ప్రియురాలి నానమ్మ బంగారానికి ఎసరు

ABN , First Publish Date - 2020-11-05T13:45:21+05:30 IST

ప్రియురాలిని మాయమాటలతో నమ్మించి

ప్రియురాలి నానమ్మ బంగారానికి ఎసరు

 ప్రేమ పేరుతో ఓ యువకుడి మోసం


హైదరాబాద్/నేరేడ్‌మెట్‌ : ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేందుకు ప్రేమించిన యువతిని పావులా వాడుకున్నాడు. నానమ్మ ఇంట్లోనే చోరీ చేసేలా ఆమెను ప్రోత్సహించాడు. నాన్నమ్మ (80)కు చెందిన 18 తులాల బంగారాన్ని తస్కరించాడు. పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. రాచకొండ డీసీపీ రక్షితామూర్తి మీడియాకు వివరాలు వెల్లడించారు. నేరేడ్‌మెట్‌ కేశవనగర్‌లో నివసించే పార్శ అజయ్‌(24) డీజేగా పనిచేస్తుంటాడు. లాక్‌డౌన్‌ సమయంలో తలెత్తిన ఆర్థిక ఇబ్బందులకు తోడు జల్సా జీవితానికి అలవాటు పడ్డ అజయ్‌ మద్యం, గంజాయికి బానిసయ్యాడు. బొటిక్‌ నడుపుతున్న ఓ యువతి(21)తో రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. ప్రియురాలిని మాయమాటలతో నమ్మించి ఆమె మెడలోని బంగారు గొలుసును విక్రయించగా వచ్చిన సొమ్ముతో కొన్నాళ్లు గడిపాడు. మళ్లీ డబ్బులు కావాలని కోరడంతో తనవద్ద లేవని చెప్పింది.


డిఫెన్స్‌ కాలనీలో నివసించే తన నానమ్మ వద్ద బంగారు నగలు చాలా ఉన్నాయని ఒకసారి చెప్పిన విషయాన్ని గుర్తు చేశాడు. ఎలాగైనా సదరు బంగారాన్ని తనకు తెచ్చి ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. ఈ నేపథ్యంలో గత నెల 31న నానమ్మ ఇంటికి వెళ్లిన యువతి బామ్మతో సరదాగా గడిపింది. ఆమె బాగోగులు చూస్తున్నట్లు నటిస్తూ అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఉన్న నగలను మూటగట్టి ఇంటి బయట వేచి ఉన్న ప్రియుడికి అప్పగించింది. ఏమీ ఎరగనట్లు ఆ యువతి ఈనెల ఒకటవ తేదీ మధ్యాహ్నం తన ఇంటికి వెళ్లిపోయింది. ఈనెల 2వ తేదీన చోరీ జరిగిన విషయాన్ని తెలుసుకున్న వృద్ధురాలు తన కొడుకు సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రేమికుల గుట్టు రట్టు చేశారు. అజయ్‌తో పాటు అతని ప్రియురాలిపై కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. దాదాపు రూ.7.20లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసును మూడు రోజుల్లోనే ఛేదించిన సీఐ నరసింహ స్వామి, డీఐ పాండురంగారెడ్డిలను ఏసీపీ శివకుమార్‌, డీసీపీ రక్షితా మూర్తి అభినందించారు.

Updated Date - 2020-11-05T13:45:21+05:30 IST