బెంగాల్ లో కమలం గుబాళింపులు

ABN , First Publish Date - 2021-03-09T06:59:45+05:30 IST

‘మీఆట కట్టు. పశ్చిమ బెంగాల్ ప్రజలు నిజమైన పరివర్తనం కోసం నిరీక్షిస్తున్నారని అర్థమైంది. భారతీయ జనతా పార్టీ అభివృద్ధి రాజకీయాలకు...

బెంగాల్ లో కమలం గుబాళింపులు

‘మీఆట కట్టు. పశ్చిమ బెంగాల్ ప్రజలు నిజమైన పరివర్తనం కోసం నిరీక్షిస్తున్నారని అర్థమైంది. భారతీయ జనతా పార్టీ అభివృద్ధి రాజకీయాలకు, తృణమూల్ కాంగ్రెస్ అవినీతి, హింసా రాజకీయాలకు మధ్య పోరులో ప్రజలు ఎటు వైపు మొగ్గు చూపుతున్నారో తేలిపోయింది’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆది వారం నాడు కోల్ కతాలోని బ్రిగేడి పరేడ్ గ్రౌండ్ లో గర్జించినప్పుడు లక్షలాది ప్రజలు హర్షధ్వానాలు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత మోదీ పాల్గొన్న తొలి ప్రచార సభకు పెద్ద ఎత్తున వచ్చిన జన స్పందనే పశ్చిమ బెంగాల్ లో ఏం జరుగబోతున్నదో చెప్పడానికి నిదర్శనం. ఇప్పటివరకూ జరిగిన అనేక అంతర్గత సర్వేలు కూడా బెంగాల్ లో భారతీయ జనతా పార్టీ అత్యదిక సీట్ల మెజారిటీతో అధికారంలోకి వస్తుందని తేల్చాయి. ఇందుకు ప్రధాన కారణం తృణమూల్ కాంగ్రెస్ సర్కార్ అవినీతి, అరాచకపాలనకు వ్యతిరేకంగా వీస్తున్న ప్రజాప్రభంజనం కాగా, బెంగాల్ లో అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీకే పగ్గాలు అప్పచెప్పాలనే ఆకాంక్ష ప్రజల్లో అంతటా వ్యక్తం కావడం.


పశ్చిమ బెంగాల్ ను 34సంవత్సరాల పాటు ఏలిన వామపక్ష ప్రభుత్వ పాలనను నిర్మూలించి తృణమూల్ కాంగ్రెస్ ను ప్రజలు గెలిపించినప్పుడు అక్కడ భిన్నమైన పాలన లభిస్తుందని ప్రజలు ఆశించారు. కాని మమత హయాంలో అంతకంటే హీనమైన పాలన లభిస్తుందని వారు ఊహించలేదు. రాష్ట్రంలో భయోత్పాతం కల్పించి,రక్తపాతాలు సృష్టించి, అవినీతిని విచ్చలవడిగా అమలు చేసి, దౌర్జన్యంగా అధికారం చలాయించిన వామపక్షాల కంటే మమత రెండాకులు ఎక్కువే చదివారు. ఎవరికీజవాబు చెప్పనవసరంలేని నియంతృత్వ పాలనను అందించిన మమతా బెనర్జీ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్నీ కుప్పకూల్చారు.


ఈ పదేళ్లలో ఒకటి కాదు, రెండు కాదు అనేక కుంభకోణాలు, అరాచకాలు జరిగాయి. 2019లో నారదా న్యూస్ జరిపిన స్టింగ్ ఆపరేషన్ లో ఒక నకిలీ కంపెనీ నుంచి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుంటూ 11 మంది మంత్రులతో పాటు అనేకమంది తృణమూల్ కాంగ్రెస్ నేతలు పట్టుబడ్డారు. చిట్ ఫండ్, డిపాజిట్లు, మైక్రో క్రెడిట్ పేరుతో రు.40 వేల కోట్లకు పైగా ప్రజలను మోసం చేసిన శారదా గ్రూప్, రోజ్ వ్యాలీ గ్రూప్ సంస్థలతో తృణమూల్ కాంగ్రెస్ నేతలకు ప్రత్యక్ష సంబంధాలున్నాయని తేలింది. వీరే కాదు, రియల్ ఎస్టేట్ మాఫియా, మద్యం మాఫియా, కాంట్రాక్టర్ల మాఫియాతో తృణమూల్ కాంగ్రెస్ నేతలు కుమ్మక్కై నందువల్లే కోట్లాది రూపాయలు ఆర్జించారని, వాటినే ఎన్నికల్లో పెట్టుబడి పెట్టి విజయం సాధించారని పశ్చిమబెంగాల్ రాజకీయాలు లోతుగా పరిశీలించినవారికెవరికైనా అర్థమవుతుంది, మమతా బెనర్జీ కాలంలో తృణమూల్ ప్రభుత్వం ఉపాధికల్పనకు దోహదంచేసే ఎటువంటి ప్రాజెక్టులను చేపట్టలేదు. నిరుద్యోగ యువకులకోసం యూత్ క్లబ్బులనుఏర్పాటు చేసి బలవంతంగా చందాలను వసూలుచేసేందుకు ప్రోత్సహించడంతప్ప ఆమె చేసిందేమీ లేదు. తన ఓటు బ్యాంకును పెంచుకోవడం, ముస్లిం మతస్థులను బుజ్జగించడం ఆమె పాలనలో ప్రధానాంశం. తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వందలాది మత ఘర్షణలు జరిగాయి. ఆటో, టాక్సీయూనియన్లకు పూర్తిస్వేచ్ఛ ఇవ్వడంవల్ల వారు ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసినా, ప్రయాణీకులను దోపిడీ చేసినా అడిగేవారు లేరు. వీధుల్లో సరుకులు అమ్మేవారికి లైసెన్సులు ఇచ్చి వారు రహదారులను ఆక్రమించినా పట్టించుకునేవారు లేరు. ఆఖరుకు 2019లో ఆంఫన్ తుఫానుకు గురైన ప్రజలకు ఇచ్చే నష్టపరిహారం పంపిణీ లో కూడా తృణమూల్ కాంగ్రెస్ నేతలు కోట్లాది రూపాయలు ముడుపులు స్వీకరించారని తేలింది. అన్నిటికన్నా దారుణమేమంటే చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులు, పేద ప్రజలకు అమలు చేసే సామాజిక సంక్షేమ పథకాలకు మంజూరైన మొత్తం లో కూడా తృణమూల్ కాంగ్రెస్ నేతలు కమిషన్ల పేరుతో డబ్బులు వసూలు చేశారు. ప్రభుత్వం నిర్మించే ఇళ్లు దక్కాలన్నా, శౌచాలయాలను నిర్మించాలన్నా తృణమూల్ నేతలకు ముడుపులు చెల్లించాల్సిన ఘోరపరిస్థితి పశ్చిమ బెంగాల్ లో నెలకొంది.మొత్తం సామాజిక సంక్షేమ పథకాలకు మంజూరైన మొత్తంలో పార్టీకి 20 నుంచి 40 శాతం మేరకు చేరుతుందని అంచనా. ఈ వసూళ్లలో మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కీలక పాత్ర పోషిస్తున్నారు, బెంగాల్ లో ఎవర్ని అడిగినా ఈ బువా-భతీజా (అత్త-అల్లుడు) అక్రమాల గురించి చెబుతారు.


అంతేకాదు, పశ్చిమబెంగాల్ లో దిగజారినంతగా శాంతి భద్రతల పరిస్థితి మరే రాష్ట్రంలో దిగజారలేదు. ప్రజలు పగటి పూట కూడా సురక్షితంగా తిరగలేని పరిస్థితి అక్కడ నెలకొంది. బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా కారుపై దాడులు జరగడం మాత్రమే కాదు, మమతా బెనర్జీ మంత్రివర్గంలో కార్మిక మంత్రిపై కూడా రైల్వేస్టేషన్ లో బాంబుదాడి జరిగింది. రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధనకర్ అనేక సార్లు కేంద్రానికి ఈ విషయంలో నివేదికలు పంపారు. ఉగ్రవాదులకు బెంగాల్ నిలయమైందని ఆయన పేర్కొన్నారు, చివరకు కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదురి కూడా పశ్చిమ బెంగాల్ లో ఏ ఒక్క వ్యక్తీ సురక్షితంగా జీవించలేని పరిస్థితి నెలకొన్నదని, ఎన్ ఐ ఏ సంస్థతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు, ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలకే భద్రత లేని పరిస్థితి ఏర్పడింది. బిజెపికి మద్దతు పలికినందుకు ఇటీవల ఒక 85 ఏళ్ల మహిళపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి పిడిగుద్దుల వర్షం కురిపించారు. విచిత్రమేమంటే బిజెపి అధ్యక్షుడి కాన్వాయ్ పై దాడి చేసిన వారెవరో ఇంతవరకూ తేల్చకపోగా, ఆయన భద్రతకు బాధ్యత వహించాల్సిన ముగ్గురు ఐపిఎస్ అధికారులను కేంద్రానికి బదిలీ చేస్తే వారిని రిలీవ్ చేయడానికి మమతా బెనర్జీ నిరాకరించారు. అంతకు ముందు వివిధ చిట్ ఫండ్ మోసాల పై కోల్ కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను విచారించేందుకు సిబిఐ టీమ్ వెళితే వారిని పోలీసులు అడ్డుకోవడమే కాక స్వయంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ధర్నాకు దిగారు. అవినీతిపరులను కాపాడేందుకు మమతా బెనర్జీ ఎంతకైనా దిగజారతారని దీనితో అర్థమైంది.


ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉంటే ఆ ప్రాంత ప్రజల అస్తిత్వం, సంస్కృతి, ప్రయోజనాలు కాపాడతాయని, ఇతర రాష్ట్రాలతో పోటీపడి అహర్నిశలు అభివృద్ధికి పాటుపడతాయని, ప్రజలకు పారదర్శక పాలన అందిస్తాయని చాలా మంది భావిస్తారు. ఎన్నికల ముందు ఇదే ప్రాంతీయ అస్తిత్వ ప్రచారంతో నేతలు పాల్గొని జాతీయ పార్టీలను దెబ్బతీయాలని ప్రయత్నిస్తారు. జాతీయ పార్టీలకు స్థానికుల మనోభావాలు తెలియని దుష్ప్రచారం చేస్తారు. మైనారిటీలను బుజ్జగించి వారిని సంఘటితం చేసి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడతారు. ప్రజల సొమ్మును ప్రజలకే పంచిపెట్టి ఖజానాను కొల్లగొట్టి, ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చి పబ్బం గడుపుకుంటారు. ఇవాళ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ ప్రభుత్వ పాలన చూసినా అరాచకత్వం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, కుటుంబ సభ్యులకు, బంధువులకు పెద్ద పీట, కుల రాజకీయాలు స్పష్టంగాకనిపిస్తాయి. దోచుకోవడమే పరమార్థంగా ఈ నేతలు పనిచేస్తారు. పశ్చిమబెంగాల్ లో ఈ పరిస్థితి పరాకాష్టకు చేరుకుంది. నరేంద్ర మోదీ ముందు ఇక ఆ రోజులకే కాదు, ప్రాంతీయ పార్టీల ఆటలకే కాలం చెల్లింది.


భారతీయ జనతా పార్టీ ఒక ప్రాంతానికి పరిమితమైన పార్టీ కాదు. ఈ దేశ మనోభావాలకు, సంస్కృతికి ప్రతిబింబం. ప్రాంతీయ ప్రయోజనాలను, జాతీయ దృష్టిని మేళవించి చూడగల ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. సంకుచిత ప్రయోజనాలకోసం, వ్యక్తిగత లాభాల కోసం పనిచేయని పార్టీ ఏదైనా ఉంటే అది బిజెపి అని చెప్పక తప్పదు.అందుకే పశ్చిమబెంగాల్ లో తాజా పవనాలు వీస్తున్నాయి. మమతాబెనర్జీ అవినీతికి, నియంతృత్వ పాలనకు విసిగిపోయిన తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన హేమాహేమీలు కూడా బిజెపికి లభిస్తున్న జనాదరణను చూసి కాషాయ ధ్వజం నీడకు చేరుకుంటున్నారు. హబీబ్ పూర్ నియోజకవర్గానికి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికైన సరళా ముర్ము పార్టీకి రాజీనామా చేసి 18 మందినేతలతో కలిసి తాజాగా బిజెపిలో చేరడం జరగబోయే పరిణామాలకు సూచిక. బిజెపి నేతలు ఎక్కడకు వెళ్లినా అక్కడ ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా యాత్రల్లో వేలాది మంది పాల్గొన్నారు. వృద్ధుల నుంచి పిల్లల వరకు అక్కడ కాషాయ ధ్వజాన్ని రెపరెపలాడిస్తున్నారు. బెంగాల్ కమలం గుబాళింపులు ఎల్లెడలా ప్రసరించేందుకు సమయం ఎంతో దూరంలో లేదు.


వై. సత్యకుమార్

(బిజెపి జాతీయ కార్యదర్శి)

Updated Date - 2021-03-09T06:59:45+05:30 IST