సరి‘హదు’్ద దాటినా అంతే!

ABN , First Publish Date - 2021-08-13T05:02:19+05:30 IST

‘మద్యం, సారా అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతాం. కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నాం. ఇందుకు ప్రత్యేకంగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోను నియమించాం...’ అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రకటనలివి. కానీ ఎక్కడా సారా, మద్యం అక్రమ రవాణా, అమ్మకాలు అదుపులోకి వచ్చిన దాఖలాలు లేవు. జిల్లాలో ఏదో చోట నిత్యం మద్యం, సారా పట్టుబడుతూనే ఉన్నాయి. అంతర్‌ రాష్ట్ర రహదారులపై చెక్‌పోస్టులు ఏర్పాటుచేసినా నామమాత్రపు తనిఖీలకే పరిమితమవుతున్నాయన్న అపవాదు ఉంది. పట్టుకునేది తక్కువ..ఆర్భాటం ఎక్కువ అన్న విమర్శలను ఎస్‌ఈబీ ఎదుర్కొంటోంది.

సరి‘హదు’్ద దాటినా అంతే!
సీతంపేట : పోలీసులు స్వాధీనం చేసుకున్న సారా నిల్వలు

జోరుగా మద్యం, సారా అక్రమ రవాణా

యథేచ్ఛగా ఒడిశా సరుకు దిగుమతి

నియంత్రించలేని స్థితిలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో

పట్టుబడింది తక్కువ..ఆర్భాటం ఎక్కువ

(ఇచ్ఛాపురం రూరల్‌)

‘మద్యం, సారా అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతాం. కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నాం. ఇందుకు ప్రత్యేకంగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోను నియమించాం...’ అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రకటనలివి. కానీ ఎక్కడా సారా, మద్యం అక్రమ రవాణా, అమ్మకాలు అదుపులోకి వచ్చిన దాఖలాలు లేవు. జిల్లాలో ఏదో చోట నిత్యం మద్యం, సారా పట్టుబడుతూనే ఉన్నాయి. అంతర్‌ రాష్ట్ర రహదారులపై చెక్‌పోస్టులు ఏర్పాటుచేసినా నామమాత్రపు తనిఖీలకే పరిమితమవుతున్నాయన్న అపవాదు ఉంది. పట్టుకునేది తక్కువ..ఆర్భాటం ఎక్కువ అన్న విమర్శలను ఎస్‌ఈబీ ఎదుర్కొంటోంది. 

--------------------------

జిల్లాలో మద్యం, సారా అక్రమ రవాణా నియంత్రణలోకి రావడం లేదు. ప్రధానంగా ఒడిశా నుంచి జిల్లాకు యథేచ్ఛగా దిగుమతి అవుతోంది. రోజూ లక్షలాది రూపాయల సరుకును జిల్లాకు చేర్చుతున్నారు. ఇక్కడ అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. సారా విషయం చెప్పనవసరం లేదు. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా విక్రయాలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఇచ్ఛాపురం, కంచిలి, సోంపేట, మందస, మెళియాపుట్టి, పాతపట్నం, హిరమండలం, కొత్తూరు, భామిని, సీతంపేట మండలాల్లో సారా జోరు అధికంగా ఉంది. కేవలం సారా, మద్యం, గంజాయి, ఇసుక అక్రమ రవాణాను నియంత్రించేందుకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోను ప్రభుత్వం నియమించింది. నిత్యం నిఘా, దాడులు చేయడం, కేసులు నమోదు చేయడం వీరి ప్రధాన విధి. కానీ ఎస్‌ఈబీ ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో మద్యం షాపుల నిర్వహణ, అక్రమ రవాణా, విక్రయాల నియంత్రణ బాధ్యతలన్నీ ఎక్సైజ్‌ శాఖ చూసుకునేది. పని ఒత్తిడితో మద్యం, సారా రవాణా, తయారీ నియంత్రణలోకి రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోను నియమించింది. ఎక్సైజ్‌ శాఖ నుంచి 70 శాతం  అధికారులు, సిబ్బందిని అబ్కారీ శాఖకు బదలాయించారు. ప్రస్తుతం జిల్లాలో ఎస్‌బీకి 14 కార్యాలయాలు ఉన్నాయి. అంతర్‌ రాష్ట్ర, జిల్లా రహదారులపై 27 చెక్‌పోస్టులను ఏర్పాటుచేశారు. 5 మొబైల్‌ వాహనాలను సమకూర్చారు. జిల్లాలో ఇన్‌స్పెక్టర్లు 18 మంది, ఎస్‌ఐలు 22 మంది, ఏఎస్‌ఐ ఒకరు, ఈఎస్‌ఐ ఒకరు ఉన్నారు.  వందలాది మంది సిబ్బంది పని చేస్తున్నారు. అడిషల్‌ ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తున్నారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోను నియమించిన నాటి నుంచి ఇప్పటివరకూ 7,710 కేసులు నమోదు చేశారు. 8,572 మందిని ఆరెస్టు చేసి..2,937 వాహనాలను సీజ్‌ చేశారు. ఇసుకకు సంబంధించి 949 కేసులు నమోదు చేశారు. ఇందులో 1,668 మందిని అరెస్టు చేసి 1,151 వాహనాలు సీజ్‌ చేశారు. 18,48,800 మెట్రిక్‌ టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. 


 చెక్‌పోస్టులు ఉన్నా..

ఇచ్ఛాపురం, మందస మండలం కిల్లోయి, మెళియాపుట్టి మండలం వసుంధర, రంపఖానా, పట్టుపురం, పాతపట్నం, కొత్తూరు మండలం మాతల, భామిని మండలం బత్తిలిలో అంతర్‌ రాష్ట్ర చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అంతర్‌ జిల్లా రహదారులతో కలిపి 27 చెక్‌పోస్టుల్లో నిత్యం తనిఖీలు జరుగుతున్నాయి. తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో అక్కడ మాజీ సైనికులను నియమించారు. అడపాదడపా మద్యం, సారా, గుట్కా, ఖైనీలు భారీ స్థాయిలో పట్టుబడుతున్నాయి. దొరికిన వాడు దొంగ..లేకపోతే దొర అన్నచందగా ఒక వాహనం తనిఖీ చేసేలోపు...సరుకుతో ఉన్న వాహనాలు వెళ్లిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఒడిశా మద్యం, సారా విక్రయాలే ఇందుకు ఉదాహరణ. మొబైల్‌ వాహనాల్లో సిబ్బంది చేతవాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చాలామంది వ్యాపారులు, వాహనదారులతో కుమ్మక్కవుతున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఎస్‌ఈబీ ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరముంది. 


విస్తృత దాడులు

జిల్లా వ్యాప్తంగా దాడులు విస్తృతంగా చేస్తున్నాం. మద్యం, సారా అక్రమ రవాణాపై నిఘా పెంచాం. అంతర్‌ రాష్ట్ర సరిహద్దులు, చెక్‌ పోస్టుల్లో తనిఖీలు ముమ్మరం చేశాం. పట్టుబడితే కేసులు నమోదు చేస్తున్నాం. కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నాం.

- శ్రీనివాసరావు, ఎస్‌ఈబీ ఏఎస్‌పీ, శ్రీకాకుళం


 సారా నిషేధానికి చర్యలు :  పాలకొండ డీఎస్పీ శ్రావణి

సీతంపేట, ఆగస్టు 12 : సారా నిషేధానికి చర్యలు తీసుకుంటామని పాలకొండ డీఎస్పీ శ్రావణి తెలిపారు. గురువారం మండ పంచాయతీ పరిధిలోని నారాయణగూడలో గిరిజనులకు సారా వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. గ్రామస్థులు స్వచ్ఛందంగా సారా అమ్మకాలను నిషేధించాలని కోరారు. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా, సారా తయారీపైనే ఆధారపడి జీవించడం సరికాదని తెలిపారు.  సారా విక్రయించినా, వండినా   కఠిన చర్యలు తప్పవని డీఎస్సీ హెచ్చరించారు. మార్పు రాకపోతే దశల వారీగా ప్రభుత్వ పఽథకాలను నిలిపివేస్తామని,  వాహనాలను సీజ్‌ చేస్తామని తెలిపారు. బుడగరాయి ఆశ్రమ పాఠశాల ఆవరణలో ఐటీడీఏ పీవో ఆధ్వర్యంలో శుక్రవారం జరిగే ప్రేరణ సమావేశానికి అందరూ హాజరు కావాలని కోరారు. గురువారం చేపట్టిన దాడుల్లో మండ గ్రామంలో 100 లీటర్ల సారా, 600 కిలోల బెల్లం, నారాయణగూడలో 90 లీటర్ల సారా, 540 కిలోల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సీఐ ఎస్‌.విజయకుమార్‌, సీతంపేట ఎస్‌ఐ ప్రభావతి, ఎం.శేఖర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-13T05:02:19+05:30 IST