ప్యార్ కరోనా

ABN , First Publish Date - 2020-03-25T07:53:39+05:30 IST

ప్యార్ కరోనా నూటాముప్పై మూడు కోట్ల జనతా ముత్యాల హారం చెల్లాచెదురైన వేళ ఒక్క అదృశ్య వైరస్ ఏదో వచ్చి అందరినీ ఒక్కటి చేసిన చప్పట్ల హోరు ...

ప్యార్ కరోనా

నూటాముప్పై మూడు కోట్ల 

జనతా ముత్యాల హారం 

చెల్లాచెదురైన వేళ

ఒక్క అదృశ్య వైరస్ ఏదో వచ్చి 

అందరినీ ఒక్కటి చేసిన చప్పట్ల హోరు

దేశమే ఒక్కటయ్యిందో 

ఏక తాళమై మారుమ్రోగిందో 

తెల్లవాణ్ణి తరిమికొట్టిన

వందేళ్ళనాటి జాతీయోద్యమ జ్వాల 

కళ్ళ ముందు కదిలినట్లైంది 

ఎంత కాలమైందో 

మనమంతా ఒక నినాదమై 

కుల మతాల గోతాల భేతాళ

ప్రశ్నలు విడిచి

మళ్ళీ పురానవ మానవహారమై కదలడానికి

దేశమంతా ద్వేష ఋతువుగా మారుతున్న వేళ

ఎక్కడికక్కడ నెత్తుటి గొడుగులు పుట్టి 

మనిషికీ మనిషికీ నడుమ 

మృత్యుకుడ్యాలు 

కట్టుకుంటున్న వేళ

ఎక్కడి నుంచి పుట్టిందో 

ఒక్క క్రిమి 

ఇది జీవితం సుమీ! 

అనే పెద్ద గుణపాఠం నేర్పించింది

ఇప్పుడు మాట్లాడుకోడానికి 

ఆ సర్వాంతర్యామి తప్ప 

మరేమీ కనిపించడం లేదు 

వేదాంతాలు వైరాగ్యాలు తప్ప 

సామాన్యుడికి మరో విషయం తలకెక్కడం లేదు

ఇప్పుడు విశ్వ గూండాల్లాంటి 

వీధి రౌడీలకు భయపడాల్సిన

పని లేదని

అణు బాంబులు 

పగలబడి నవ్వుకుంటున్నాయి 

దాచిన ఆయుధాలన్నీ

చిలుం పట్టిన

సమాధుల్లో బావురుమంటున్నాయి

ప్రపంచమే ఒక పుష్పంగా 

మానవత్వమే పరిమళంగా

ప్రతి దేశం

ఒక ఉద్యానవనంగా 

పచ్చగా పది

కాలాలు పరిఢవిల్లాలని

రాబోయే తరాలకు వారసత్వంగా 

ఇచ్చి పోదామనుకుంటున్న వేళ 

ఎక్కడిదో అమూర్త వైరస్

ఎంత నిర్దయగా వినిపించింది మృత్యు కోరస్

మనల్ని ద్వేషించే వాళ్ళను

మనం ప్రేమించలేకపోతే 

మనమే ద్వేష

దేవతకి బలైపోతామేమో

రండి!

శుభ్రంగా చేతులు కడుక్కుందాం 

తలా ఒక గులాబీ చేత పట్టి 

మనల్ని మొదటి సారి మనుషుల్ని చేసిన

ఆ మహమ్మారి ముందు 

ప్యార్ కరోనా అంటూ 

మోకరిల్లుదాం.

ఎండ్లూరి సుధాకర్

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం

Updated Date - 2020-03-25T07:53:39+05:30 IST