Abn logo
Oct 22 2020 @ 00:38AM

అసత్యమే ‘ట్రంప్’కార్డ్!

‘వాషింగ్టన్ పోస్ట్’ సమాచారం ప్రకారం 2020 జూలై నాటికి ట్రంప్ గత మూడున్నర సంవత్సరాలలో 20 వేల అసత్యాలాడారు, లేక తప్పుదారి పట్టించే ప్రకటనలు చేశారు. వీటిలో దాదాపు వెయ్యి, ఒక్క కొవిడ్‌–-19కు సంబంధించినవే. మొత్తంలో మొదటి పదివేల అసత్యాలు ఆయన అధికారానికి వచ్చిన తొలి 827 రోజుల లోనివే. ఆ పత్రిక కథనం ప్రకారం తదుపరి పదివేల అసత్యాలు ఆడడానికి ట్రంప్‌కు పట్టింది కేవలం 440 రోజులే. ఆయన అబద్ధాల పర్వంలో అనేక అంశాలు ‘మేమంటే మేమ’ని ముందుకు వస్తాయి. తన అభిశంసన ప్రక్రియ సందర్భంలో దాదాపు 1200 అసత్య ప్రకటనలు చేశారు.


విశ్వవ్యాప్తంగా ప్రతి చోటా, అన్ని స్థాయిల్లో వ్యక్తికి, వ్యవస్థలకి విశ్వసనీయతే ఊపిరి. మిగతావి ఎన్ని ఉన్నా విశ్వసనీయత లోపం వాటన్నింటిని హరించి వేస్తుంది. విశ్వసనీయతను ఒకసారి కోల్పోతే తిరిగి పొందటం దుర్లభం. వ్యక్తులు లేకుండా వ్యవస్థలు ఉండవు. కాబట్టి వాటి ప్రతిష్ఠ, పని తీరుతెన్నులు సమస్తం ఆయావ్యక్తుల విశ్వనీయత పైనే ఆధారపడి ఉంటాయి. ఈ వాస్తవాన్ని విస్మరించిన వారు ఎంతటి వారైనా ప్రజల దృష్టిలో పలచనవుతారు, అప్రదిష్టపాలవుతారు. జనజీవితంతో నిత్య సంబంధాలు కలిగగిన వారు తమ చేతల్లో, మాటల్లో ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి. కార్యాచరణలో చిత్తశుద్ధి వారి విశ్వసనీయతని పెంచుతుంది. దాన్ని కోల్పోవడమంటే అవన్నీ కోల్పోయినట్లే. 


కానీ, ప్రస్తుతం పలు ప్రజాస్వామ్య దేశాల్లో అధికారంలో ఉన్న వారి మాటలు ఆ విశ్వసనీయత కోల్పోవడం ఆనవాయితీ అయిపోయింది. అగ్రరాజ్యం అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో అగ్రస్థానంలో ఉండటం వర్తమాన ప్రపంచ పోకడలకు అద్దం పడుతోంది. పాలనలో ఎంతటివారైనా కొన్ని తడబాట్లు పడటం, తద్వారా నగుబాటు కావటం అసహజం ఏమీ కాదు. అయితే ఈ విషయంలో ట్రంప్‌తో పోటీ పడగలవారు ఎవరూ లేరు. ఇక ముందు ఉండబోరు. ఆయన ఎప్పటికప్పుడు తన రికార్డును తానే అధిగమిస్తున్నారని అనడానికి ఉదాహరణలు గణాంక సహితంగా కొల్లలు. అసలు పద్ధతి లేకపోడమనేదే ఆయన పద్ధతి. వివాదాలే విధానాలు. గిట్టని వారిని గేలి చేయడంలో దిట్ట. ప్రత్యర్థుల్ని తూష్ణీభావంతో తూలనాడటంలో ఆయనకు ఎవరూ సాటిరారు. శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ఎంతటి వారినైనా కించపరచడం, నిఘా విభాగాలపై చులకన భావం ప్రదర్శించటం, మీడియా కథనాలన్నీ అభూత కల్పనలే అని బుకాయించడం లాంటివి ట్రంప్ దైనందిన పని తీరు విలక్షణత. గతంలో అమెరికా అధ్యక్షులు అడపాదడపా మాటమార్చి ఉండవచ్చునేమో గాని ఈ స్థాయిలో పోటీపడినవారు, పడగలవారు మాత్రం ఎవరూ లేరు. 


‘వాషింగ్టన్ పోస్ట్’ సమాచారం ప్రకారం 2020 జూలై నాటికి ట్రంప్ గత మూడున్నర సంవత్సరాలలో 20 వేల అసత్యాలాడారు, లేక తప్పుదారి పట్టించే ప్రకటనలు చేశారు. వీటిలో దాదాపు వెయ్యి, ఒక్క కొవిడ్‌–-19కు సంబంధించినవే. మొత్తంలో మొదటి పదివేల అసత్యాలు ఆయన అధికారానికి వచ్చిన తొలి 827 రోజుల లోనివే. ఆ పత్రిక కథనం ప్రకారం తదుపరి పదివేల అసత్యాలు ఆడడానికి ట్రంప్‌కు పట్టింది కేవలం 440 రోజులే. ఆయన అబద్ధాల పర్వంలో అనేక అంశాలు ‘మేమంటే మేమ’ని ముందుకు వస్తాయి. తన అభిశంసన ప్రక్రియ సందర్భంలో దాదాపు 1200 అసత్య ప్రకటనలు చేశారు. 


2017లో ‘సిఎన్‌ఎన్’ వార్తలపై ప్రతిస్పందిస్తూ ‘తప్పుడు వార్తలు’(ఫేక్ న్యూస్) అనే మాటను ట్రంప్ తొలిసారి ప్రయోగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్విట్టర్‌లోనే ఐదు వందల సార్లు పునరుద్ఘాటించారు. వాషింగ్టన్ పోస్ట్, సిఎన్‌ఎన్, న్యూయార్క్ టైమ్స్‌ పత్రికలనుద్దేశించి కొన్ని డజన్లసార్లు ‘ప్రజా శత్రువులు’ అని అభివర్ణించారు. దీనివల్ల వాటికి వాటిల్లిన ముప్పు కంటే బహుశా ఆయనకు జరిగిన హానే ఎక్కువగా ఉండొచ్చు, నిజానికి ‘ఎకనామిస్ట్’ అధ్యయనం ప్రకారం వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ పత్రికల ప్రజావిశ్వసనీయత 2016–2018 మధ్య కాలంలో బాగా పెరిగింది. అదే సమయంలో ట్రంప్‌కు అనుకూలంగా ఉండే ‘ఫాక్స్ న్యూస్’ మొదలైనవి ప్రజావిశ్వాసాన్ని కోల్పోయాయి. ‘The Pew’ పరిశోధన విభాగం కూడా గత జనవరిలో ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. మాములుగా తటస్థంగా ఉండే జాతీయ పత్రికలు ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల తరుణంలో ట్రంప్‌కు వ్యతిరేకంగా వరుస సంపాదకీయాలు రాస్తున్నాయి. ఎవర్ని ఎంచుకోవాలో కూడా అవి సూచిస్తున్నాయి. కొన్ని పత్రికలు ఏకంగా పేజీలకు పేజీలు గత ఎన్నికల వాగ్దానాలను, వాటి ఆచరణలో గల వ్యత్యాసాలను పట్టికల రూపంలో ప్రచురించాయి. ఇవి రెండు విధాలుగా ప్రభావం చూపుతాయి. ప్రజాస్వామ్యం ముసుగులో ఎంతటి నియంతృత్వ పోకడలు ఉంటాయో పూర్తిగా తేటతెల్లం చేస్తాయి. రెండోది ప్రత్యర్థులు, విమర్శకుల పై దాడికి, వారి నోరు మూయించడానికి దారి చూపుతాయి. ‘ఫ్రీడమ్ హౌస్’ సమాచారం ప్రకారం 2017 జనవరి- 2019 మే మధ్య కనీసం 25 దేశాలు మీడియా స్వేచ్ఛను నియంత్రించే చట్టాలు చేశాయి. ఇవన్నీ ట్రంప్ స్ఫూర్తితో ప్రవర్తిస్తున్నవే. సిఎన్‌ఎన్‌ని ఏకాకి చేయడంలో ఇజ్రాయెల్ ట్రంప్‌నే అనుకరించింది.


ట్రంప్ మాటలే కాదు, చేతలు కూడా ఆయన సామర్థ్యానికి నిలువుటద్దం. యావత్ ప్రపంచం భూతాపం ముప్పు గురించి ఆందోళన చెందుతున్న సమయంలో ప్యారిస్ ఒప్పందం నుంచి, మానవాళి అంతా వైరస్ కల్లోలంలో మునిగిఉన్నప్పడు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగడం, అంతకు ముందే అణు ఒప్పందం నుంచి బయటకు రావటం ట్రంప్ పనితీరుకు, ఆలోచనా విధానానికి నిదర్శనం. అంతేగాదు, ఐక్యరాజ్య సమితిలో కీలక విభాగాలను చేజేతులా చైనాకు అప్పగించిన ఘనత ట్రంప్‌కే దక్కింది. అమెరికా నాయకత్వంలోని కూటమి సభ్యులలో సఖ్యత లోపించటం, పరస్పరం సంఘర్షించుకోవడం ట్రంప్ పుణ్యమే. ఫలితంగా అగ్రదేశంగా గుర్తింపు పొందుతున్న దేశం ఇంత అధమస్థాయికి దిగజారుతుందా? అనే సందేహాలు విజ్ఞులలో రేకెత్తుతున్నాయి. మామూలుగా అధికార పక్షానికి అనుకూలంగా ఉండే అమెరికన్‌ మీడియా సైతం ట్రంప్ చలవతో అన్నిచోట్ల సమర్ధకులు, వ్యతిరేకులుగా విడిపోయింది. ‘The Pew’ నివేదిక ప్రకారం రిపబ్లికన్లు ప్రధాన జనస్రవంతి విశ్వాసం కోల్పోయారు. 


ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికలలో వ్యతిరేక ఫలితాలు వచ్చినా, ఆ నెపం ఎన్నికల తీరుపై, ప్రత్యర్థులపై నెట్టటానికి ట్రంప్ ఆయుధాలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే అధికార మార్పిడి ఓ పట్టాన సాఫీగా జరిగేటట్లు కనిపించడం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. ఒకవేళ ఆఫీసు వీడినా ఇప్పటిదాకా ఆయన నిర్వాకాల కారణంగా వాస్తవాలతో సంబంధాలు తెగిన తీగల్ని సరి చేయడానికి సంవత్సరాలు పడుతుంది. ఒకవేళ తిరిగి అధికారానికి వస్తే వాస్తవాలపై ఆయన నిరంతర దాడి కొనసాగుతూనే ఉంటుంది.


తొలిసారి శ్వేతసౌధంలోకి రాగానే తనకు ఇష్టం లేని ప్రధాన మీడియాకు అడ్డంకులు కల్పించటానికి ట్రంప్ వెరవలేదు. ‘ఎటి&టి’, ‘టైం వార్నర్’ కలిసిపోవటాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాని యజమాని సిఎన్‌ఎన్’కి చెందిన వాడవడమే దీనికి కారణం. అమెజాన్‌ అధినేత జెఫ్ బెజోస్ ‘ది పోస్ట్’ యజమాని కావడం వల్ల ఆ సంస్థకు కూడా పలు ప్రతిబంధకాలు కలిగించారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికైతే వాటన్నింటిపై దాడిని మరింత ఉధృతం చేయవచ్చు. ఒత్తిళ్లు తెచ్చి వాటిని తన అనుయాయులకు అమ్మక తప్పని పరిస్థితులు కల్పించవచ్చు. వివిధ రంగాలకు చెందిన నిపుణుల కన్నా విధేయులకే ఉన్నత ఆసనాలన్నీ లభించవచ్చు. ప్రభుత్వ సమాచార, ప్రసార, ప్రచార వ్యవస్థలన్నీ ఆయన స్వరంతోనే గాన లహరి వినిపించవచ్చు.


ప్రజాస్వామ్యంలో కొన్ని విలువలు, ప్రమాణాలు, నైతికత, సంప్రదాయాలు ఉంటాయి. వ్యవస్థల పట్ల విశ్వాసం, గౌరవం, నమ్మకం లాంటివి వాటిలో చాలా ముఖ్యమైనవి. బాధ్యతగల సమర్ధ పాలకులు ప్రజలకు ఆదర్శప్రాయులవుతారు. వారి అడుగుజాడల్లో ప్రజలు స్వీయబాధ్యతల్ని గుర్తెరిగి మసలుకుంటారు. అసత్య పునాదులపై నిర్మాణమైన ప్రజాస్వామ్య అపహాస్య సౌధాలు ఏ క్షణంలో నైనా కూలిపోతాయి. వాటి శకలాల కింద మనం విశ్వసించే విలువలన్నీ మౌనంగా రోదిస్తూ విలవిలలాడుతాయి. ఏ స్థాయిలోనైనా నాయకులనే వారు ఎట్లా ఉండాలో అన్ని విధాలా ఆచరణలో చూపాలి. 


స్థల, కాల, సందర్భ, స్థాయిల కతీతంగా ప్రజాస్వామ్య ప్రేరణతో మానవీయ విలువలను కాపాడగలిగితేనే అవి మనల్ని కాపాడతాయి. సత్యసంధతే అందుకు జీవధాతువు. ధర్మం లాగే సత్యం కూడా, దాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. మానవాళి మనుగడకు సత్యమే పునాది అని మరువకూడదు. 


-బి. లలితానంద ప్రసాద్

విశ్రాంత ఆచార్యులు

Advertisement
Advertisement
Advertisement