Abn logo
Sep 17 2021 @ 19:16PM

వైష్ణోదేవి భక్తుల కోసం వెండి నాణెం విడుదల

జమ్మూ: నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్న తరుణంలో జమ్మూ - కశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా దేవి వైష్ణోదేవి ప్రతిమతో కూడిన 20 గ్రాముల వెండి నాణెన్ని గురువారం విడుదల చేశారు. వైష్ణోదేవి ఆలయ బోర్డు ఛైర్మన్‌గా జమ్మూ, కశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నరే వ్యవహరిస్తారు. రాజ్‌భవన్‌లో జరిగిన వైష్ణోదేవి ఆలయ పాలకమండలి 68వ సమావేశంలో ఈ వెండి నాణేన్ని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ విడుదల చేశారని అధికారులు తెలిపారు. అనంతరం రాజ్‌భవన్ అధికారులు మీడియాకు వివరాలను వెల్లడిస్తూ.. ‘‘ గతంలోనే వైష్ణోదేవి బోర్డు మాత ప్రతిమతో కూడిన రెండు, ఐదు, పది గ్రాముల బంగారు, వెండి నాణెలను విడుదల చేసింది. ఈ నాణెల వెల బరువును బట్టి ఉంటుంది. రాజ్‌భవన్‌లో ఉన్న దుకాణాలతో పాటు కాట్రా, జమ్మూ ఎయిర్‌పోర్టు, జమ్మూలోని వైష్ణవిధామ్ వద్ద ఈ నాణెలు లభిస్తాయి. వైష్ణోదేవి ఆధ్యాత్మిక కేంద్రంలో ఒక డిజిటల్ లైబ్రరీకి కూడా లెఫ్ట్‌నెంట్ గవర్నర్ శంకుస్థాపన చేశారు. అనంతరం బోర్డు ఆధ్వర్యంలోని ఆధ్యాత్మిక ప్రదేశాల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు ’’ అని అధికారులు వివరాలందించారు.