Sep 25 2021 @ 01:03AM

వచ్చే ఏడాది శేఖర్‌ కమ్ములతో ఇదే కలయికలో మరో సినిమా... -సునీల్‌ నారంగ్‌

‘‘ఇవాళ ‘లవ్‌ స్టోరి’ విజయం గురించి ప్రేక్షకులే మాట్లాడుతున్నారు. మేం మాట్లాడాల్సింది ఏమీ లేదు. ఇదే కలయికలో శేఖర్‌ కమ్ములతో వచ్చే ఏడాది మరో సినిమా చేయాలనుకుంటున్నాం’’ అని సునీల్‌ నారంగ్‌ అన్నారు. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్‌, పి. రామ్మోహన్‌ రావు నిర్మించిన ‘లవ్‌ స్టోరి’ శుక్రవారం విడుదలైంది. ప్రేక్షకుల స్పందన, విజయం మాటలకు అందని సంతోషాన్నిచ్చిందని విజయోత్సవ కార్యక్రమంలో చిత్రబృందం తెలియజేసింది. ‘‘నిర్భయ ఘటన తర్వాత సమాజానికి మంచి చెప్పే చిత్రం చేయాలనుకున్నా.


సినిమా చూసి ఓ ఆడపిల్ల తన ఇబ్బందులను చెప్పుకోగలిగే ధైర్యం తెచ్చుకుంటే... వర్ణవివక్షకు గురైన అబ్బాయి తన కథగా ఫీలైతే... ఇంకా పెద్ద విజయం సాధించినట్టు భావిస్తా. నా సినిమాలపై నమ్మకంతో థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అని దర్శకుడు శేఖర్‌ కమ్ముల తెలిపారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులెంతవరకూ వస్తారని విడుదలకు ముందు భయపడ్డా. థియేటర్లలో జనాలను చూశాక సంతోషమేసింది. శేఖర్‌ కమ్ముల ప్రస్తావించిన సమస్యకు కుటుంబ ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతున్నారు. ప్రశంసిస్తున్నారు’’ అని నాగచైతన్య అన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్‌, పి. రామ్మోహన్‌ రావు, సాయి పల్లవి, పవన్‌ సీహెచ్‌ తదితరులు పాల్గొన్నారు.