దిండుతో కండరాలకు...

ABN , First Publish Date - 2020-05-21T05:30:00+05:30 IST

కసరత్తులు చేయాలంటే జిమ్‌ పరికరాలే ఉండనక్కర్లేదు. దిండు లేదా బాగా బరువున్న పుస్తకాన్నో ఉపయోగించి కండరాలను దృఢంగా చేసుకోవచ్చు. అలాంటి వర్కవుటే ఇది...

దిండుతో కండరాలకు...

కసరత్తులు చేయాలంటే జిమ్‌ పరికరాలే ఉండనక్కర్లేదు. దిండు లేదా బాగా బరువున్న పుస్తకాన్నో ఉపయోగించి కండరాలను దృఢంగా చేసుకోవచ్చు. అలాంటి వర్కవుటే ఇది. 


నడుము పైభాగానికి..: వెల్లకిలా పడుకోండి. కాళ్లను 45 డిగ్రీల కోణంలో మడిచి, పాదాలు పూర్తిగా నేలకు ఆనించండి. దిండు లేదా పుస్తకాన్ని పట్టుకొని, రెండు చేతులనూ పైకి చాచండి. అలాగే నడుము పై భాగాన్ని పైకి లేపుతూ, కూర్చోండి. అంటే ఏ సపోర్టూ లేకుండా లేవాలన్నమాట. ఇప్పుడు కాళ్లను పూర్తిగా దగ్గరకు మడిచి, గదవను మోకాళ్లకు ఆనించే ప్రయత్నం చేయండి. చేతులు నేలకు సమాంతరంగా చాచాలి. మళ్లీ మొదటి పొజిషన్‌కు వచ్చేయండి. ఇలా నిమిషంలో ఎన్ని సాధ్యమైతే అన్ని చేయండి.





మోకాళ్లకి..: వెల్లకిలా పడుకొని, దిండు/ పుస్తకాన్ని పట్టుకొని, చేతులు పైకి చాచండి. కాళ్లు పూర్తిగా జాపాలి. ఇప్పుడు దిండు/ పుస్తకాన్ని మీ ఛాతీపైకి తీసుకురండి. తరువాత మోకాళ్లను మీ ఛాతీని తాకించి, చేతుల్ని పైకి ఎత్తండి. మళ్లీ మొదటి భంగిమకు వచ్చేయండి. ఇదే విధంగా 15 సెట్లు చేయండి. 





తొడ కండరాలకు..: వెల్లకిలా పడుకొని, పిక్కల మధ్య దిండు/ పుస్తకాన్ని ఉంచండి. అదే పొజిషన్‌లో కాళ్లను పైకి లేపండి. గుర్తుంచుకోండి... దిండు/ పుస్తకం కింద పడకూడదు. అదే సమయంలో తలను కూడా నిదానంగా ఎత్తండి. తిరిగి మొదటి పొజిషన్‌కు వచ్చేయండి. ఇలా నిమిషంలో చేయగలిగినన్ని సెట్లు చేయండి. 

Updated Date - 2020-05-21T05:30:00+05:30 IST