ప్రేమ పెళ్లి చేసుకున్న నెలకే.. భర్త ఫోన్ నెంబర్‌ను బ్లాక్ చేసి మరీ భార్య అదృశ్యం.. అసలు కథేంటో తెలిసి నివ్వెరపోయిన భర్త..!

ABN , First Publish Date - 2022-01-07T20:51:12+05:30 IST

ఆ యువతి వయసు 20 ఏళ్లు. ఇన్‌స్టాగ్రాంలో ఓ వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే కొద్దిరోజులకు ప్రేమగా మారింది

ప్రేమ పెళ్లి చేసుకున్న నెలకే.. భర్త ఫోన్ నెంబర్‌ను బ్లాక్ చేసి మరీ భార్య అదృశ్యం.. అసలు కథేంటో తెలిసి నివ్వెరపోయిన భర్త..!

లక్నో: ఆ యువతి వయసు 20 ఏళ్లు. ఇన్‌స్టాగ్రాంలో ఓ వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే కొద్దిరోజులకు ప్రేమగా మారింది. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయిన నెలకే భర్త ఫోన్ నెంబర్‌ను బ్లాక్ చేసి మరీ భార్య అదృశ్యమైంది. భార్య కనిపించకుండా పోవడం వెనుక ఉన్న అసలు కథేంటో తెలిసి ఆ భర్త నివ్వెరపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే..


మీరట్‌లోని కంకర్‌ఖేద ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువతికి మావన ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో ఇన్‌స్టాగ్రాం ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే ప్రేమగా మారింది. యువకుడు ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసేవాడు. ఈ క్రమంలోనే ఆరునెలల తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలకు తమ అభిప్రాయాన్ని చెప్పారు. యువతి ఇంట్లో కుటుంబసభ్యులు మొదట్లో ఒప్పుకోకపోగా.. ఆ తర్వాత వారి పెళ్లికి అంగీకరించారు. రెండు నెలల క్రితం పెద్దల సమక్షంలో వారి పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లైన నెల రోజుల వరకు ఆ కొత్త దంపతులు బాగానే ఉన్నారు. ఆ తర్వాత మా వాళ్లను చూడాలనిపిస్తోందంటూ పుట్టింటికి వెళ్లిపోయింది. 


పుట్టింటికి వెళ్లిన రెండ్రోజుల్లోనే ఆ నవ వధువు తన భర్తకు ఓ మెసేజ్ పెట్టింది. ‘నేను నిన్ను ప్రేమించకముందు మరో వ్యక్తిని ప్రేమించాను. అతడిని మర్చిపోలేకపోతున్నాను. మీ ఇద్దరిలో అతడిదే నిజమైన ప్రేమ అని నాకు అనిపిస్తోంది. ఇకపై అతడితోనే ఉండాలనుకుంటున్నాను..’ అంటూ ఆ యువతి తన భర్తకు మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్‌ను చూసిన భర్త నివ్వెరపోయాడు. వెంటనే ఫోన్ చేశాడు. కానీ అస్సలు కనెక్ట్ అవలేదు. తన ఫోన్ నెంబర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టిందని గ్రహించిన ఆ భర్త నేరుగా అత్తారింటికి వెళ్లాడు. జరిగింది చెప్పాడు. అయితే అప్పటికే ఆ యువతి పుట్టింట్లోంచి కూడా వెళ్లిపోయి మొదటి ప్రియుడి వద్దకు చేరుకుంది. ఆమె ఘజియాబాద్‌లో మొదటి ప్రియుడితో కలిసి ఉంటోందని ఆ భర్తకు తెలిసింది. అక్కడకు వెళ్లి భార్యను నిలదీశాడు. ‘ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలేయకపోతే నీపై అత్యాచారం కేసు పెడతాను’ అని కట్టుకున్న భార్యే బెదిరించడంతో ఆ భర్త అక్కడి నుంచి వెనుతిరిగాడు. ఈ వ్యవహారం గురించి.. తనకు జరిగిన అన్యాయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-01-07T20:51:12+05:30 IST