సమ్మెలో మధ్యాహ్న భోజన కార్మికులు

ABN , First Publish Date - 2021-12-08T05:10:12+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు అమలుచేస్తున్న మధ్యాహ్నభోజన పథకం ఉపాధ్యాయులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది.

సమ్మెలో మధ్యాహ్న భోజన కార్మికులు
ఇంటి నుంచి బాక్సులు తెచ్చుకుంటున్న విద్యార్థులు

- ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశాలు

- వంటావార్పుతో ఉపాధ్యాయుల ఉక్కిరికిబిక్కిరి

- పేదవిద్యార్థులకు తప్పని ఇక్కట్లు 

కరీంనగర్‌ టౌన్‌, డిసెంబరు 7: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు అమలుచేస్తున్న మధ్యాహ్నభోజన పథకం ఉపాధ్యాయులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఉపాధ్యాయులు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. ఇప్పటికే స్కావెంజర్లు లేకపోవడంతో పారిశుధ్యనిర్వహణతో ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులకు ఇప్పుడు మధ్యాహ్న భోజన సమస్య తలనొప్పిగా మారింది. కొవిడ్‌ నేపథ్యంలో మూతపడ్డ విద్యాసంస్థలు సెప్టెంబరు 1 నుంచి పునఃప్రారంభం కాగా, అప్పటి నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి ప్రారంభించారు. 

- పెండింగ్‌లో మూడు నెలల బిల్లులు

కొవిడ్‌తో ఆర్థిక ఇబ్బందులు పడ్డ మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, వంటకార్మికులు మూడు నెలలుగా బిల్లులు ఇవ్వకపోవడం, జీతాలు చెల్లించక పోవడంతో అప్పులపాలయ్యారు. మరోవైపు నిత్యావసర సరుకులు, కూరగాయలు, కోడిగుడ్ల ధరలు పెరిగినప్పటికీ ప్రభుత్వం మెనూ ధరలను సవరించక పోవడంతో ఏజెన్సీ నిర్వాహకులపై తీవ్ర ఆర్థికభారం పడింది. దీంతో మధ్యాహ్నభోజన ఏజెన్సీ నిర్వహకులు ధరలను సవరించాలని, వంటకార్మికులు తమ వేతనాలను పెంచాలని కోరుతూ ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. 

- జిల్లాలో 1,033 మంది కార్మికులు

జిల్లాలోని 654 పాఠశాలల్లో 1,033 మంది మధ్యాహ్న భోజన కార్మికులు మధ్యాహ్న భోజనాన్ని దాదాపు 60 వేల మంది విద్యార్థులకు అందజేస్తున్నారు. మూడు నెలల నుంచి బిల్లులు, వేతనాలు ఇవ్వక పోవడంతో దాదాపు రెండు కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లులను ఇస్తే తప్ప తాము మధ్యాహ్న భోజనాన్ని అందించలేమంటూ సోమవారం నుంచి ఏజెన్సీ నిర్వహకులు, భోజన కార్మికులు వంటావార్పును నిలిపివేయడంతో మధ్యాహ్న భోజనంపై ప్రభావం పడింది. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారులు వారికి సంబంధించిన బిల్లులను ట్రెజరీ నుంచి త్వరలోనే ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు పాఠశాలల్లో మధ్యాహ్న బోజన పథకాన్ని ఎలాగైనా అమలు చేయాలని, అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులే వంటావార్పు చేసి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయగా, మరికొన్ని చోట్ల కార్మికులను ఏదో రకంగా మెప్పించి వంటలు వండించారు. ఇంకొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు మధ్యాహ్నభోజనాన్ని అమలు చేయలేమని చేతులెత్తేసి బాక్సులను తెచ్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. దీంతో  రెండు రోజులుగా చాలా పాఠశాలల్లో విద్యార్థులు ఇంటి నుంచి బాక్సులు తెచ్చుకొని భోజనాలు చేస్తున్నారు. ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేసి విధిగా మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించాలని ఆదేశాలు రావడంతో ఉపాధ్యాయులు తలలుపట్టుకుంటున్నారు. 

Updated Date - 2021-12-08T05:10:12+05:30 IST