ఆనందాల జట్టుగా...

ABN , First Publish Date - 2021-02-10T07:31:36+05:30 IST

ప్రతి బంధం నమ్మకంతోనే మొదలవుతుంది. అయితే నవ్వుతూ, గొడవలు పడుతూ, తప్పదు కాబట్టి కలిసి ఉండేవాళ్లు కొందరు. ఏ బంధమైనా కలకాలం నిలవాలంటే వారి మధ్య సంతోషాలు హరివిల్లులా నిలిచి ఉండాలి...

ఆనందాల జట్టుగా...

ప్రతి బంధం నమ్మకంతోనే మొదలవుతుంది. అయితే నవ్వుతూ, గొడవలు పడుతూ, తప్పదు కాబట్టి కలిసి ఉండేవాళ్లు కొందరు. ఏ బంధమైనా కలకాలం నిలవాలంటే వారి మధ్య సంతోషాలు హరివిల్లులా నిలిచి ఉండాలి. అప్పుడే వారి అనుబంధం  అన్యోన్యంగా ఉంటుంది. మీ బంధాన్ని ఆనందాల నిలయంగా మలచుకునేందుకు ఏం చేయాలో చెబుతున్నారు లవ్‌గురూలు. అవేమిటంటే... 


స్వీయ గుర్తింపు: జంటల్లో చాలామంది తమ అవసరాలు, పనుల కోసం భాగస్వామి మీద ఆధారపడుతూ ఉంటారు. క్రమంగా తమ గుర్తింపు కోల్పోతారు. అటువంటి బంధాలు తొందర్లోనే ముగిసిపోతాయి. ఎందుకంటే ప్రతిదానికి ఒకరిపై పూర్తిగా ఆధారపడడం అనేది వారి అనుబంధంలో తగవులకు దారితీస్తుంది. అయితే నిజమైన, ఆనందమైన బంధం మీ నైపుణ్యాలను తెలుసుకునేలా చేసి మీకంటూ ఒక గుర్తింపు వచ్చేందుకు తోడ్పడుతుంది.

భయాలను పంచుకోవడం: తమ భయాలను, బలహీనతలను భాగస్వామితో పంచుకునేందుకు చాలామంది సందేహిస్తుంటారు. అలాంటివి చెబితే ఎక్కడ తమను తప్పుగా అర్ధం చేసుకుంటారోననే భయం ఒక కారణం. అయితే ఏ ప్రేమ పక్షులైతే ఒకరి గురించి మరొకరు పూర్తిగా తెలుసుకుంటారో వారి మధ్య నమ్మకం బలపడుతుంది.  

అనిశ్చితికి తావు లేకపోవడం: ఆనందంగా ఉండే జంటలు తమ మధ్య అనిశ్చితికి తావివ్వవు. ఇద్దరూ ఏ విషయాన్నైనా ధైర్యంగా చెప్పుకొంటారు. తమ గురించి భాగస్వామికి తెలియజేయడానికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు.  తాము చేయబోయే పనులను ముందే చెబుతారు. అలా ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటారు.

వాగ్దానాలను నిలబెట్టుకోవడం: ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం అవతలి వారిని గౌరవించడం లాంటిది. ఆనందంగా ఉండే వాళ్లు తమ భాగస్వామికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. వారికి వాగ్దానం విలువ తెలుసు. దాంతో తమ అనుబంధం చెక్కు చెదరకుండా చూసుకుంటారు. 

నిజాయతీ ముఖ్యం: ఇద్దరి మధ్య గొడవలు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి. అపార్థాలు, అభిప్రాయ బేధాలను సర్ది చెప్పుకొనేందుకు నిజాయతీగా ఉండడం, మాట్లాడుకోవడమే ఉత్తమమని గ్రహించాలి. అప్పుడే గొడవలు సద్దుమణిగి సంతోషాలు విరబూస్తాయి.

Updated Date - 2021-02-10T07:31:36+05:30 IST