ప్రేమా? భయమా?

ABN , First Publish Date - 2020-06-24T06:00:50+05:30 IST

ఒకరోజు తోటలో అక్బర్‌, బీర్బల్‌ కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు. ‘‘బీర్బల్‌... నేనంటే ప్రజలకు చాలా ప్రేమ! నువ్వు ఏమంటావు?’’ అన్నాడు అక్బర్‌. ‘‘మీరు చెప్పింది నిజమే ..

ప్రేమా? భయమా?

ఒకరోజు తోటలో అక్బర్‌, బీర్బల్‌ కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు. ‘‘బీర్బల్‌... నేనంటే ప్రజలకు చాలా ప్రేమ! నువ్వు ఏమంటావు?’’ అన్నాడు అక్బర్‌. ‘‘మీరు చెప్పింది నిజమే జహాపనా! కానీ మీరంటే ప్రజలకు భయం కూడా ఉంది’’ అన్నాడు బీర్బల్‌. అందుకు అక్బర్‌ ‘‘నేను నమ్మను’’ అన్నాడు. ‘‘నేను నిరూపిస్తాను’’ అని తన ప్లాన్‌ ఏంటో వివరించాడు బీర్బల్‌. మరుసటి రోజు అక్బర్‌ మహారాజు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘మేము ప్రమాదకరమైన అడవిలో వేటకు బయలుదేరుతున్నాం.


మేము క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తూ రాజకోటలో ఏర్పాటు చేసిన ఒక పెద్ద తొట్టెలో అందరూ ఒక కప్పు పాలు పోయండి’’ అని ఆజ్ఞాపించాడు. మరుసటి రోజు అందరూ రాజు చెప్పినట్టే చేశారు. కోటలోనే ఉన్న రాజు తొట్టె దగ్గరకు వెళ్లి పరిశీలించాడు. అందులో స్వచ్ఛమైన పాలు కాకుండా, నీళ్లు ఎక్కువగా కలిపిన పాలు ఉండడాన్ని గమనించాడు. కొంతమంది నీళ్లు పోయడాన్ని చూశాడు. దాంతో మరుసటి రోజు పాలు పోయడాన్ని స్వయంగా పరిశీలిస్తారని చాటింపు వేయించాడు. అంతే... తొట్టె మొత్తం స్వచ్ఛమైన పాలతో నిండిపోయింది. అప్పుడు బీర్బల్‌ ‘‘మహారాజా! నేను చెప్పాను కదా! మీరు చూస్తారని ప్రకటించగానే అందరూ భయంతో చిక్కని పాలు తెచ్చి పోశారు. మీరంటే భయం కూడా ఉందని నిరూపితమయిందిగా!’’ అని అన్నాడు.

Updated Date - 2020-06-24T06:00:50+05:30 IST