మొబైల్‌తో ఎల్‌ఆర్‌ఎస్‌

ABN , First Publish Date - 2020-09-25T08:00:19+05:30 IST

లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(ఎల్‌ఆర్‌ఎస్‌) రిజిస్ట్రేషన్ల కోసం దరఖాస్తుకు ఇబ్బంది పడాల్సిన పనిలేదు. కేవలం ఒక్క క్లిక్‌ దూరంలోనే. మొబైల్‌తో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు...

మొబైల్‌తో ఎల్‌ఆర్‌ఎస్‌

  • ఒక్క క్లిక్‌ దూరంలో సేవలు ఫ వెబ్‌సైట్‌ లింక్‌
  • మొబైల్‌ యాప్‌ కూడా 
  • గతం కంటే సులువు చేసిన సర్కారు
  • పౌరులే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు
  • అయినా అదనపు వసూళ్లు
  • ఒక్కో దరఖాస్తుకు రూ.2000- 3000


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(ఎల్‌ఆర్‌ఎస్‌) రిజిస్ట్రేషన్ల కోసం దరఖాస్తుకు ఇబ్బంది పడాల్సిన పనిలేదు. కేవలం ఒక్క క్లిక్‌ దూరంలోనే. మొబైల్‌తో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. సెప్టెంబరు 1 నుంచి ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. వచ్చే నెల 15వ తేదీ వరకు గడువు ఉంది. ఇప్పటికే మూడు లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయని పురపాలక శాఖ వర్గాలు చెబుతున్నాయి. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపాల్టీలు, కార్పొరేషన్ల పరిధిలో ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం ఉంది. పురపాలక శాఖ వెబ్‌సైట్‌ లేదా ప్లే స్టోర్‌లో ఎల్‌ఆర్‌ఎస్‌-2020 యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని దరఖాస్తు చేయవచ్చు. 


దరఖాస్తు ప్రక్రియ ఇలా.. 

  1. http://lrs.telangana.gov.in ను ఓపెన్‌ చేయాలి. 
  2. వెబ్‌సైట్‌లో పై భాగాన ఎడమ వైపున ఉన్నapply for LRS 2020 ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. (ప్లే స్టోర్‌లో ఎల్‌ర్‌ఎస్‌ 2020 మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నా.. ్చఞఞజూడ ఔఖఖి పై క్లిక్‌ చేయాలి. 
  3. మొబైల్‌ నంబర్‌ అనే ఆప్షన్‌ వస్తుంది. అక్కడ దరఖాస్తుదారుడి ఫోన్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి జనరేట్‌ ఓటీపీ(వన్‌ టైం పాస్‌ వర్డ్‌)పై క్లిక్‌ యాలి. 
  4. ఆ ఫోన్‌ నంబర్‌కు వచ్చే ఆరు అంకెలను ఓటీపీ బాక్స్‌లో ఎంటర్‌ చేసి వాలిడేట్‌ ఓటీపీ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
  5. తర్వాత దరఖాస్తు నమూనా ఓపెన్‌ అవుతుంది. వ్యక్తిగత ప్లాట్‌/లే అవుట్‌ అనే రెండు ఆప్షన్‌లలో కావాల్సింది ఎంచుకోవాలి. వ్యక్తిగత ప్లాట్‌ క్రమబద్ధీకరించుకోవాలనుకునే వారు ప్లాట్‌, మొత్తం లే అవుట్‌ అయితే లే అవుట్‌ ఆప్షన్‌ వద్ద క్లిక్‌ చేయాలి. 
  6. మీ ప్లాట్‌ దేని పరిధిలోకి (మునిసిపాలిటీ/కార్పొరేషన్‌/గ్రామ పంచాయతీ) వస్తుందనేది ఎంచుకోవాలి. 
  7. ప్లాట్‌ మునిసిపాలిటీ పరిధిలోకి వస్తే మునిసిపాలిటీ ఆప్షన్‌ను ఎంచుకొని కిందనే ఉండే జిల్లాను కూడా సెలక్ట్‌ చేయాలి. జిల్లాలోని మునిసిపాల్టీల్లో మీ ప్లాట్‌ ఏ మునిసిపాలిటీ పరిధిలోకి వస్తే దానిని ఎంచుకోవాలి. 
  8. మునిసిపాలిటీ అయితే మండలం, వార్డు వివరాలు సెలక్ట్‌ చేయాలి. 
  9. కార్పొరేషన్‌ అయితే నేరుగా మీ ప్లాట్‌ ఉన్న కార్పొరేషన్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. 
  10. కార్పొరేషన్‌ పరిధిలో ప్లాట్‌ అయితే జోన్‌, సర్కిల్‌, వార్డును ఎంచుకోవాలి. 
  11. గ్రామ పంచాయతీ అయితే జిల్లా, మండలం, గ్రామ పంచాయతీ, రెవెన్యూ విలేజ్‌ (సేల్‌ డీడ్‌లో ఈ వివరాలు ఉంటాయి) సెలక్ట్‌ చేసుకోవాలి. 
  12. తర్వాత ప్లాట్‌ వివరాలు.. ఏ ప్రాంతం, ప్లాట్‌ నంబర్‌, సర్వే నంబర్‌, రెవెన్యూ విలేజ్‌, చదరపు గజాల్లో ప్లాట్‌ విస్తీర్ణం, సేల్‌ డీడ్‌ నెంబర్‌, సేల్‌ డీడ్‌ సంవత్సరం, సబ్‌ రిజిస్ట్రార్‌ వివరాలు నమోదు చేయాలి. 
  13. ఆ తర్వాత సేల్‌ డీడ్‌కు సంబంధించి.. మొదటి పేజీ (స్పష్టంగా వివరాలు కనిపించేలా), ప్లాట్‌ ప్లాన్‌ ఉంటే పేజీలను పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. 
  14. ప్లాట్‌ యుఎల్‌సీ పరిధిలో ఉండి.. ఇప్పటికే రెగ్యులరైజ్‌ అయి ఉంటే ఆ వివరాలను ఎంటర్‌ చేయాలి.
  15. తర్వాత దరఖాస్తుదారుల వివరాలు.. పేరు, తండ్రి/భర్త పేరు, ఆధార్‌ నంబర్‌, జెండర్‌, ఇంటి నంబర్‌, మీరు ఉండే ప్రాంతం గ్రామం/కాలనీ, నగరం, మండలం, జిల్లా, పిన్‌కోడ్‌  ఈ మెయిల్‌/జీ మెయిల్‌ ఐడీ, మరో ఫోన్‌ నంబర్‌ (ఆల్టర్నేట్‌) వివరాలు ఎంటర్‌ చేయాలి.
  16. అనంతరం ఐసీఐసీఐ గేట్‌ వే-1, ఐసీఐసీఐ గేట్‌ వే-2లలో ఏదో ఒకటి ఎంచుకొని, క్రెడిట్‌/డెబిట్‌, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారా రూ.1000 చెల్లించాలి. ఈ సమయంలో అడిగే ఫోన్‌ నంబర్‌కే ఎల్‌ఆర్‌ఎస్‌ సంబంధించిన సంక్షిప్త సందేశం వస్తుంది. ఇక్కడ మెసేజ్‌ ఎవరికి రావాలనుకుంటే వారి ఫోన్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. 
  17. పేమెంట్‌ పూర్తయిన అనంతరం వివరాలను ప్రింట్‌ తీసుకోవచ్చు. మొబైల్‌ నంబర్‌కు ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు సంఖ్యతో కూడిన సందేశం వస్తుంది. 


అయినా వసూళ్లు 

గతంలో రిజిస్టర్డ్‌ ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్‌ల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. సేల్‌ డీడ్‌, లింక్‌ డాక్యుమెంట్లు, లే అవుట్‌ కాపీ, టెక్నికల్‌ పర్సన్‌  సంతకం తదితరాలు అవసరం. ఇందుకోసం రూ.2000 నుంచి రూ.3000 తీసుకునేవారు. ఇప్పుడీ చిక్కులు, పైసా అదనపు ఖర్చు లేకుండా నేరుగా పౌరులు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. అయినా ఇప్పటికీ కొందరు టెక్నికల్‌  పర్సన్‌లు రూ.2000-3000 తీసుకుంటున్నారు. కొందరు మాత్రం రూ.500- 1000 చార్జీగా తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఈ తరహ అధిక వసూళ్లపై నియంత్రణ విధించాలని పౌరులు కోరుతున్నారు.

Updated Date - 2020-09-25T08:00:19+05:30 IST