కారు చౌక ఎలక్ట్రిక్ వెహికిల్ ఛార్జ్ పాయింట్లు త్వరలో అందుబాటులోకి!

ABN , First Publish Date - 2021-05-13T00:22:05+05:30 IST

ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఆటోరిక్షాలకు అవసరమైన ఛార్జ్ పాయింట్లు

కారు చౌక ఎలక్ట్రిక్ వెహికిల్ ఛార్జ్ పాయింట్లు త్వరలో అందుబాటులోకి!

న్యూఢిల్లీ : ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఆటోరిక్షాలకు అవసరమైన ఛార్జ్ పాయింట్లు అతి తక్కువ ధరకు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయని భారత ప్రభుత్వ ప్రధాన సైంటిఫిక్ అడ్వయిజర్ కార్యాలయం తెలిపింది. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ ద్వి చక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలకు త్వరలో ఈ ప్రయోజనం లభించబోతోంది. 


తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ వెహికిల్ ఛార్జ్ పాయింట్ల వల్ల ఈ-స్కూటర్లు, ఈ-ఆటో రిక్షాల వాడకం మన దేశంలో పెరుగుతుందని ఈ ప్రకటన పేర్కొంది.  మన దేశానికి ఎలక్ట్రిక్ వెహికిల్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చాలా అవసరమని, రాబోతున్న ఇండియన్ స్టాండర్డ్ వీటి తయారీని వేగవంతం చేస్తుందని తెలిపింది. 


ప్రయాణాల్లో పెను మార్పులు తేవడమే లక్ష్యంగా కృషి జరుగుతున్నట్లు తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం కోసం  ప్రారంభించిన పరివర్తనాత్మక స్వేచ్ఛా సంచారం (ట్రాన్స్‌ఫర్మేటివ్ మొబిలిటీ) లక్ష్యాలు వాతావరణంలోకి కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, గాలి నాణ్యతను మెరుగుపరచడం, క్రూడాయిల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమని వివరించింది. భారత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి, డిమాండ్‌లను పెంచడం కోసం నీతీ ఆయోగ్ (పరివర్తక స్వేచ్ఛా సంచారం, బ్యాటరీ స్టోరేజ్ కార్యక్రమం) ద్వారా అనేక చర్యలు చేపట్టినట్లు తెలిపింది. అంతేకాకుండా FAME-2 (హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల సత్వర తయారీ, వాడకం పథకం) ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు తెలిపింది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగదారులు వాడటం పెరగాలంటే ఛార్జింగ్ సదుపాయాలు తేలికగా అందుబాటులోకి రావలసి ఉందని పేర్కొంది. 


ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు త్వరగా ప్రజాదరణ పొందుతాయని భావిస్తున్నట్లు తెలిపింది. 2025నాటికి ఏటా 40 లక్షల వాహనాలు అమ్ముడుపోతాయని అంచనా వేసినట్లు తెలిపింది. 2030నాటికి ఈ సంఖ్య ఒక కోటికి పెరుగుతుందని అంచనా వేసినట్లు పేర్కొంది. 


Updated Date - 2021-05-13T00:22:05+05:30 IST