్యాకెట్‌ ధర రూ.725గా ఉండేది. పెంచిన ధరల ప్రకారం అది ఇప్పుడు రూ.767 కానుంది. రైతుకు ఇది అదనపు భారం కానుంది. మరి కొంత మంది వ్యాపారలు బ్రాండ్ల పేర్లు చెప్పి నాశిరకం విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు


పెట్టుబడి కోసం అవస్థలు

బాం్యకులు అందించే రుణాలలో సేద్యానికి పెద్ద మొత్తం కేటాయిస్తున్నప్పటికీ రుణపరిమితిని పెంచకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఏడాది కాలంగా పరిస్థితులు అనుకూలించకపోయే సరికి రైతులు రెన్యువల్‌కే పరిమితమవుతున్నారు. రుణ లభ్యత పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుని ఉంటే రైతులకు కొంతమేర ఊరట కలిగేది. రుణాల విషయంలో కౌలు రైతుల పరిస్థితి మరింత దీనంగా ఉంది. మొత్తం కేటాయింపుల్లో వారి వాటా 5 శాతం కూడా ఉండటం లేదు. 



Updated Date - 2021-08-08T05:08:16+05:30 IST